6, జనవరి 2015, మంగళవారం

పద్యరచన - 782

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. ఆది శంకరా చార్యుల కభిము ఖముగ
    కుక్క గమి తోడ బోయవా డొక్క డచట
    వంద నంబులు సేయుట యంద గించె
    వంద నీ యుడె యెపుడు ను భర్గు సముడు

    రిప్లయితొలగించండి
  2. చండాలునిగా వచ్చిన
    చండీపతి యడ్డి యాది శంకరునడిగెన్
    దండములిడుచును - బ్రాహ్మణ
    చండాలుర యాత్మ వేర స్వామి నుడువరే

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి గారూ మంచి పాయింటు కొట్టేసారు బాగుంది మీ పద్యం

    రిప్లయితొలగించండి
  4. ఆత్మ యనునది యొక్కటే యన్ని జీవు
    లందునని చెప్పు యద్వైతమమలు జేయు
    గురువులిచ్చట గలరంచు గొప్పగాను
    జెప్పవచ్చును జనులార చిత్తరువిది.

    రిప్లయితొలగించండి
  5. చమడాల వారు ఒక కన్నై
    చందస్సు వారు ఒక కన్నై
    తానె త్రినేత్రుండై వెలుగొందు
    పరాత్పరా ! ఏమని కొలువుదు ??

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. ఒక్క దినము స్వామి యుదయ కాలమ్మందు
    శిష్య గణము వెంటఁ జేరి కొలువ
    సంతసమ్ము తోడ సంప్రదాయమ్మైన
    శాస్త్ర చర్చఁ గొనుచు సాగుచుండ -

    కారు మబ్బును బోలు కాయమ్ము తోడ వి
    .....కారమ్ముఁ గల్గించు కటికవాఁడు ;
    కఱకుటమ్ములఁ బోలు కాళ్లు సేతుల తోడ
    .....రోత పుట్టించెడు రూపువాఁడు ;
    నిప్పు రవ్వలఁ బోలు నేత్ర ద్వయమ్ముతో
    .....సహ్యమ్ము కాని కసాయివాఁడు ;
    ఖర రవమ్మును బోలు కంఠస్వరమ్ముతోఁ
    .....గాఱు కూతల నోరు జాఱువాఁడు

    ఊరకుక్కల నాల్గు ప్రేమార వెంటఁ
    దీసికొని పెడబొబ్బల వేసికొనుచు
    కల్లు కుండయు మాంసపు ముల్లె గల్గి
    త్రోవ నెదురయ్యెఁ జండాల ధూర్తుఁడొకఁడు !

    శిష్యులంత నొసలు చిట్లించి చండాల
    జాతి వాని మేను జలదరింపఁ
    బల్కిరిటుల ద్వేష భావమ్ము పైకొన
    నిగ్రహమ్ము వీడి యాగ్రహించి -

    "రేరే భ్రష్ట నరాధమా ! వినుము ! వేఱే మార్గమందేగుమా !
    యౌరా ! కన్నులు నెత్తికెక్కినవె ? మూఢా ! పొమ్ము దూరమ్ముగన్ !
    సారాచార పరాయణుల్ , బుధులు , సాక్షాత్ శంకరాచార్య ధీ
    పారావారులు వచ్చుచుండిరిటఁ గైవారంబులాలింపవో ? "

    మాయా చండాలుడు :

    నీవు చదువుకొన్న నిగమాంతములలోన
    నంటరానితనము నరసినావె ?
    తొలఁగిపోవనేది దూరమ్ముగా నీకు ?
    దేహమనెదొ ? లేక దేహి యనెదొ ?

    బ్రాహ్మణుండు వీడు , శ్వపచుండు వీడని
    ప్రత్యగాత్మ గూర్చి పలుకనగునె ?
    పొల్చు చంద్రికలను పూర్ణ శశాంకుండు
    విప్రునింట ; శూద్ర వేశ్మమందు !

    సారస జాతి భేదమున సౌరులు మీఱి విభిన్న రీతిలో
    హార శతంబు గానఁబడు నైనఁ దదంతరమై యదృశ్యమౌ
    దారమదొక్కటే కద ! నిదానముగాఁ బరికింపుమయ్య ! యీ
    తీరున నుండుఁగాదె మన దేహములందలి యాత్మ యొక్కటై !

