10, ఫిబ్రవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1320 (పులి గడ్డిని మేయు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్.

26 కామెంట్‌లు:

  1. కలికాలములో వింతలు
    పలు రకములు చిత్రములయి ప్రభవించు కదా
    తలపుల కందని విధముగ
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్

    రిప్లయితొలగించండి
  2. కలతలు రేపెడి వింతలు
    కలియుగ మున జరుగు చున్న కాకో లమ్ముల్
    తలచిన విస్మయ మొందగ
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్

    రిప్లయితొలగించండి
  3. పలుకంగా తరమగునే
    యిలలో నెవ్వారిభాగ్య మెటులుండునొ? నౌ
    కలు బండ్లౌటను కనమా,
    పులిగడ్డిని మేయు మాంసమును దిను జింకల్.

    రిప్లయితొలగించండి
  4. కలియుగమున కొల్లలుగా
    యలివేణులు బహుమతులై యలరుచునుందన్,
    కలిదోషము గాకపోదె,
    పులి గడ్డి మేయును, మాంసమును దిను జింకల్.

    రిప్లయితొలగించండి
  5. తిలకించితినొక వింతను
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్
    నిలలోగనలేదుసుమీ
    కలలోనిదిగాంచినేను కడుచిత్రముగన్

    రిప్లయితొలగించండి

  6. అదిగో అల్లదిగో వచ్చుచున్నది ఎన్నికలు
    నాయకుడు కాళ్ళ వేళ్ళ బడున్ ఒద్దికై
    ఓటరు ఒద్దికై గైకొను సర్వ గ్రాహ్యముల్
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్.!!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    ABN ఆంధ్ర జ్యోతి, ఈనాడు వార పత్రిక లో వచ్చిన వార్త, అక్కడ పులి సాధు జంతువు పులితో ఆడు కొని ఫోటో దిగిన వారిని జుపినారు,ఆ సంఘటన ఆధారముగా నా పూరణ
    =============*================

    కలియుగ ముని యాశ్రమమున
    పులి గడ్డిని మేయు,మాంసమును దిను జింకల్,
    తిలకించి జనులు ముదమున
    పులి తోడను నాడి చిత్రములు గైకొనియెన్!

    రిప్లయితొలగించండి
  8. కలికాలము బ్రహ్మంగా
    రిల మార్పులు జరుగు నంచు నెపుడో చెప్పెన్
    తిలకింతురు మును ముందును
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    పలు రుగ్మతలును మందులు
    కలిసిన రక్తమ్ములిపుడు కలుషిత మనుచున్
    పులి వదలె మాంస భక్షణ
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ,
    కలికాలపు వింతలుగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఇంతకీ ‘కాకోలము’ ఏ అర్థంలో వాడారు? దానికి అన్వయం?
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    రఘుకుమార్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కొల్లలుగా నలివేణులు’ అని ఉండాలి. ‘బహుమతులై’ అన్నచోట గణదోషం. ‘బహుమతులయి’ అంటే సరి. అలరుచునుండన్ - టైపాటు వలన అలరుచు నుందన్ అయింది. మూడవ పాదంలో గణదోషం. ‘కలిదోషముననె గాదే’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    స్వప్నవృత్తాంతంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జింకల్ + ఇలలో’ అన్నప్పుడు నుగాగమం రాదు. మీ చివరి రెండు పాదాలకు నా సవరణ....
    తిలకించనైతి నిలలో
    కలలో గాంచితిని నేను కడు చిత్రముగన్.
    *
    జిలేబీ గారూ,
    మంచి భావాన్ని అందించారు. మిత్రులెవరైనా పద్యరూపాన్ని ఇస్తారో చూద్దాం.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    ‘ముని + ఆశ్రమము’ అన్నప్పుడ యడాగమం కాదు యణాదేశం వస్తుంది. అక్కడ ‘మున్యాశ్రమమున’ అన్నా సరిపోతుంది. జనులు గైకొనియెన్... క్రియాపదం ఏకవచనం... ‘చిత్రములు గాంతరయా’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. కలి కాలపు మహిమేయిది
    పలువిధముల నాశమైన వనసంపదలన్
    మలుగును ప్రకృతియె, నిజముగ
    పులిగడ్డిని మేయు మాంసమున్ దిను జింకల్

    రిప్లయితొలగించండి
  13. ధన్యవాదములు గురువుగారు...

