1, మే 2015, శుక్రవారం

పద్య రచన - 896

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28 కామెంట్‌లు:

 1. వటపత్ర శాయి వరదుడు
  నిటలా క్షునిమ హిమలంట నిక్కము సుమ్మీ
  తటమున జపములు జేయును
  కటకట యామసన మందు కాపుర ముండున్

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. తరువోజ
  వటపత్రశాయికి వందనమందు! వారిజ నాభుకు ప్రణతుల నిడుదు!
  వటురూప ధారుని పదములఁ బడుదు! వాత్సల్యమంది పావన నేనగుదును!
  కటువైన మది పీట కాఠిన్యమగునొ, కడుభక్తి పటలమ్ము కప్పి యుంచెదను!
  పటములో నుండీవు వచ్చినావనుచు, పాలించు ప్రభువని పరవశపడుదు!

  రిప్లయితొలగించండి
 4. వటపర్ణ పుటిక పైనెక్కి బాలుండు
  హస్తగత పాద మలరు చుండ
  అతిమనోహర తను వందమ్ము నొలికించ
  జగము జాగృతంబు సలుప జొచ్చె

  రిప్లయితొలగించండి

 5. బొఱ్ఱను లోకములన్నిటి
  నుఱ్ఱుతలూగించు వాడ ! ఒట్టయ్య హరీ !
  మఱ్ఱాకు పైన బండిన
  కుఱ్ఱాడా ! జేలు నీకు గొడుదును, చూడన్.

  రిప్లయితొలగించండి
 6. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మొదటి రెండు పాదాలలో గణదోషం. ‘వటపతత్ర పుటిక పైనెక్కి బాలుండు|హస్తకలిత పాద మలరుచుండ’ అందామా?
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఉఱ్ఱుత’ లనే పదం లేదు. ‘ఉఱ్ఱటలూగించువాడ’ అనండి. ఉఱ్ఱటలూగించు/ ఉఱ్ఱట్లూగించు = ఉఱ్ఱూతలూగించు.

  రిప్లయితొలగించండి
 7. అవునండీ,
  గురువుగారూ, మీరు మార్చిన తరువాత
  పద్యం అందంగా మారింది.
  కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 8. మఱ్ఱి యాకును బాన్పుగా మలచు కొనుచు
  తీరు బడిగాను గూర్చున్న తిరుమలేశ !
  వంద నంబులు సేతును వంద లాది
  యందు కొనుమయ్య ! కృష్ణయ్య ! యందు కొనుము

  రిప్లయితొలగించండి
 9. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. అజుడు వటపత్ర శాయిగా నందగించ
  తనువు పులకించె కనుగొని తార్ క్ష్యవాహ్యు
  జన్మ ధన్యమయ్యెను కని జలధి శయను
  పూజ సల్పెద నిష్టతో మొక్షమిడగ

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మీదేవి గారు వ్రాసిన తరువోజ పద్యము ప్రేరణతో ప్రయత్నము....

  ముద్దుల కృష్ణుడు ముద్దగు పదముఁ ముఖమున కెత్తుట మోదము గాదె!
  ముద్దుల కృష్ణుని బొద్దగు మేని ముద్దును గొల్పును పొడగను గాదె!
  ముద్దుల కృష్ణుని మోమును గనిన ముద్దుల పింఛము మురిపించుఁ గాదె!
  ముద్దుగ వటపత్రముపయి పరుండి ముద్దుల కృష్ణడు మురిసెను గాదె!

  రిప్లయితొలగించండి
 12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్దు శంకరయ్య గారూ,
  మీ ప్రయత్నం సఫలమూ, ప్రశంసార్హం. బాగుంది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. పరమాత్మ తలపున ప్రళయ మాసన్నమై
  .........జగములు నీట మునిగి చనంగ
  చిద్విలాసమ్ముతో చిన్మయ రూపుడు
  .........వటపత్ర శాయియై పటుతరముగ
  నేమి యెరుంగని యింపగు బాలుడై
  .........కాలి బొటన వ్రేలు కరచి పట్టి
  మున్నీట దేలుచు మురియు చునున్నట్టి
  .........కమనీయ దృశ్యమున్ గాంచ గలుగు

  సప్త ఋషులకు ధన్యము జన్మ మహహ!
  సృష్టి జేయుచు పోషించి పుష్టినిచ్చి
  సకల జీవుల నాడించి సాక్షిగ నగు
  దేవదేవుని వినుతింతు భావ మలర!

