15, జనవరి 2015, గురువారం

సమస్యా పూరణం - 1581 (కష్టములఁ దెచ్చు మకరసంక్రాంతి మనకు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కష్టములఁ దెచ్చు మకరసంక్రాంతి మనకు.

29 కామెంట్‌లు:

  1. భోగ భాగ్యములు గలుగు భోగి నాడు
    సిరియు సంపద లువిరియు శివుని గృపను
    పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
    పాడి పంటల వృద్ధియు బాగు గాను
    కనుము దినమున మొదలిడు ననుట నిజము

    సంక్రాంతి శుభా కాంక్షలు
    సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
    సంక్రాంతి మూడు రోజులు
    శంకరు నే వేడు కొనుడు సహ చరు లారా !

    రిప్లయితొలగించండి
  2. కోడి మరో కోడితో:
    కోడిపందేల పేరుతో గుంపు జేరి
    కరకు బుద్ధిగల్గినయట్టి నరులు మనకు
    కత్తులను కట్టి మనపోరు కాంచుచుండు
    కష్టములఁ దెచ్చు మకరసంక్రాంతి మనకు

    రిప్లయితొలగించండి
  3. దుష్ట జనముల స్నేహము దురితములను
    గ ష్టములను దెచ్చు, మకర సంక్రాంతి మనకు
    సకల సంపద లొనగూ ర్చి సతతము నిల
    వెలుగు కాంతుల నీయును వేదినములు

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు
    సోదర సోదరీ మణు లందరికీ సంక్రాంతి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి, కవి మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  6. త్రాగి వీధినందొకడాడు తందనముల
    కోడి పందెములను వేసి గొంపగుల్ల
    సలుపు నొక్కడది కనిన సతులె యంద్రు
    "కష్టములఁ దెచ్చు మకర సంక్రాంతి మనకు"

    రిప్లయితొలగించండి
  7. పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరికీ... సంక్రాంతి ... శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  8. కష్టములుదెచ్చుమకరసంక్రాంతిమనకు
    వలదు,వలదిల"శంకరా|పండుగన్న?
    సంతసంబునుసర్వులవంతునింప
    గూర్చనెంచగరాశివా|గుట్టుగాను".

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురువు గారికి ,యితర కవి మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    అమ్మ వారిని మనసార నమ్మ, యేల
    కష్టముల దెచ్చు? మకర సంక్రాంతి మనకు
    యిష్ట మైనట్టి పంటల నింట జేర్చు
    సకల శుభముల చేకూర్చు శాంతి నిచ్చు !!!

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
    శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యాలు, పూరణ బాగున్నవి. అభినందనలు.
    రెండవపద్యం చివరిపాదంలో ప్రాస తప్పింది. ‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్’ అందామా?
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కాంచుచుండు’ అన్నదాన్ని ‘కాంచుచుంద్రు’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వీధియం దొకడాడు...’ అనండి.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు
    ‘మనకు| నిష్టమైనట్టి...’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. నీతి నియమమ్ము తప్పుచు నేత బలుక
    కోళ్ళ పందెములాటలు గుంపు గూడి
    కష్టములఁ దెచ్చు , మకరసంక్రాంతి మనకు
    శాంతి సంపదల నొసగి సౌఖ్య మిచ్చు

    రిప్లయితొలగించండి
  12. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురుదేవులకు, కవిమిత్రులకు మరియ బ్లాగు వీక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
    మకర రాశిన సూరీడు మరులు గొనఁగ
    పాడి పంటలు సమకూరి యాడి పాడ
    సంత సంబులఁ దోడుగ, సాగ నంపి
    కష్టములఁ, దెచ్చు మకర సంక్రాంతి మనకు!

    రిప్లయితొలగించండి
  14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. దక్షిణాయన వేళలో ధరణి శోభ
    గోలు పోవగ నేమగు? కూర్మిని రవి
    మకర రాశికి చనుదెంచు మహిత దినము
    కష్టములఁ దెచ్చు; మకరసంక్రాంతి మనకు.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మకర రాశిన చేరంగ భాస్కరుండు
    మండు టెండల కాలమ్ము మరల వచ్చి
    కష్టముల దెచ్చు, మకరసంక్రాంతి మనకు
    చీకటిని చీల్చి వెలుగులు చిలుకరించు !!!

    రిప్లయితొలగించండి
  18. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మకరరాశిని’ అనండి.

    రిప్లయితొలగించండి

  19. గాలివానలు భూమి ప్రకంపనములు
    రవియె నీచ గృహము తులా రాసినుండ
    కలుగ,పర్యావరణ మార్పు వలన వచ్చె
    కష్టముల్ దెచ్చు మకర సంక్రాంతి మనకు

    రిప్లయితొలగించండి
  20. కె.యెస్.గురు మూర్తి ఆచారి గారి పూరణ
    పారు వేట దినమ్మున పరుగు లెత్తి
    నింక దొరికి తలల తరిగించు కొనగ
    గొర్రె పొట్టేలులకు -నొసగును సుఖము -
    కష్టముల దెచ్చు- మకర సంక్రాంతి మనకు

    రిప్లయితొలగించండి
  21. ఇళ్ళు వాకిళ్ళ పరిశుభ్ర మింపుజేయ,
    ముగ్గులేయంగ,వంటలన్ ముదము జేయ
    కష్ట,మల్లుళ్ళ మర్యాద ఖర్చులవియ,
    కష్టముల దెచ్చు మకరసంక్రాంతి మనకు

    బూజులన్నిటిని దులుప,పొల్పుముగ్గు
    లేయ,పిండివంటలకును,లేతలైన
    మనుమలను ముద్దుజేయంగ,మదికి ప్రియము
    కష్టముల,దెఛ్ఛుమకరసంక్రాంతి మనకు

    రిప్లయితొలగించండి
  22. శంకరయ్యగారు, పోచిరాజు సుబ్బారావు గారు వేసిన ప్రాస అంత వాడుకలో లేక పోయినా సరియనదే అనుకుంటా. ఒకసారి చింతా రామకృష్ణ రావు గారు తన బ్లాగులో ఈ ప్రాసగురించి ఇలా వ్రాసారు:

    సమ్యుతాసమ్యుత ప్రాస :-
    రేఫ యుత సమ్యుక్తాక్షరముతో రేఫ రహితమైన అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "

    రిప్లయితొలగించండి
  23. ఉదయ భానుడు రథముతొ నుదయమొచ్చి
    పసిడి కాంతులు విరజిమ్మి పంట నిచ్చు
    లక్ష్మి ముగ్గౌచు రాజ్యమే లంగ నేల
    కష్టములఁ దెచ్చు మకరసంక్రాంతి మనకు

    రిప్లయితొలగించండి
  24. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    పుష్యం గారూ,
    ధన్యవాదాలు. మీరు చెప్పినది సత్యం, సప్రాణికం.

    రిప్లయితొలగించండి
  25. కొంటె సరసాల మరదళ్ళ మంటతాకి
    క్రొత్త యల్లుళ్ళ బాధలు కోటి జేసి
    పిండివంటల నొసగుచు దండి,తీపి
    కష్టముల తెచ్చు మకర సంక్రాంతి మనకు

    రిప్లయితొలగించండి
  26. పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఒచ్చి’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘ఉదయ మంది’ అంటే సరి!
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. శంకరయ్య గారు ఒక చిన్న మనవి గ్రామ్య మైన పదాలు అచ్చతెలుగు కింద రావా ? ఎందుకు వాడకూడదో వివరణ ఇవ్వగలరు.

    రిప్లయితొలగించండి