7, మే 2015, గురువారం

సమస్యా పూరణము - 1668 (వాణికి హరి ప్రాణవల్లభుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వాణికి హరి ప్రాణవల్లభుండు.

41 కామెంట్‌లు:

  1. హంస వాహ నుండు హ్లాదన పతియౌను
    వాణికి , హరి ప్రాణ వల్ల భుండు
    పాల సంద్ర మందు పదములు సేవించు
    సిరికి యనగ నతడు మురిపె మంట

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరమ్మ గారు మొదటిపాదం లో యతి ఎందుకో కుదరదు అనిపిస్తుంది. హ్లాదన కుడా ఎందుకో తప్పుఅనిపిస్తుంది బహుశా హ్లాదనమున వుండాలని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి గారు ఎందుకో అన్వయక్లేశము కుడా వున్నదనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. పద్మభవుడు బ్రహ్మ పతి చదువులతల్లి
    వాణికి, హరి ప్రాణవల్లభుండు
    కలుముల జవరాలు కమలకు, ఈశ్వరుఁ
    గోరి పెండ్లి యాడె కొండ చూలి

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యం చివర ‘మురియునంట’ అనండి.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    అక్కయ్యగారి పద్యంలో యతిదోషం లేదు. ‘హ్లాదనము’ అంటే సంతోషము. ‘హ్లాదనపతి’కి సంతోషించే భర్త లేదా సంతోషపెట్టే భర్త అని అర్థాలు గ్రహించవచ్చు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పాలకడలిలోనఁ బ్రభవించి కలుముల
    చెలి యనంగఁ గీర్తి కలిగినట్టి
    పద్మవాసి పద్మపాణికి మంజుల
    వాణికి హరి ప్రాణవల్లభుండు.

    రిప్లయితొలగించండి
  7. ప్రణామములు గురువుగారు మీ పూరణ అద్భుతంగా వుంది..

    రిప్లయితొలగించండి
  8. పద్మభవుడు పాశి ప్రాణనాధుడగును
    వాణికి, హరి ప్రాణవల్లభుండు
    పద్మవాస సిరికి,పశుపతి పతిగాదె
    మాత శైలసుతకు మంగళముగ!!!

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పాశి’ అంటే వరుణుడు, యముడు అనే తప్ప బ్రహ్మ అనే అర్థం లేదు. అక్కడ ‘ధాత’ అందామా?

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘హారమ్ము| లెవరి...’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. పాశి అన్న పేరు ముగ్గురికీ (బ్రహ్మ, వరుణుడు ,యముడు) వుంది గురువుగారు,..అయినా మీరు అన్నట్లు ధాత బాగుంది...ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. గురుదేవుల పూరణ స్ఫూర్తిదాయకం.

    కాలిఁ బట్టి మకరి కరిని బాధించగ
    శక్తి కొలది పోరి సన్న గిల్ల
    శరణు శరణ మంటు చక్రిని వేడె డా
    వాణికి హరి ప్రాణవల్లభుండు!

    రిప్లయితొలగించండి
  14. మాస్టరు గారూ...మీ మంజుల వాణి పూరణము..మంజులముగానున్నది....
    అన్నట్లు ఈ రోజు 8 గం..నుండి రేపు 8 గం.ల వరకు చందస్సు గ్రూపులో ఇచ్చిన అంశం పై " ఒకరోజు లో శతక " కార్యక్రమము ఉన్నది...మీరు పని వత్తిడిలో చూశారో లేదో..మిత్రులు కూడా గమనించ గలరు.

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శరణు శర ణటంచు చక్రిని వేడు నా’ అంటే బాగుంటుందని నా సలహా.

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    నేను ఆ ప్రకటను చూడలేదు. ఇప్పుడు చూస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ.వె: పాలసాగరమున ప్రభవించిన సిరికి
      శుభము లొసగునట్టి సుదతి మణికి
      వరము లొసగుకల్పవల్లి.ఘన కోకిల
      వాణికి హరి ప్రాణ వల్లభుండు.