    చెప్పనేమి ఫలము శ్రీరంగ నీతులు ?
    చేసి చూపవలయు జీవితమున
    నాత్మ యొకటి యనెడి యద్వైత సూత్రమ్ము
    నాచరించి తెలుపుమయ్య ప్రజకు !

    పరమేశ్వర గత మాయా
    పరికల్పిత లీలలందుఁ బండితులైనన్
    బరతంత్రులగుట బాధా
    కరమని శ్వపచుండు సేసె ఘనవాదంబున్ !

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి (మాలిక)

    ఆది శంకరా చార్యుల నడ్డగించె
    జాగిలమ్ములు బట్టిన సౌనుడొకడు
    తొలగి పొమ్మన్న శిష్యుల తొగను జూసి
    యేది తొలగిపోవలెనిందు నెరుగనైతి
    దేహమా? లేక నాత్మయా? తెలుపమనగ
    జంగమయ్యయె నితడని శంకరుండు
    సన్నుతించెను భక్తితో సంతసమున
    ఆత్మ యొకటను సత్యమ్ము నాచరించి
    నాల్గువేదాల సారమ్ము నవనిలోన
    వితతి జేయుమనితెలిపె బేసికంటి !!!

    రిప్లయితొలగించండి
  8. విష్ణునందన్ గారూ! చిత్రానికి అద్భుతమైన పద్యహారాన్ని అలంకరించి ఆదిశంకరుల కృపకు పాత్రులైనారు.

    రిప్లయితొలగించండి
  9. చండాలరూపములోనున్న పరమేశ్వరుడు..........

    అపవిత్రంబన నేది నిత్యనిఖిలవ్యావృత్త బ్రహ్మాండమా?
    తపముల్ జేయు నిధానమై వెలయు శుద్ధంబైన యిద్దేహమా?
    నిపుణత్వంబును జూపి తీర్చుమిదె సందేహాములన్ శంకరా!
    జపమాలాధర! సర్వశాస్త్ర విదితా! చంచత్కళాధీమణీ.

    రిప్లయితొలగించండి
  10. కుక్కలెవేదముల్,హృదయకూటమినిల్పకభక్తిమార్గమే
    చక్కగచేరబోదనుచుశంకరులూ హకుతట్టగానె|తా
    ప్రక్కననున్నడైవమును-ప్రార్తనజేసెనుమూలమెంచియే
    చక్కటిసన్నివేశమునుచాటినపద్దతిచూడ?వేదముల్|

    రిప్లయితొలగించండి
  11. ఇలపావులూరి శేష శ్రీధర్ - అద్దంకి గారి పద్యము....

    శంకరు డెదురుగ రాగా
    కొంకక తానడుగ సాగె కోహమ్? కస్త్వమ్?
    శంకర బదులియ్య వయా
    బొంకక అద్వైత సుధను బోధింప గదే!

    రిప్లయితొలగించండి
  12. ఆది శంకరు లొకనా డనుంగు శిష్య
    గణము వెంటరా జనుచుండ గంగ వైపు
    శ్వపచు డొక్కడు నాలుగు శ్వానములను
    వెంట గొని యెదు రాయెను వికృత గతిని.

    శిష్యు లంతట వానిని చీదరించు
    కొనుచు దారిని తొలగంగ కోరినారు
    శంకరులు దాని గమనించె శ్వపచు డనెను
    విస్తు పోవగ నది విని వేత్త లపుడు.

    బాప లార మీరెవ్వని బాట విడచి
    తొలగు మనుచుండ్రి దేహినా? తొలుత నుండి
    దేహమున నున్న యాత్మనా తెలుపు డయ్య
    వేదవేత్తలు మీరెన్న వివరముగను.

    ఎల్ల జీవుల లోనుండు తెల్లముగను
    నాత్మ రూపియై పరమాత్మ యనుచు తెలిసి
    యంట రాని వాడని నన్న నాదరమున
    తొలగి పొమ్మన ధర్మమే తెలుపు డయ్య.

    తెలిసి యద్వైత తత్త్వమ్ము తెల్లముగను
    వాడు వీడను భావమ్ము వీడ వలదె
    యనిన శ్వపచుని పల్కుల వినిన శిష్యు
    లకు మదిని క్రమ్ముకొను పొరలంత మాయె.


    శంకరులకు శిష్యులకును శంక గలదె
    యాత్మ తత్త్వమ్ము నందున యనుట తప్పు
    వారి వంకన శంభుడే వచ్చి మనకు
    జ్ఞాన బోధను గావించె తానె నిజము.

    నాలుగు శ్వానము లవి ఘన
    నాలుగు వేదములు, వాని నడుపుచు మనపై
    మాలిమితో నరుదెంచెను
    శూలి ధరణి రూపుమాప శుష్కాన్తరముల్.


    రిప్లయితొలగించండి
  13. శ్వాసములతోడ రాగ కసాయి వాడు
    శంకరుని శిష్య బృందము శంకతోడ
    నడ్డుతొలగమని తెలిపిరా శ్వపచుని
    మనుజులందరిలోనుండు మాధవుండు
    తెలియదామీకు తేటగా తెల్పుడయ్య
    యన్న వానిమా టలను వారాలకించి
    శంభుడే సౌనుడన్నట్టి సత్య మెరిగి
    చరణువేడిరి భక్తితో సత్వరముగ

    రిప్లయితొలగించండి
  14. శంకరాచార్యనీకెలాశంకగలిగె?
    త్రాగుబోతటవాగ?విరాగివైన
    బ్రాహ్మణత్వమునెంచుచు}పరులటన్న
    వెధవ,చండాలుడనువారు|వేదవరుల?
    ఆత్మపరమాత్మనొక్కటేనణగియుండ
    దేహచాంచల్యమందునమొహముంచ
    గురువుగుర్తింపులెట్లుండు?గుట్టుగున్న
    సారసంసారమందునసాగుటేన?
    నాల్గువేదాలేశునకాలునవ్వినట్లు
    మత్తువదిలించెపరమాత్మచిత్తమందు
    మనసునందునతోచినమర్మమెల్ల
    కళ్ళ నె దుటనెకనిపించ?కల్పితంబు

    రిప్లయితొలగించండి
  15. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    జిలేబీ గారూ,
    _/\_
    ****
    డా. విష్ణునందన్ గారూ,
    అద్భుతమైన ఖండిక నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    కానీ... ఖండిక అసంపూర్ణంగా ఉన్నట్టుంది.
    ****
    శైలజ గారూ,
    మీ తేటగీతిక బాగున్నది. అభినందనలు.
    ****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మనోజ్ఞమైన పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    ఇలపావులూరి శేష శ్రీధర్ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    చక్కని పద్యంతో అడుగు పెట్టారు. అభినందనలు, ధన్యవాదాలు.
    ****
    మిస్సన్న గారూ,
    ప్రశస్తమైన పద్యఖండిక నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    మొదటి పద్యం మొదటి పాదంలో యతి తప్పింది. ‘ఆదిశంకరు లొక్కనా డఖిలశిష్య...’ అందామా?
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. విష్ణునందన్ గారూ ! చాలా రోజుల తర్వాత మీ పద్యములు చూసే భాగ్యము కలిగినది.
    చక్కని ఖందికనందించారు.ంఇస్సన్న గారు కూడా చక్కని పద్యహారాన్నందించారు..
    మిత్రులందరు చక్కని పూరణలు చేశారు..అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ మిస్సన్న గారికి , శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి బహుధా ధన్యవాదాలు !

    శ్రీ కంది శంకరయ్య గారికి సాదర కృతఙ్ఞతలతో - ఇది ధర్మదండ కావ్యాంతర్గత పద్యావళి ,ఆ తరువాత పరమేశ్వర నిజరూప సందర్శనమూ , మనీషా పంచకావిష్కరణేత్యాదులుంటాయి కానీ ' గ్రంథ విస్తర ' భీతిచే ఇక్కడింత కంటే ఉదహరించడం సాధ్య పడలేదు .

    అన్నట్టు , శ్రీ మిస్సన్న గారి ' ఖండిక ' చాలా చక్కగా ఉంది ...

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ పొరబాటుకు చింతిస్తున్నాను. సవరణకు ధన్యవాదాలు.
    ***********
    విష్ణునందన్ గారూ ధన్యవాదాలు. మీరు చూపిన బాటలోనే కొంచెం ప్రయత్నించాను.
    ***********
    హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి