8, ఫిబ్రవరి 2014, శనివారం

పద్య రచన – 501

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(లక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు)

19 కామెంట్‌లు:

  1. ముంగిటను రంగు రంగుల ముగ్గులెన్నొ
    పెట్టి ముచ్చట గూర్తురు వినయమలర
    తెలుగు నాట కనుల విందు గొలుపు నటుల
    నందముగ దీర్చి దిద్దుచు నాడువారు

    కనుల పండువు గొలుపగ కనుమ నాడు
    రంగవల్లులలో నొక్క రథము నమిత
    హర్ష మలరార వ్రాసెద రద్భుతముగ
    చూడుడీ రథమునన్ గల సూర్య విభుని

    అరదము నెక్కి పద్మహితు డభ్రపథమ్మున నేగుచుండు సం
    బరమున నుత్తరాయణపు మాసములందు శుభప్రదమ్ముగా
    కరము చెలంగు లోకములు క్రన్నన నా సమయమ్ములోననే
    పరమ పదమ్ము జేరెదరు పావన మూర్తులు యోగిపుంగవుల్

    రిప్లయితొలగించండి
  2. పల్లె సీమల యందాలు వెల్లి విరియ
    రంగ వల్లులు ముంగిట రాగ మలరె
    స్వాగ తించెను భానుని సప్త మియని
    తిరుగు చుండెను ముగ్గుల తేరు పైన

    రిప్లయితొలగించండి
  3. రథము మ్రుగ్గు జూడ రమణీయముగనుండె
    రమణి యొకరు వేసె రంగులీన
    రవినియందు నిలిపె రాజిల్ల తన మనో
    రథము దీర్చు కొనియె రండు కనుడు.

    రిప్లయితొలగించండి
  4. రధసప్తమినాడుదయము
    రధములముగ్గులనువేసి రమణీయముగన్
    మధురంబగుపరమాన్నము
    విధిగా రవికొసగుగాదె వేడుక తోడన్

    రిప్లయితొలగించండి
  5. తూర్పు కొండల దేవుని తొలుత మ్రొక్కి
    ముదిత భక్తితో యరదపు ముగ్గుఁ బెట్ట
    మురిసి పయనింప దిగెస్వామి ముగ్గు లోకి
    భక్తి పరమాత్మఁ మురిపించి పట్టి తెచ్చు

    రిప్లయితొలగించండి
  6. ముత్యాల తేరుపై మురిపింప లోకాల
    .........దినరా జధివసించె ఘనముగాను
    రత్నాల రథము పై రమ్య భాస్కరముల
    ......... వెలుగుల యెకిమీడు వెడలినాడు
    పగడాల యరదమ్ము పరుగిడ రయముగా
    .........మార్తాండు డల్లదే మరలినాడు
    హరిదశ్వ శకటమ్ము బిరబిర పరుగిడ
    .........భానుడు పడమట వాలినాడు

    రంగవల్లిని నేడిట రాజిలెడిని
    మిత్రు డల్లదే కొలువుండి మించి గనుడు
    కర్మ సాక్షికి భక్తితో కైమొగిడ్చి
    ఆయు రారోగ్య భాగ్యాల నందుకొనుడు.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారు,
    నెట్ లేకపోవడం వల్ల చూడలేదు. నేను ఇంకా పెద్ద ముగ్గులు, బాగున్నవి పెట్టినది బహుశా మీరు చూసి ఉండరు. హడావిడిగా రెండు నిముషాలలో వేసిన ముగ్గును మీరు ఇక్కడ పెట్టడం, కవిమిత్రులు చీకాకు పడక పద్యములను చెప్పడం వల్ల నేను ధన్యురాలనైనాను.

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    మీ పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘రవి కొసగు గాదె’ అన్నదానిని ‘రవి కొసగ నొప్పు’ అంటే ఇంకా బాగుంటుంది.
    *
    మిస్సన్న గారూ,
    కర్మసాక్షి ఇచ్చే భాగ్యమేమో కాని, సీసపద్యంలో మీరిచ్చిన కవిత్వాన్ని ఆస్వాదించి ఆనందించే భాగ్యం మాత్రం కలిగింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఉత్తరాయణ మొనరించ చిత్త మలరు
    ముద్దులొలికించు ముత్యాల ముగ్గు తేరు
    ముంగిటను సిద్ధముగనుంది మోదమునను
    రమ్ము దినకరా! మా కుటీ రమ్ము నేడు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారి పద్యమునకు చిన్న సవరణలు:

    3వ పాదమును ఇలాగ మార్చుదాము:
    ముంగిటను సిద్ధమయ్యెను మోదమలర --

    ఆఖరి పదములు కుటీరమ్ము నేడు కి బదులుగా కుటీరమ్ము జేర అంటే బాగుంటుంది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ పండిత నేమాని గురువరులకు ధన్యవాదములు
    మీ సవరణ ప్రకారం

    ఉత్తరాయణ మొనరించ చిత్త మలరు
    ముద్దులొలికించు ముత్యాల ముగ్గు తేరు
    ముంగిటను సిద్ధమయ్యెను మోదమునను
    రమ్ము దినకరా! మా కుటీ రమ్ము జూడ .

    రిప్లయితొలగించండి
  12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు

    పద్య రచన ముగ్గులరథము:
    ఎంత ప్రేమతో వరుని కై యింతి నీవు
    మురిపేముగ రచియించితి ముగ్గు రథము
    యేడుగుర్రముల్ రేడు నీవేడి కోలు
    మెచ్చి యనువర్తు డగు భర్త నిచ్చు గాత

    రిప్లయితొలగించండి
  14. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.
    ‘రథము + ఏడు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘రథము/ నేడుగుర్రాల రేడు.." అనండి.

    రిప్లయితొలగించండి
  15. తూర్పు కొండల దేవుని తొలుత మ్రొక్కి
    ముదిత భక్తితో యరదపు ముగ్గుఁ బెట్ట
    మురిసి పయనింప దిగెస్వామి ముగ్గు లోకి
    భక్తి పరమాత్మఁ మురిపించి పట్టి తెచ్చు

    రిప్లయితొలగించండి
  16. సహదేవుడు గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  17. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వ౦దనములు
    మీసూచనకు ధన్యవాదములు పద్యమునుసవరణ గావించు కొంటిని

    రిప్లయితొలగించండి
  18. గురువులకు వందనములు, సాహితీ మితృలకు అభినందనలతో,
    సరదాగా వ్రాసిన రచన.....
    సాగిపోవుటకిదియెంతొ సాయపడును
    పొద్దు దొడ్డది దీనిపై పోవుమనుచు
    మెలికి ముగ్గును వేసెను కలికి నేడు
    చిక్కుకొనెయెను దినరాజు చిత్రముగను.

    రిప్లయితొలగించండి