      తొలగించండి
  17. గురువర్యుల బాటలోనే...

    వాణికత్త, పసిడి బోణికి సుందర
    వేణికి, సుగుణ మణి, వేయి సిరుల
    రాణికి మరి పద్మ పాణికి మంజుల
    వాణికి హరి ప్రాణవల్లభుండు.

    రిప్లయితొలగించండి
  18. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సుదతీమణి’ అని సమాసం చేయవలసి ఉంటుంది కదా! ‘ఘనకోకిల’ అన్నచోట గణదోషం. ‘సుగుణమణికి| వరము లొసగు కల్పవల్లియౌ కోకిల’ అనండి.

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ తాజాపూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. మిత్రులు కంది శంకరయ్యగారి పూరణము చాల బాగుగనున్నది. అభినందనలు!

    రిప్లయితొలగించండి
  21. రంభ మేనకాది రసభరానత మేజు
    వాణికి "హరి" ప్రాణవల్లభుండు
    స్వర్గలోకమందు శాశ్వత వాసియై
    పుణ్యమూర్తికిచ్చు మోక్షసుఖము

    రిప్లయితొలగించండి
  22. హరి= విష్ణువు;ఇంద్రుడు.(నానార్ధాలు)

    రిప్లయితొలగించండి
  23. ఫాలలోచనుండు ప్రాణవల్లభుఁడు శ
    ర్వాణికి! హరి ప్రాణవల్లభుండు
    లక్ష్మికి! కమలజుఁడు ప్రాణవల్లభుఁడగు
    వాణికి! సతతమ్ము వారిఁ గొలుతు!!

    రిప్లయితొలగించండి
  24. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పద్మ సంభవుండు బ్రహ్మయే పతిగాగ
    వాణికి ;హరి ప్రాణ వల్ల భుండు
    సిరికి ;గిరిజ భర్త శివుని శిరము పైన
    గంగ నాట్య మాడ కదలు చుండు

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఇంద్రుడు స్వర్గసుఖాలనిచ్చేవాడే కాని మోక్షసుఖాన్నివ్వడు కదా! అక్కడ ‘పూర్ణసుఖము’ అందామా?
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. నాల్గు మోములుగల నలువప తియగును
    వాణికి, హరి ప్రాణ వల్ల భుండు
    సత్య భామ కుగద సవతులం దరికంటె
    నుమఱి ,తెలియు మమ్మ !నూర్జ హాను !

    రిప్లయితొలగించండి
  28. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    ధన్యవాదాలు.
    దస్తగిరి, మధురవాణిల పెండ్లి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  29. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

    కాలిఁ బట్టి మకరి కరిని బాధించగ
    శక్తి కొలది పోరి సన్న గిల్ల
    శరణు శర ణటంచు చక్రిని వేడు నా
    వాణికి హరి ప్రాణవల్లభుండు!

    రిప్లయితొలగించండి
  30. నిన్నటి సమస్యా పూరణ కూడా ఈ రోజు పంపిస్తున్నందులకు క్షమించాలి
    వేదములు నాల్గు మరియును
    వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్
    వేదాంగ జ్ఞాన విషము
    గాదా సేవించి బుధలు కాంచిరి యశమున్

    పద్మసంభవుండు ప్రానేశ్వరుండు శ్రీ
    వాణికి, హరి ప్రాణవల్లభుండు
    సర్వ సంపదలిడి సాకు శ్రీ లక్ష్మికి
    సతికి ప్రియవరుండు సర్వ గురుడు

    రిప్లయితొలగించండి
  31. సృష్టి కర్త బ్రహ్మ నిష్ఠకు తోడ్పాటు?
    భక్తి పరుల కెపుడు భగవాను డెవ్వరు?
    శ్రీమతెంచు యెపుడు ప్రేమ బెంచెడివాడె?
    1.వాణికి2.హరి.3.ప్రాణ వల్లభుండు.

    రిప్లయితొలగించండి
  32. నాగరాజు రవీందర్ గారూ,
    అన్యభాషాపదాలున్న మీ తాజా ‘చరవాణి’ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    నిన్నటి, నేటి సమస్యలకు మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘బుధులు’ టైపాటు వల్ల ‘బుధలు’ అయింది.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
    కొన్ని లోపాలున్నవి. క్రింది నా సవరణ పద్యాన్ని పోల్చి ఆ లోపాలేవో తెలుసుకొనండి.
    సృష్టి కర్త బ్రహ్మ నిష్ఠకు తోడ్పాటు? (ప్రాసయతి తప్పింది. ‘వాణికి’ అన్న సమాధానం ఇక్కడ అన్వయించదు)
    భక్తి పరుల కెపుడు భగవాను డెవ్వరు? (గణదోషం)
    శ్రీమతెంచు యెపుడు ప్రేమ బెంచెడివాడె? (శ్రీమతి+ఎంచు అన్నప్పుడు యడాగమం వస్తుంది.)
    1.వాణికి2.హరి.3.ప్రాణ వల్లభుండు.

    సృష్టి కర్త బ్రహ్మ చెల్వుఁ డే యింతికి?
    భక్తి పరులఁ గాచువాఁ డెవండు?
    శ్రీమతి కెపుడు తన ప్రేమఁ బంచు నెవండు?
    వాణికి; హరి; ప్రాణ వల్లభుండు.

    రిప్లయితొలగించండి

  33. వందనమ్ము సేయవలెను ఏదేవికి
    చదువునేర్వ, ధాత జనకుడెవరు.,
    రామ స్వామి సీత కేమి కావలయును,
    వాణికి; హరి; ప్రాణ వల్లభుండు

    రిప్లయితొలగించండి
  34. గేయకారులెల్ల కీర్తనంబుల పాడి
    హరిని గొలిచి వారలాఢ్యు లైరి
    పాటవాణియౌట పలుకంగ తగియుండు
    వాణికి హరి ప్రాణవల్లభుండు

    సంస్కృతంబునందు చటుల గ్రంధంబులన్
    హరిని కీర్తి సేయు టగుపడు గద,
    భాషపూతమౌచు వరలును గానగీ
    ర్వాణికి హరి ప్రాణవల్లభుండు

    ఆదిశక్తి తాను నాత్మయౌనంతటన్
    శక్తివలన విష్ణు,శంకరులును,
    బ్రహ్మ,తాను వెలయ,బ్రహ్మమౌ శక్తి యా
    వాణికి హరి ప్రాణవల్లభుండు

    వాణి,నగజ,లక్ష్మి,వారలు నొక్కటే
    బ్రహ్మ,శివుడు,విష్ణువనగ నొకరె
    భేద మదియు లేక వెలుగు వారౌటచే
    వాణికి హరి ప్రాణవల్లభుండు

    రిప్లయితొలగించండి
  35. రుక్మిణీ సతి గొని రుక్మాదుల గెలిచి
    యసుర రీతి బెండ్లి యాడినంత
    జనులు బలికి రిటుల చాలునీ మంజుల
    వాణికి హరి ప్రాణ వల్లభుండు

    రిప్లయితొలగించండి
  36. సృష్టి కర్త బ్రహ్మ చల్వుడే యింతికి?
    భక్తి పరుల గాచు వాడేవండు?
    శ్రీమతి కెపుడు తన ప్రేమబంచు నెవండు?
    1.వాణికి2.హరి.3.ప్రాణ వల్లభుండు.

    రిప్లయితొలగించండి
  37. చదువు నేర్చు నపుడు మదిలోన హారమ్ము
    లెవరి కేయ వలయు ఇష్ట పడుచు ?
    స్థిరు డెవరన, సిరికి ఏమగు వరుసన
    వాణికి ,హరి , ప్రాణ వల్లభుండు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు07/05/15

    రిప్లయితొలగించండి
  38. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ ప్రశ్నోత్తరమాలికారూపమైన పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రామస్వామి’ అన్నప్పుడు ‘మ’ గురువై గణదోషం. ‘రామమూర్తి’ అనండి.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి