18, మే 2015, సోమవారం

సమస్యా పూరణము - 1678 (కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.

37 కామెంట్‌లు:

 1. చెంత లేనంచు నీకింత చింత వలదు
  మనసులోన నన్ స్మరించి మగువ నీవు
  తలచు కొనినంత నేనిత్తు దర్శనమ్ము
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను

  రిప్లయితొలగించండి
 2. చంద్రమౌళి గారు రెండవపాదం గణాలు తప్పాయి సరిచేయగలరు.

  రిప్లయితొలగించండి
 3. దూర దేశము నందున్న దొరను దలచి
  మదిని మురిపించి యలరించు మాధ వుండు
  వలపు సంకెల బిగియించి గెలుప టన్న
  కన్ను లన్మూసి దృశ్యమ్ముఁ గాంచ వలెను

  రిప్లయితొలగించండి
 4. అద్భుతంబది చాగంటి యమృత వాణి
  శ్రీనివాసుని చరితమ్ము జెప్పు చుండ
  అందు వర్ణించు సిరి హరి యందములను
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచ వలెను

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  భార్యభర్తలు / ఆప్తులు ఒకరికొకరు దూరముగా నున్నప్పుడు :

  01)
  _______________________________

  భర్త యొక యూర నుండగా - భార్య వేరె
  యూరిలో నున్న సమయంబు - నొకరినొకరు
  కలుసుకొన్నట్లు తలపోయు - కాలమందు
  కన్నులన్మూసి దృశ్యమ్ముఁ - గాంచవలెను !
  _______________________________

  రిప్లయితొలగించండి
 6. నమస్కారములు
  మూర్తి గారూ ! నిజంగానే అద్భుతంగా ఉంది మీ పద్యం .హేట్సాఫ్

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  పిరాట్ల వారు చెప్పినట్లు రెండవపాదంలో గణదోషం. ‘స్మరించి’ని ‘స్మరియించి’ అనండి. సరిపోతుంది.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. తిరుమలేశుని తిరునాడు తీరు గనగ
  వెడల లేనట్టి వేళల వేదనేల
  భక్తి దలచుచు నాస్వామి శక్తికొలది
  కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గడచె గాలమ్ము తృటిలోన నెడద లోన
  స్మృతులు మిగిలెను తీయనై స్థిరము గాను
  తివుట గలిగిన జూడగా తీపి గతము
  కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.

  రిప్లయితొలగించండి
 11. కవిత వ్రాయతలంచిన కాలమందు
  మనసు నిశ్చలముగనుంచి తనివితోడ
  కన్నులన్మూసి దృశ్యముఁగాంచవలయు
  కమ్మనగు కవితలపుడు కాంచ వచ్చు

  రిప్లయితొలగించండి
 12. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 13. కన్నులన్మూసి ద్రశ్యము గాంచవలె నన్న
  కన్నులన్ ఇచ్చిన వాడి అనుగ్రహము గావవలె !
  అదియే ఉన్న ఇక దృశ్యము చూడ
  అవసరము ఏమి ఆలోచింపుము జిలేబి !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. ఎన్ని బాధలు గలిగిన నెదురుకొనుచు

  నన్ని బాధలను మరచి హాయినొంద

  చిన్న నాటి యొక్క మధురస్మృతియునున్న

  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను!

  రిప్లయితొలగించండి
 15. దైవ ప్రార్ధన జేయుము తన్మయతన
  కన్నులన్మూ సి, దృశ్యమ్ము గాం చవలెను
  మనసు నేకాగ్ర తనిలిపి మనన జేసి
  దైవ రూపును ,కళ్ళార దనివి దీర

  రిప్లయితొలగించండి
 16. జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం.....
  కన్నులన్మూసి దృశ్యమ్ముఁ గాంచవలె న
  టన్నఁ గన్ను లిచ్చినవాని యాదరణము
  గావలె నదియె యున్నచోఁ గాంచు నవస
  రమ్ము మనకేల యోచించు మమ్మ నీవు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తన్మయమున’ అనండి.

  రిప్లయితొలగించండి
 17. కర్మఁ జేయగఁ జూచెడు కర్త మొదట
  కన్నలన్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను
  వలయు నుపకరణమ్ములఁ బడసి పిదప
  నాచరించంగ సత్క్రియ యంతమగును!

  రిప్లయితొలగించండి
 18. అర్జునా విశ్వరూపమత్యద్భుతమ్ము
  మాంసనేత్రాల కందని మహితమిద్ది
  దివ్యదృష్టి నొసంగెద నవ్యయముగ
  కన్నులన్మూసి దృశ్యమ్ము కాంచవలయు.

  రిప్లయితొలగించండి
 19. సంజయునితో ధృతరాష్ట్రుడు పలికిన ఊహ;

  ఏను విశ్రాంతి గైకొంట కేగుచుంటి
  మరల వచ్చెద క్షణములో మాన్యచరిత!
  విన్నదంతయు మనసులో వేగనిలిపి
  కన్నులన్మూసి దృశ్యమ్ము కాంచవలయు

  రిప్లయితొలగించండి
 20. విభుడు యిరువురి సతులకు వేంకటపతి
  లచ్చి కన్నులు మూసెను మెచ్చినట్టి
  మంగ చుంబించె జూడుడు మాయజేసి
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను

  రిప్లయితొలగించండి
 21. (౧)
  చలనచిత్రమ్ముఁ జూచెడి సమయమందు
  సరసశృంగార సన్నివేశమ్ము వచ్చె
  నప్పుడే చేరి కూరుచున్నట్టి కొడుకు
  కన్నుల న్మూసి దృశ్యమ్ము కాంచవలయు.
  (౨)
  చేరి సతితోడ సాగరతీర మందు
  నొక్క లావణ్యవతి పొట్టియుడుపులుండి
  కులుకుఁ జూపఁ దా గమనించకుండ భార్య
  కన్నుల న్మూసి దృశ్యమ్ము కాంచవలయు.

  రిప్లయితొలగించండి
 22. తే.గీ.స్యోనగ్రహణము నేరుగ జూచెదనని
  పట్టుబట్టగా వలదని పట్టి నాన్న
  నల్లనద్దము దీయుచు నాడు జెప్పె
  కన్నులన్మూసి దృశ్యమ్ముఁ గాంచ వలెను

  రిప్లయితొలగించండి
 23. పిరాట్ల శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
  మన్నించండి. మీ పూరణను గమనించలేదు.
  మీ స్యూర్య/స్యోన గ్రహణ పూరణము బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విభుడు+ఇరువురి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘విభుడు సతు లిరువురకును వేంకటపతి’ అనండి.

  రిప్లయితొలగించండి
 24. మల్లెల సోమనాథ శాస్త్రి గారి పూరణలు.....

  1.కావ్య మందున దృశ్యాలు కవులు వర్ణ
  నంబు జేయంగ నదిగన నందమౌను
  మనసునందున ముద్రించి మాన్యముగను
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను.

  2.భూమికంపాన నేపాలు పూర్తి గాను
  ఆర్తి నందెను బాధలు నలమె జనుల
  దారుణమ్మైన స్థితికిని తాళలేము
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను.

  3.ప్రవరుడేగియు హిమగిరి బరగునట్టి
  యందచందాలు గాంచుచు నచట నిలిచె
  నచటి యందాలు చదివిన హరువు గనమె
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను.

  4.పద్మమాకృతి సేనను పన్నె గురుడు
  బాలు డభిమన్యు డందున పరుల సేన
  చీల్చి చెండాడు దృశ్యమ్ము సేవ్యమగును
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను

  రిప్లయితొలగించండి
 25. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  (తిమ్మాజీ రావు గారు పోస్ట్ చేసిన మీ పూరణలో టైప్ దోషాలున్నాయి. సవరించాను)

  రిప్లయితొలగించండి
 26. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  కండ్లు లేనట్టి వృద్ధుడు కౌరవుండు
  విశ్వరూపంబు జూపించ వేడుకొనగ
  దృష్టి నిడి జూపినహరి విశిష్ట సృజన
  కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.

  రిప్లయితొలగించండి
 27. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. ఊహలందున నుయ్యాల లూగునపుడు
  ప్రేమ పెంపును మనసున బెరుగు నపుడు
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచ వలెను
  కలలవలలందుజిక్కిన కల్పితాలు.
  2.యోగ సాధువు,సాధకుల్ యోగ్యులైన
  తపసు నందున దైవాన్ని తలచగానె?
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను
  అన్నసూత్రమ్ముదెలిపినా? యగునమనకు

  రిప్లయితొలగించండి
 29. వామ్మో గురువుగారు సరసకవు లైనారు!

  రిప్లయితొలగించండి
 30. తాపసులవలె నిర్జన ధరణిపైన
  కన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను
  చపల చిత్తము లేకను శర్వు గూర్చి
  తపము నొనర్చు మునులకే సఫల మిదియు

  రిప్లయితొలగించండి
 31. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...


  గోపికలు తాము శ్రీకృష్ణుఁ గూడి యాడి
  రాసలీలల మురిసిన రమ్య దృశ్య
  ములను మనమిటఁ గాంచంగ వలెనన మన
  కన్నులన్ మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను!

  రిప్లయితొలగించండి
 32. ఎదుటఁ గన్పట్టినన్నియు నెదుటివాని
  రచన మదికిఁ జిక్కని చతురంగమునను
  కళ్లకున్ గంతలుబిగింప కఠినమనకఁ
  గన్నులన్మూసి దృశ్యమ్ము గాంచవలెను

  [ఎదుటన్-కన్పట్టిన-అన్నియును -ఎదుటివాని]
  [చదరంగం లో కళ్ళకుగంతలు కట్టి ఆడే విధానము ఒకటి ఉందండీ. బల్ల, బలగములు చూడకుండా ఎత్తులు చెబుతూ ఆడాలి.]
  రెండవపాదం లో యతి చెల్లించానా అన్నది సందేహమే.

  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 33. **మిత్రులు మిస్సన్నగారి పూరణము చాలా బాగుగనున్నది. అభినందనలు.

  **మిత్రులు కంది శంకరయ్యగారూ, మీ మొదటి పూరణమందలి రెండవ పాదమందు చివర "వచ్చె"కు బదులుగ "కనఁగ" గానీ, "రాఁగ" గానీ చేర్చినచో నెటుల నుండునో యోచింపుఁడు.

  మీ రెండు పూరణములును మనోహరముగ నున్నవి. అభినందనలు. అయితే, సమస్యలోని "దృశ్యమ్ముఁ గాంచ..." అరసున్న తదుపరి సరళము రావలెననుకొందును. సవరింపఁగలరు.

  సాహసించినందులకు మన్నింపఁగలరు.

  రిప్లయితొలగించండి
 34. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘తపము నొనర్చు’ అన్నచోట గణభంగం. ‘తపము నొనరించు’ అంటే సరి!
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  నా పూరణలు నచ్చినందుకు ధన్యవాదాలు. మీ సూచనలను స్వీకరిస్తున్నాను.
  *****
  ఊకదంపుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో అఖండయతి... చాలామంది అంగీకరించేదే!

  రిప్లయితొలగించండి
 35. కంది వారు లెస్స పలికిరి !!


  జిలేబి

  రిప్లయితొలగించండి