25, జనవరి 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1586 (చావు వార్త తెచ్చె సంబరమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చావువార్త తెచ్చె సంబరమ్ము

22 కామెంట్‌లు:

  1. నగరమందు జొచ్చి నరమాంసము మరగి
    చిరుత యూరి లోన తిరుగు చుండ
    జనులు కాపు గాసి చంపి వేసిరి దాని
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి
  2. నిండు సభను మధ్య నేనుండ నౌకరు
    చావు వార్త తెచ్చె , సంబరమ్ము
    మిగుల కలిగె నాకు మిత్రుని కళ్యాణ
    మనెడు వార్త చెవుల వినగ రాగ

    రిప్లయితొలగించండి
  3. విశ్వ మెల్ల బ్రాకి విషశక్తులన్ బెంచి
    అడ్డు అదుపు లేని అఘము జేసె
    శాంతి గోరు జనులు చంపతుదకు వాని
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి

  4. వరి చేను ఎండి వానలు లేక
    కడు గడ్డు కాలమున నుండ బాబు
    జిల్లా లని కరువు జిల్లా లై జెప్పిన
    దిచావు వార్త తెచ్చె సంబరమ్ము !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఏక చక్ర పురిన రాకాసి, జనులను
    జంపు చుండె ననుచు జనని తెలుప
    పాండు సుతుడు బోయి పరిమార్చగావాని
    చావు వార్త దెచ్చె సంబరమ్ము!!!


    ఇంత సంతసముగ నెందుకు ననుపిలి
    చావు? వార్త దెచ్చె సంబరమ్ము!
    మిదివొ చూడుడనుచు నింతిజూపె కవరు
    స్టారు మహిళ నుండి చీరుడనుచు !!!

    రిప్లయితొలగించండి
  6. ముఖ్యమైన నేత పోవగన్ ధరవీడి
    చిన్న నాయకునకు సీటు వచ్చె
    ముదముతోడ సఖులు మ్రోగించ దుందుబుల్
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి
  7. ఆవు పాలు మనకు నాయుస్సు పెంచెడి
    నావు పేడ క్రిముల నంట నీయ
    దావు మూత్రమన్న నౌషధమ్మని చెప్పు-
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి
  8. చచ్చు బడె డి కాళ్ళ చకితపు వ్యాధిని
    చుక్క మందు చేత చక్క దిద్దె
    వ్యాధి కార కంబు" వైరస్సు" చావగా
    చావు వార్త తెచ్చె సంబ రమ్ము
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  9. నారి చేత తెగిన నరకాసు రక్కసు
    చావు వార్త తెచ్చె సంబరమ్ము
    దీప కాంతు లెగియు దీపావలి భరత
    దేశ మందు మిగుల దివ్య మండ్రు

    రిప్లయితొలగించండి
  10. అప్పు మిగిలి, తాలు చొప్ప మిగిలినంత
    బ్రతుకు చితికె మ్రింగ మెతుకు లేక
    మాఫిఁ జేయ ఋణము మాధవా యని దల
    చావు, వార్త తెచ్చె సంబరమ్ము!

    రిప్లయితొలగించండి
  11. చందమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చావువార్త, పెళ్ళివార్త రెండూ ఒకేసారి వచ్చినట్టున్నాయి!
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని..‘గెలిచావు’ వ్యావహారికం కదా!
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    కరువుజిల్లాల ప్రకటన చావు వార్త ఎలా అవుతుంది?
    *****
    శైలజ గారూ,
    మీ మొదటి పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    రెండవపూరణలో చివరిపాదం అర్థం కాలేదు. ‘సంబరమ్ము + ఇదివొ’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘మిదివొ’ అనడం దోషమే.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ ‘ఆవువార్త’ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సి. రామమోహన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నరకాసు రక్కసు’ అన్నచోట ‘నరకుడనెడి దైత్యు’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని ‘తలచావు’ వ్యావహారికం కదా!

    రిప్లయితొలగించండి

  12. ప్రతిన బూని భీము డతిభీకరమ్మున
    రొమ్ము జీలిచి రుధిరమ్ము ద్రాగి
    దుస్ససేసు జంప ద్రుపద సుతకు నా
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ప్రేమవిషయమంతపెద్దలముందుదా
    చావు| "వార్తదెచ్చెసంబరమ్ము
    కొరకువేచియుంటి|కోర్కెలునెన్నున్న?
    అనుచునబలబలికె-నతనిచెంత"|

    రిప్లయితొలగించండి

  15. మాస్టరుగారూ ! ధన్యవాదములు..చిన్న దోష సవరణతో...

    ప్రతిన బూని భీము డతిభీకరమ్మున
    రొమ్ము జీలిచి రుధిరమ్ము ద్రాగి
    దుస్ససేసు జంప, ద్రుపదుని సుతకు నా
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి
  16. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దాచావు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పూర్వపూరణలో గణదోషం నా దృష్టికి రాలేదు. సవరించుకున్నందుకు సంతోషం!

    రిప్లయితొలగించండి
  17. మల్లెలేవారి పూరణలు
    సై౦ధవు౦డు దాగె శకట మౌవ్యూహాన
    చాటుగాగ మబ్బు సంబరాన
    బయలు వెడల గొట్ట పార్దు౦డనిన్ వాని
    చావువార్త తెచ్చె సంబరమ్ము
    2.రావణుండు ననిని రాముని దాకగా
    రామ బాణ మతని రయము జంప
    రాముపత్ని యడిగి రాముచే రావణు
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి
  18. కె యెస్ గురు మూర్తి ఆచారి గారి పూరణ
    పదవి కై నతండు ప్రాకు లాడె గాని
    ఓట్లు పడక నాడు ఓడి పోయె
    కాని నేటి ఎన్నకల యందు ప్రత్యర్ధి
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి
  19. రెండవప్రపంచ భండ నమ్ము నందు
    అస్మదీయు లెల్ల అనిని గెల్చి
    జర్మనీని గొట్ట శత్రువౌ హిట్లరు
    చావువార్త తెచ్చె సంబరమ్ము

    రిప్లయితొలగించండి
  20. శంకరయ్య గారు ఒక చిన్న మనవి. మీరు అధికముగా ఆటవేలది లేదా తేటగీతి సమస్యలు ఎక్కువగా ఇవ్వడం వలన మిగితా వృత్తాల లో నైపుణ్యం నశించే అవకాశం వుంటుంది. దయచేసి ఒకసారి ఇచ్చిన ఛందం మరుసారి పునరావృతం కాకుండా ఇస్తే బాగుంటుందని నా ఊహ.దయచేసి నా ఈ కోరిక మీకు సబబని అనిపిస్తే దానిని పరిగణలోకి తీసుకొని ఇకముందు ఇచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకొని పద్దతి మార్చగలరేమో చూడండి.

    రిప్లయితొలగించండి
  21. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పదవికై యతండు’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం... ‘భండనమ్మున రేగి/ యస్మదీయు...’ అనండి.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ సూచన బాగున్నది. ధన్యవాదాలు. కాని మన బ్లాగులో వ్రాసున్నవారిలో ఎక్కువ కవులు ఔత్సాహికులే. వృత్తసమస్యలు కొందరికి కష్టమే. చిన్న చిన్న పద్యాలతో వారికి పద్యరచనాభ్యాసం, ఆసక్తి కలిగించాలని నా భావన. అప్పుడప్పుడు వృత్తసమస్యలూ ఇస్తూ ఉన్నాను. కాని వాటికి స్పందన తక్కువగా ఉంటుంది. ముందుముందు వృత్తసమస్యల సంఖ్య పెంచి చూస్ర్తాను.

    రిప్లయితొలగించండి