12, ఫిబ్రవరి 2014, బుధవారం

పద్య రచన – 505

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. వనమయూరము:
    ఉన్నదదిగో వనమయూరవర మోహో
    కన్నులకు విందగుచు కాంచుడు బళారే
    ఎన్నబడె జాతి కదియే విహగమంచున్
    సన్నుతుల నందుచును సర్వ శుభదంబై

    నీలకంఠమ వీవు నిన్ను దలంచుచో
    ....నటరాజె మదిని కన్పట్టుచుండు
    నీలకంధరమంచు నిన్ను నే నెన్నుచో
    ....కనవచ్చు నీలి మేఘముల గుంపు
    నీ సహస్రేక్షణల్ నేను భావించుచో
    ....త్రిదశేశ్వరుండు నా మది జెలంగు
    ద్విజరాజమనుచు నీ విభవమ్మును నుతింప
    ....ధాత్రీసురాళియే తనరు నెదుట
    అమరసేనాధినాథు వాహనమవీవు
    కృష్ణు శిరముపై నీ పింఛ మింపు గూర్చు
    గణుతి కెక్కితి వీరీతి గాదె నీవు
    నీదు భాగ్యచయమును వర్ణింప తరమె?

    ఒనరింతువు క్రేంకారము
    కనువిందగు నాట్య సరళి క్ష్మాతలమున నీ
    వనుపమ కీర్తి గడించితి
    ఘన మిత్రమ! నిన్ను బొగడగా మా తరమా?

    రిప్లయితొలగించండి
  2. కనువిందు జేయు నెమలిని
    విను వీధుల నెగర లేను విహంగమునై
    మనుజులు సంతస మొందుచు
    కనులను పెకలించు వేడ్క కాఠిన్యమునన్

    రిప్లయితొలగించండి
  3. నెమలిపింఛంపు చీరెనే నీటుగాను
    నెలత గట్టిన విధముగా నెమలియుండె
    క్యాటు వాకుకు తయ్యారు గాను నిలిచె
    కనుడు, వినుడది పిలిచెను క్వాకు క్వాకు

    రిప్లయితొలగించండి
  4. నెమలిపింఛంపు చీరెనే నీటుగాను
    నెలత గట్టిన విధముగా నెమలియుండె
    క్యాటు వాకుకు తయ్యారు గాను నిలిచె
    పక్షి సొగసును మెచ్చెలే భరత జాతి.

    రిప్లయితొలగించండి
  5. వేయి కనులన్ గనుము వేయి కనులందాల్ !
    హాయి గొనుమా నిలిచి యందమునఁ జూపెన్
    ఛాయలును, పల్వగలు! సంభ్రమము తోడై
    యూయల యగున్, వన మయూరమె మనమ్మౌ !

    వేయి కనులతో ఆ వేయి కనులందాల కనుము, నిలిచి పలు ఛాయలను వగలను జూపెను హాయి గొనుమా,
    సంభ్రమముతో వనమయూరము వంటి మనము ఊయల యగును.

    రిప్లయితొలగించండి


  6. వేయి కనులన్ గనుము వేయి కనులందాల్ !
    హాయి గొనుమా నిలిచి యందమునఁ జూపెన్
    ఛాయలును, పల్వగలు! సంభ్రమము తోడై
    యూయల యగున్ వన మయూరము మనమ్మే !

    వేయి కనులతో ఆ వేయి కనులందాల కనుము, నిలిచి పలు ఛాయలను వగలను జూపెను హాయి గొనుమా,
    సంభ్రమముతో వనమయూరము వంటి మనము ఊయల యగును.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    వనమయూరాన్ని వర్ణింస్తూ సుందరమైన ఖండికను రచించారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘విహగము నేనై’ అందాం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    ఏ వృత్తములో ఆ వృత్తము పేరు కూడా వ్రాయబడునో దానిని ముద్రాలంకారము అందురు కదా. ఈ అలంకారమును నేనును శ్రీమతి లక్ష్మీ దేవి గారును పాటించితిమి అని మీరు వ్యాఖ్య చేసెద రనుకొంటిని. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. మురిపించెడిరూపముతో
    కురిపించెడి కళనుజూడ కూరిమి గలుగున్
    శరజన్మునివాహనమౌ
    పురిపులుగూ,నీసొగసుని బొగడగ తరమా!

    రిప్లయితొలగించండి
  10. నెమలి నెంతయో ప్రేమించు నీటు గాడు
    బొమ్మ నెమలిని బెట్టించె ముదము తోడ
    రంగులన్నియు వేయించి రమ్యముగను
    జీవముట్టిపడునటుల చెన్నుగాను

    రిప్లయితొలగించండి
  11. భారత జాతీయ పక్షి రాజము

    రంగులద్దినమౌళి వల్లి విలాసమొప్పిన యందమున్
    నింగి నేలిన పక్షిరాజమ!నీదు రాజస ఠీవియున్
    హ౦గు దేలు విశాల వక్షము శ్యామ కంఠము నిన్ను చ౦
    పంగ నేరము భారతావని పక్షి చిహ్నము జాతికిన్

    మూడు వందల యేబదారుల ముఖ్యమైన నదీ జల
    మ్మీడుగా జలకమ్ము లాడిన ఈశ పుత్రుని వాజివై
    క్రీడ లాడిన బాల కృష్ణు కిరీట మందున హాళివై
    ఆడు నాట్యము పొందుకై తన ఆయితమ్మునుజూపుచున్

    కల రవమ్ముల కోకిలల్ శుక క్రౌంచ చాతక కౌజుకూ
    తలను మించు నిషాదరావము ధత్రమందు ప్రతిధ్వనుల్
    కలుగ జేయగ పన్నగమ్ములు కంతలందున బార భూ
    తలఖగమ్ముల నేలుచుందువు ధర్మ బద్ధుడవై సదా

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    మీ యిరువురి ‘ముద్రాలంకారాలను’ గమనించాను. కాని వ్యాఖ్య వ్రాసే సమయంలో మరచిపోయాను. మన్నించండి.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరి పాదాన్ని ఇలా అనండి. “పురిపులుగా నీ సొగసును....’
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ ఖండిక కవితామయూరం నాట్యం చేసినట్లున్నది. అభినందనలు.
    ‘చాతక కౌజు..’ అన్నప్పుడు అన్వయం కుదరడం లేదు. ‘ధత్రమందు’...? అది ‘ధాత్రియందు’కు టైపాటా?

    రిప్లయితొలగించండి
  13. వాటే బ్యూటీ పీకాక్!
    సాటెవ్వరు లేరు నీకు సరసాంగివనన్!
    మాటే చాలదు పొగడగ!
    పైటై పింఛంబు మెరయ పాటై దొరలున్!

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురుదేవులకు వందనములు మీఅభినందన లకు కృతజ్ఞతలు మీసూచనలు శిరోధార్యములు

    రిప్లయితొలగించండి
  15. శ్రీశంకరయ్యగారికి నమస్సులు ధత్రమనగా ఆకాశము

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులిరువరికీ ధన్యవాదాలు.

    తిమ్మాజీ రావు గారు, అందమైన పద్యాలలో ఎనో సంగతులు తెలిపినారు.

    రిప్లయితొలగించండి
  17. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు నమస్కృతులు......
    దయచేసి భావ, గణదోషములను సవరించ మనవి..

    మకుట ధారిణి సొగసుల పక్షి రేడు
    కట్టు పంచెవోలె పించ ముట్టి పడగ
    రాచ ఠీవితో వనమందు రాజ్య మేలు
    నెమలి బొందె నుపాదిని సముచితంగ
    భరతఖండంబు జాతీయ పక్షి గాను.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సుదర్శన్ కుస్మ గారికి శుభాశీస్సులు.
    మీ పద్యమును చూచితిని. కొన్ని మార్పులు చేసితిని:

    నెమలి మకుటధారిణి పక్షి నిచయ రాజు
    కనుల విందగు సొగసుల నలరుచుండు
    రాచ ఠీవితో వనమందు రాజ్యమేలు
    భరత దేశంపు జాతీయ పక్షి యనగ

    రిప్లయితొలగించండి
  19. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్కృతులు......
    పద్యమును సవరించి ప్రోత్సహించినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి