9, మే 2015, శనివారం

దత్తపది - 77 (పూరి-వడ-దోస-గారె)

కవిమిత్రులారా,
పూరి - వడ - దోస - గారె.
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

నా పూరణ.... (ఉత్తరుని ప్రగల్భములు)

పూరిఁ గఱపించెదను శత్రువులను నా ప
రాక్రమము జూపి వడకింతు రణమునందు
దోసకారులు కౌరవుల్ దొలఁగి చనిన
క్షితిపతులు పౌరులు నను మెచ్చెదరు గారె.

42 కామెంట్‌లు:

 1. వారినిఁ గనిన వెఱపూరి వచ్చు చుండె
  వడ పల్లు కొట్టుకొనెను దడదడమని
  దోసమయ్యె బృహన్నలా! త్రోవ మార్చు
  నాకుఁ గారెను చెమటలు నన్ను విడువు!!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !
  శంకరార్యుల పూరణ శ్లాఘనీయము !
  జిగురువారి పూరణ జిగేలుమను చున్నది !

  కురుక్షేత్ర సంగ్రామమున విజయుడు విజృంభించిన వేళ :

  01)
  _________________________________

  దేవదత్తము పూరించి - దిక్కులదర
  పడగపావడ పై నుండ - పవన సుతుడు
  దోసకారుల పై వృష్టి - దూయ నరుడు
  భీతి కురువీరులదె కకా - వికలు గారె !
  విజయసారథి వీక్షింప - విభ్రమమున !
  _________________________________
  పడగ = జండా
  పావడ = వస్త్రము
  దోసకారులు = దుష్టులు(కురుసేన)
  దూయు = బాణము నాటి వెడలు
  కకావికలు = చెల్లాచెదరు
  విభ్రమము = నివ్వెరపాటు

  రిప్లయితొలగించండి
 3. పూరి పెట్టెద కీచకు నోరు నొక్కి
  ఒడలు హూనము జేయుదు మెడలు వంచి
  మోస మెరిగిన భీముడు దోస మనక
  చిటచిట లాడ నుదుటిపై చెమట గారె

  రిప్లయితొలగించండి
 4. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వసంత కిశోర్ గారూ,
  బహుకాల దర్శనం...సంతోషం!
  నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వడ’ను వదిలివేశారు. ఒడలులో వడ లేదు కదా! ‘ఒడలు హూనమువడగ జేయుదును సుమ్ము’ అనండి.

  రిప్లయితొలగించండి
 5. శంఖంబు 'పూరింప శాత్రవ సంఘంబు
  భయ'పూరితంబుగ. పరుగ జొచ్చె
  యె'వడ'న్చు చూడక నెదిరించి గూల్చెద
  అంగముల్విడి'వడ' నరయ జూసి
  'దోస'మం చెరిగియు ద్రోణాది పెద్దల
  దో సత్వ మహిమల దునుమ జూతు (దో: బాహు)
  నిర్భీతి 'గారె'చ్చి నిటలాక్షుడై జొచ్చి
  సములు 'గారె'వరైన సంహరింతు
  తేగీ
  యనుచు ననితర సాధ్యుడై యర్జునుండు
  కృష్ణ సారథ్య మాహాత్య కృపను గూడి
  యుద్ధ పాండిత్య శోభల యుక్తు డగుచు
  రణ వినోద క్రియా సుసరంభి యయ్యె

  రిప్లయితొలగించండి
 6. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ సీసపద్య పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  ‘పరుగజొచ్చె’ అన్నదానిని ‘పారజొచ్చె’ అనండి.

  రిప్లయితొలగించండి
 7. పూరితిను పశువుల కాచ పోయి నపుడు
  విరటు కొడుకుతా వడకెను భీతితోడ
  సంకు పూరించ విజయుడు, చమట గారె
  దోస కారులపై శిఖి దూయ నరుడు

  రిప్లయితొలగించండి
 8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పశువుల గాచ బోయినపుడు’ అనండి.

  రిప్లయితొలగించండి
 9. నాగరాజు రవీందర్ గారూ,
  మాయాబజార్ పాట స్ఫూర్తితో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కృతులతో...

  (ఉత్తరగోగ్రహణ సమయమున నంతఃపురకాంతల ముందఱ నుత్తరుని ప్రగల్భములు)

  "పూరిఁ గఱపించెదను నేను కౌరవులకు!
  వడవడ వణకఁ జేసెద బవరమందు!
  దోసమును సైఁచుమన్నచోఁ దొఱఁగి చనెద!
  పిఱికివారలుగారె యా విమతులంత!"

  రిప్లయితొలగించండి

 11. మాస్టరు గారూ ! చక్కని పూరణ నిచ్చారు..మిత్రులు పూరి వడలు బాగా చేశారు...కిశోర్జీ..నమస్తే...  దేవదత్తమ్ము పూరించి తేజమలర
  చనెనిదోసమరమునకు గనుడు నరుడు.
  కౌరవేయుల కప్పుడే గారె చెమట
  వైరి జనులంత వడ వడ వణకుచుండె
  రిప్లయితొలగించండి
 12. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఈమాట’ జాలపత్రికలో వేలూరి వేంకటేశ్వర రావు గారు ‘మా తెలుగు మేష్టారు’ అన్నవ్యాసంలో ఇలా అన్నారు “ప్రత్యేక కార్యసాధన గురిగా పెట్టుకొని పనిచేసే వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు; ప్రవర్తిస్తారు”. మనిద్దరి విషయంలో నిజమయినట్లుంది!
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. పూరి ,వడలు దోస గారెల వలలుండు
  సింహ బలుని ద్రుంచె చిత్రముగను
  భుజ బలమునకుతగు బుద్దియు తోడైన
  జయము నిశ్చ యంబు జగతి యందు !!!

  రిప్లయితొలగించండి

 14. తావడమ్ములు యెగుర నుత్తరకుమారి
  యెడద పొంగారె నటియింప నింపు మీఱ
  పూరి రాగాన జావళీ వొజ్జ నేర్ప
  దోసములులేని యచ్చర వేస మమర

  రిప్లయితొలగించండి
 15. భారత రణమందు పార్థుండు పూరించ
  ముందు జెప్పె దోసములను శౌరి
  యిదియు పోరుభూమి యెవడడ్డుపడిన
  గారెవరిట జూడ కర్త నేనె.

  రిప్లయితొలగించండి
 16. మంద పీతాంబర్ గారూ,
  దత్తపదాలను స్వార్థంలో వినియోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తావడమ్ములు+ఎగుర’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘తావడమ్ము లెగురగ నుత్తరకుమారి’ అనండి. ‘వొజ్జ’ అన్నారు. వు,వూ,వొ,వోలతో మొదలయ్యే తెలుగుపదాలు లేవు. ‘జావళీ నొజ్జ నేర్ప’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదం చివర గణదోషం. ‘...యెవ్వ డడ్డుపడిన’ అనండి.

  రిప్లయితొలగించండి
 17. ముని దుర్వాసుని ఆతిథ్యానంతరము ద్రౌపది శ్రీకృష్ణపరమాత్మకు నమస్కరిస్తూ:

  మాదగు దోసము లెంచక
  నా దుర్వాసులు వడఁగొనె డంకము దాటెన్!
  నీదగు కరుణా పూరిత
  యాదరమొప్ప నణఁగారె నావేదనలున్!

  రిప్లయితొలగించండి
 18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. పూరించి శంఖమ్ము భొమ్మని పార్థుండు
  .........సారించ నారిని శబ్దమాయె
  వడదెబ్బలకు రాలిపడు పిట్టలై నేల
  .........బడి రరివీరులు భయము జెంది
  దోసము కనరాదు తురగము లేన్ గులు
  .........దౌడు తీయగ జొచ్చె వీడి రణము
  అదనుగా రెచ్చిపోయెదరని పాండవుల్
  .........పారిపోజొచ్చిరి కౌరవాళి

  మాధవుడు దండమున్ గొని మాల్మి మీర
  జేరి యరదము నెక్కెను సారధిగను
  నరున కొక కంట వెన్నెల హరుని జూడ
  నగ్ని వేరొక కంటను నరుల జూడ.

  రిప్లయితొలగించండి
 20. మిస్సన్న గారూ,
  చక్కని సీసపద్యంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘నరున కొక కంట వెన్నెల హరుని (హరిని?) జూడ
  నగ్ని వేరొక కంటను నరుల జూడ.’ మనోహరమైన ప్రయోగం!

  రిప్లయితొలగించండి
 21. గురుదేవులకు నమస్కారములు.
  పూరి అనే దత్తపదమును 'పూరిం'
  అనే విధంగా వాడరాదన్నట్లున్నారు.ఆ మోదయోగ్యమేనంటారా?

  రిప్లయితొలగించండి
 22. భాగవతుల కృష్ణారావు గారి పూరణ .

  దోస మెరుగని ధర్మజు దోచి ,ధరణి
  మెండు గారెచ్చి పోవగ మృతియె ననుచు
  గడగడా వడ కించె సంకర్షణుండు
  దైవ దత్తము పూరించె ధన్వియనిని

  రిప్లయితొలగించండి
 23. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  అలా పూరించడంలో దోషం లేదని ఈ మధ్యనే ఎవరో అన్నారు. మన బ్లాగులో పద్యాలు వ్రాసేవాళ్ళలో ఎక్కువమంది ఔత్సాహికులే కనుక దానిని దోషంగా పరిగణించి వారిని నిరుత్సాహపరచడం సబబు కాదనుకుంటాను.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. నా రెండవ పూరణము:

  సృణియోధోద్భవభీతరావసరణిన్ శ్వేతమ్ము పూరింపఁగన్
  గుణవిచ్ఛేదిత కార్ముకార్తులయి, యుగ్రోద్భావ డంబోగ్ర దా
  రుణ కాండోష్ణతఁ జూప, "దోసమయె! మొఱ్ఱో! మమ్ము రక్షింపు మీ
  రణమున్ వీడెద" మంచుఁ బల్కుదురు గారే జృంభముం జూపఁగన్!

  రిప్లయితొలగించండి

 25. కందిశంకరయ్యగురువులకువందనములు
  మీసూచనమేరకు సంధి దోషముసవరించితిని
  వొజ్జ అనగా నాట్యోపధ్యాయుడుచూడు3871
  జి.యన్.రెడ్డి గారి పర్యాయపదనిఘంటువు

  రిప్లయితొలగించండి
 26. గురువుగారూ ధన్యవాదములు. హరిని అనడానికి పొరబాటున హరుని అన్నాను.

  రిప్లయితొలగించండి
 27. గుండు మధుసూదన్ గారూ,
  దీర్ఘసమాసాలతో, శబ్దాడంబరంతో కూడిన మీ పూరణ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. "దోస"మైనను భీముని ద్రోసి నీట
  తిండినే"వడ"విసమును,ధీరులగుచు
  "గారె",పాండవులేతమ కటుల"పూరి"
  తడ్డము ననుచును రారాజు తరుమ జూచె

  రాజ్యమే"వడ" భాగాలు రమ్య మగునె
  "పూరి"తిగ రాజ్యము తనదె పొల్పుననుచు,
  "దోస"మౌ పుట్టువులు"గారె"?దొరలు నెట్టు
  రగుదు?రంచనె రారాజు నందరెదుట

  "పూరి"పాకల వసియించి పొలుపుగాను
  వే,"వడ"గ బాధ,పాండులు,వెసను పంప
  గాను,వీరులు తా"గారె" కదనమందు
  "దోస"మే గాదనెను కృష్ణ,దూతగాను

  చుట్టములజంప"దోస"ము జుట్టుకొనదె?
  "పూరి"తైనట్టి సేనను పొలుపు జంప,
  మనసు మూ"గారె"ననె పార్ధ మాన్యుడతడు
  కృష్ణ!"వడ"యుదు పాపంబు కీర్తికొఱకు

  రాజసూయంబు కేతెంచు రాజులకును
  "గారె","బూరె"లు,"వడ"లును,కమ్మనైన
  "పూరి"లడ్డూలు,దోసల పొలుపుగాను
  విందు జేసిరి పాండులు విరివిగాను

  రిప్లయితొలగించండి
 29. కౌరవ సేనకున్ వడకు|కంసుని జంపినకృష్ణుడన్నచో
  ధీరులు చింత జేసిరట దిక్కులునంటగ దోస మంతటన్
  చేరగ పాండవుల్ ప్రతిభ చిక్కులు రావని పూరివాసులున్
  ప్రేరణ బెంచగా?రణముపెంపునసాగిరి గారె |పాండవుల్

  రిప్లయితొలగించండి
 30. పాయసాన్నములును ఫలహారములతోడ
  పూరి వడలు దోస గారె లన్ని
  బండి లోన బెట్టి మెండుగా భీముడు
  బకుని సంహరింప బయలు దేరె!!!

  రిప్లయితొలగించండి
 31. గురువుగారు,
  పాతపూరణనొకదాన్ని ఇక్కడ ఉంచుతున్నాను.
  శ్రమ ఇచ్చినందుకు మన్నించగలరు.

  సీతను హృదయంలో దాచడం హృద్యంగా ఉంది. కవిగారికి అభినందనలు.

  నా పూరణ.

  భూతలమందాదృతితో
  సీతారాములను పేరు స్థిరముగ నిలువం
  గా తనదగు నామమునన్
  సీతను రాముండె దాచి చిరయశమందెన్.

  రిప్లయితొలగించండి
 32. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటిపూరణ చివరిపాదంలో ఒక లఘువు ఎక్కువయింది. ‘తడ్డ మనుచును...’ అనండి.
  చివరిపూరణలో ‘పాండులు’ అన్నచోట ‘పాండవుల్’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  బకాసుర ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ సీతారాముని పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. శాస్త్రీజీ ! నమస్తే ! ధన్యవాదములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  రిప్లయితొలగించండి
 34. గురుదేవులకు ధన్యవాదములు. మొదటి పాదసవరణతో:

  మాదగు దోసము నెంచక
  నా దుర్వాసులు వడఁగొనె డంకము దాటెన్!
  నీదగు కరుణా పూరిత
  యాదరమొప్ప నణఁగారె నావేదనలున్!

  రిప్లయితొలగించండి
 35. పూరణ:
  పూరించెన్ హరి శంఖము.
  ఘోరంబుగ భీముడంత గొట్టెన్ దవడల్
  తీరెను దోసపు భారము
  కౌరవులన్ నీరు గార్చె గౌరవమొప్పన్!!

  రాంభట్ల వేంకటరాయశర్మ

  రిప్లయితొలగించండి
 36. రాంభట్ల వేంకటరాయ శర్మ గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని ‘గారె’ను ‘గార్చె’ అనడం దత్తపతి నియమం కాదు. ఆ పాదాన్ని ‘కౌరవులకు నీరుగారె గౌరవ మెడలన్’ అందామా?

  రిప్లయితొలగించండి
 37. శంకరయ్య గారికి నమస్కారం. దత్తపదిలో ఇచ్చిన పదం వచ్చి ఉండాలి కానీ అర్థమదే ఉండాలనే నియమము లేదేమో నండి. మీ అభీష్టం

  రిప్లయితొలగించండి
 38. వేంకటరాయ శర్మ గారూ,
  నిజమే... అర్థం అదే ఉండాలనే నియమం లేదు. కాని పదాన్ని మార్చడానికి వీలులేదు. ఉదాహరణకు ‘గారె’నే తీసుకుందాం.“ఇతడె‘గా రె’డ్డి కులవార్ధిహిమకరుండు” అనవచ్చు. అంతేతప్ప పదంలోని అక్షరాలను మార్చరాదు. నిజానికి ‘పూరి’కి అనుస్వారం చేర్చి ‘పూరించె’ననడంకూడా దోషమంటారు కొంతమంది. కాని పైన పూరణలు చేసినవాళ్ళలో చాలామంది అటువంటి ప్రయోగం చేశారు.

  రిప్లయితొలగించండి