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 15. కరకమలమ్ములతో పద
  సరసిజముల బొటన వేలు చప్పున నోటన్
  గరచుచు మర్రాకు పయి ని
  దురించు నగుమోము కృష్ణు స్తోత్రము జేతున్

  రిప్లయితొలగించండి
 16. బాలునిమోము చందురుడు బంచెడికాంతియు గాక నీలమై|
  తేలిక పత్రమందు గన?దేనికి గుర్తన?తానెనంతటన్
  మూలము లందు నుందునని ముద్దగు కృష్ణ్డుని రూపు రేఖలే
  కాలపువర్ణ చిత్రమున గాంచగ ?కృష్ణ్డుని నందచందమే|

  రిప్లయితొలగించండి
 17. చిన్నారికృష్ణ్డుని చిరు నగవులోయున్న
  -----------ప్రేమ?లోకాలలోబెంచుకొరకె|
  వటపత్ర శాయికి పటుతర బాధ్యత
  -----------జీవకోటికి బెంచు చింతవోలె
  నెమలి పించము నందు నేర్పరి తనమున
  -----------సృష్టి సూత్రములున్న దృష్టి లాగ
  నుదుటి తిలకము నందు నేదురించు భావాలు
  ----------నిష్ట నిర్మల తత్వ పుష్టి జూడ
  ఆకుగాదది –లోకాలు సాకునట్టి
  వసుధ,వన్నెల,ప్రకృతీ వైనమందు
  బాల కృష్ణుని బంధమే గాలమైన
  భక్తి భావానగొలిచిన బ్రతుకుబెంచు|

  రిప్లయితొలగించండి
 18. మిస్సన్న గారూ,
  మీ పద్యం కమనీయంగా ఉంది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘నగవులో నున్న’ అనండి. ‘ప్రకృతీవైన’మని సమాసం చేయరాదు.

  రిప్లయితొలగించండి
 19. వటపత్రమున పరుండుచు
  బటుతరముగ బొటనవేలు బట్టిన కృష్ణా!
  ఘటనము జేయగ జగతిని
  వటువుగ నటియించు వృష్ణి వందన మయ్యా!!!

  త్రేతాయుగమున వసుధను
  యాతనలను బెట్టువారి యత్నము లణచన్
  భూతలమున జన్మించిన
  సీతాపతి నీవెగాదె చేమోడ్పులయా

  ద్వాపర మందున శ్రీకర
  గోపాలుడివై సుదతిని గూల్చెడు ఖలులన్
  కోపాగ్నిన నుసిజేసిన
  తాపస మందార కృష్ణ త్రాతకు జేజే

  గోవింద నామ జపమును
  గావించిన వారి గావ కలియుగ మందున్
  భూవైకుంఠము తిరుపతి
  తావున నెలకొన్నవకుళ తనయుడ జేజే


  కుక్షిని గల సకలమ్మును
  రక్షించగ నీకునీవె రసనే పుడుచున్
  దక్షత నిచ్చుచు జగతికి
  రక్షక వటపత్రశాయి ప్రణతులు గొనుమా

  రిప్లయితొలగించండి
 20. శైలజ గారూ,
  మీ ఖండిక బాగున్నది. అభినందనలు.
  *****
  కవిమిత్రులారా,
  రేపటినుండి నాలుగైదురోజులు ‘పద్యశీర్షిక’ ఉండదు. గమనించ మనవి.

  రిప్లయితొలగించండి
 21. తలపైన పింఛమ్ము తళుకు లీనుచునుండ
  సిగనున్న ముత్యముల్ చెన్ను మీర
  ముఖచంద్ర బింబమ్ము ముద్దులు గార్చుచుఁ
  అమృత భాండమై అలరు చుండ
  మనసుకు మరురూపు మర్రియాకై యుండ
  ప్రత్యగాత్మ వలెను ప్రభల వెలుగ
  కుడికాలు పైకెత్తి, కుర్రచేష్టలఁ తోడ,
  కరముల బట్టుచు గదులు చుండ
  తే. గీ
  జగములకు వలసిన పునర్జవము నిచ్చి
  సృష్టి కార్యసంరంభిగా శృతులు బొగడ
  బాలుడై వెల్గులీనెడు బాలకృష్ణుఁ
  చిత్ప్రభావిలాసు గొలుతు చిత్తమందు

  రిప్లయితొలగించండి
 22. చిటికెన వ్రేల నగమమరఁ
  దటాకమున పన్నగమును దన్నిన నటుడా?
  వట పత్రమ్మున వటువా?
  ఘటనా సామర్థ్య శౌరి ఘటికుడె వాడున్!

  రిప్లయితొలగించండి
 23. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  ఈనాటి పద్యరచనలో మీ పద్యం ఉత్తమంగా ఉంది. చక్కని భావంతో అందమైన పద్యం చెప్పారు. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. మూర్తి వై యస్ ఏ యన్ గారు వటపత్రశాయికి దర్పణం పట్టేరు తమ సీసంతో!

  రిప్లయితొలగించండి