    తిలకించితినొక వింతను
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్
    తిలకించనైతి నిలలో
    కలలోగాంచితినినేను కడుచిత్రముగన్

    రిప్లయితొలగించండి
  14. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. విలపించుచు నాకలితో
    కలికాలము లోన తిండి కరవై పృథ్విన్
    పలు వింతలలో నొకటిగ
    పులి గడ్డి మేయు మాంసమును దిను జింకల్.

    రిప్లయితొలగించండి
  16. గురువులకు ప్రణామములు
    కాకోలము = అసురము ,విషము , ఒకవిధమగు నరకము , నరక విసేషము ఇలా చాలా అర్ధాలు ఆంధ్ర భారతిలో దొరికాయి అదన్నమాట అసల్ సంగతి

    రిప్లయితొలగించండి
  17. మీ సూచనలకు ధన్యవాదములు గురువుగారు.
    నేను ఇప్పుడే మొదలు పెట్టాను. మీ సూచనల ననుసరించి పద్యం మళ్ళీ వ్రాస్తున్నాను.
    కలియుగమున కొల్లలుగా
    నలివేణులు బహుమతులయి అలరుచునుండన్
    కలిదోషముననె గాదె,
    పులి గడ్డి మేయును, మాంసమును దిను జింకల్.

    రిప్లయితొలగించండి
  18. నాగరాజు రవీందర్ గారూ,
    శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలమంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    ఆ‘కలి’కాలంలో వింతగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఆంధ్రభారతిలో ఆ అర్థాలను నేనూ చూశాను. కానీ మీరు ఏ అర్థాన్ని గ్రహించారు, దానికి అన్వయం ఏమిటి?
    *
    రఘుకుమార్ గారూ,
    సంతోషం.
    మూడవపాదం ‘గాదే’ దీర్ఘాంతం కావాలి.

    రిప్లయితొలగించండి
  19. ప0డిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు

    తుల లేని అడవిరాజుర
    పులి, గడ్డినిమేయు ,మాంసమునుతిను ,జింకల్
    విలవిల లాడగ నృత్య
    మ్ములుసేయగ నానతించు పులి రాజు గదా !

    రిప్లయితొలగించండి
  20. క్షమించాలి
    ఈ కలియుగంలో మనసున్న మనుషులే ఇలా రాక్ష సత్వము తో ఒక విధమైన నరకాన్ని సృష్టిస్తుంటే ఇక పులి గడ్డి తినడం లో వింతేముంది అని నా ఉద్దేస్యము
    పొరబడితే ఏముంది ? మన్నిం...చడ..మే

    రిప్లయితొలగించండి
  21. పులిదీసి జింకకడ జిం
    కల బెట్టుము పులిని దీసి కడకీ మాటన్
    కలదర్ధమెట్లు జెప్పుమ
    " పులి గడ్డి మేయు మాంసమును దిను జింకల్."

    రిప్లయితొలగించండి
  22. సరదాగా ఓ చిన్నవాడితో జరిగిన సంభాషణగా:
    నేను : "తలతిక్కరేపు మాటలు
    పలుకుమురా చిన్నవాడ ఫక్కున నవ్వన్"
    చిన్నవాడు: " చలిచీమలు యోండ్రపెట్టు
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్".

    రిప్లయితొలగించండి
  23. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు నమస్కృతులు......
    దయచేసి భావ, గణదోషములను సవరించ మనవి..

    కలియుగమున జరిగెడి మా
    ర్పులు తట్టుకొనక వలవల రోధించుచు ఆ
    కలికోర్వక వనచరులగు
    పులి గడ్డి మేయు మాంసమును దిను జింకల్.

    రిప్లయితొలగించండి
  24. జిలేబీయము:

    బలవంతులైన నేతలు
    కలవరపడి ప్రజల కాళ్ళు కడిగిరి
    కనుమా!
    కల కాదెన్నికలివిగో!
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్!

    రిప్లయితొలగించండి


  25. కలికాలమండి ! యేమం
    దు! లిప్త కాలంబున ప్రకృతులు మారెనయా!
    చెలిమరి శాస్త్రిజి ! పోరచి,
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. అల కలకత్తా నగరిని
    తెలగాణను పుట్టి పెరిగి తేకువ మీరన్
    వలపుల వలలో చిక్కగ
    పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్

    రిప్లయితొలగించండి