23, మే 2015, శనివారం

సమస్యా పూరణము - 1683 (కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము.
(సాయంత్రంనుండి కిడ్నీలో రాయివల్ల భరింపరాని కడుపునొప్పి. ఏ సమస్య ఇవ్వాలో ఆలోచించలేక కడుపునొప్పినే సమస్యగా ఇస్తున్నాను. రేపటికెలా ఉంటుందో?)

27 కామెంట్‌లు:

  1. జబరుదస్తునందు చక్కని హాస్యంబు,
    చిలిపిచేష్టలెన్నొ చేసె నటులు
    నవ్వి నవ్వి వచ్చినను ప్రేక్షకులకెల్ల
    కడుపునొప్పి - తెచ్చెఁ గడు సుఖమ్ము.
    (ఈ టీవి కామెడీ షో "జబర్దస్త్")

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్య గారూ
    మీలాంటి కారణ శరీరులు మీకోసం కాకుండా మాలాంటి వారికోసం ఆరోగ్యంగా ఉండాలి.మీకు ఆ సర్వాంతర్యామి సత్త్వరమే మంచి ఆరోగ్యమివ్వాలని ప్రార్థిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  3. ఇంటిపనులు దప్పె, నెల్లరు సాంత్వన
    వాక్యములు బలికిరి, భర్త సేవ
    కుఁడుగ మారెఁ గ్రొత్త కోడలి కపటపు
    కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖంబు.

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ ‘జబర్దస్తు’గా ఉంది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    ప్రసవవేదన సంతానసుఖాన్నిచ్చినదన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. కవిశ్రీ సత్తిబాబు గారి పూరణ.....

    కడుపు నొప్పి చెప్పి కడకుతప్పుకొనిన
    నాదినిష్ఠురమ్ము నధిక మేలు
    కడుపు నొప్పి వంక కడగండ్లు తీర్చగా
    కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము.

    రిప్లయితొలగించండి
  6. ప్రసవ సమయ మందు పడతికి యొకనాడు
    పట్ట లేని నొప్పి చుట్ట బెట్ట
    శిశువు జనన మొంద శీఘ్రమ్మె నామెకు
    కడుపు నొప్పి దెచ్చెఁ గడు సుఖమ్ము !!!

    రిప్లయితొలగించండి
  7. కవిశ్రీ సత్తిబాబు గారూ,
    తెచ్చిపెట్టుకున్న కడుపునొప్పిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    నాగరాజు రవీందర్ గారి వలె మీరు ప్రసవవేదన సంతానసౌఖ్యాన్నిచ్చిందన్న పూరణ చేశారు. బాగుంది. అభినందనలు.
    ‘పడతికి నొకనాడు, శీఘ్రమ్మె యామెకు’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. కడుపు నొప్పి వలన కాలు గదపలేదు
    ఇల్లు వదల లేక నితర చెత్త
    (కడుపు) లోని కేగలేదు, లుప్తమయ్యె బనులు
    కడుపు నొప్పి దెచ్చెఁ గడు సుఖమ్ము

    రిప్లయితొలగించండి
  9. డా. ఆచార్య ఫణీంద్ర గారి పూరణ.....

    నిండు గర్భవతికి పండెను కలలన్ని .. !
    ముద్దులొలుకు సుతుడు పుట్టె నపుడు !
    క్షణము క్రితము వరకు కలిగిన భారమౌ
    కడుపు నొప్పి తెచ్చె కడు సుఖమ్ము !

    రిప్లయితొలగించండి
  10. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నిన్నటి సమస్యాపూరణం :
    లక్ష్మణ స్వామి రామాజ్ఞతో సీతామాతను అడవిలో విడచి వెళ్లిన కాసేపటికి...

    చేరగ వచ్చెడిదది మృగ
    మా? రుతి యేతెంచె? సీత మాయంబయ్యెన్
    దారాడుచు రాముఁ దలచి
    యారాటంబుగ లక్ష్మణార్యు డగుపడఁ జూచెన్!
    నేటి సమస్యాపూరణం :
    కోరి ఛాట్ తినగ గోకుల్కు పోనెంచ
    కడుపు నొప్పి తోడ వెడల నైతి
    యుగ్ర వాదు లచట నుంచగ బాంబులు
    కడుపు నొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము!

    రిప్లయితొలగించండి
  12. పరగ డుపున నాకు బ్రా ణా o తకమ్మును
    కడుపు నొప్పి తెచ్చె, గడుసు ఖమ్ము
    రాత్రి వేళ లందు రామగానము జేయ
    రక్తి భుక్తి మఱియు ముక్తి కలుగు

    రిప్లయితొలగించండి
  13. నెలను దప్పి వధువు నలతగానుండగా
    కడుపు దిప్ప వైద్యు కడకు నేగె
    బెడ్డు రెస్టని పని వీడుమనుచు చెప్ప
    కడుపు నొప్పి దెచ్చె కడు సుఖమ్ము

    రిప్లయితొలగించండి
  14. పాఠశాల తప్పె బరువు మోతయు దప్పె
    నింటిపనియు దప్పె చంటిగాడు
    కాలుజారి పడెను కలవరపడె కన్న
    కడుపు, నొప్పి తెచ్చె గడుసుఖమ్ము.

    (ఇంటిపని=హోంవర్క్)

    రిప్లయితొలగించండి
  15. పలుశిశు ప్రభవములకు ప్రత్యక్ష సాక్షిని , కాబట్టి శ్రీ ఆచార్య ఫణీంద్ర గారి బాటలోనే ,

    కెవ్వు కెవ్వను చిరుకేక రొదల తోడ
    పుడమికిని దిగె తనయుడు పొలుపున,
    స్వేదవదనము చిరువింటి నవ్వులొలుక
    కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము.

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ పరమేశ్వరునికి నా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ కే*యస్*గురుమూర్తిగారిపూరణం-
    కడుపు వచ్చినపుడు కందువున్ గనువేళ
    కడుపు నొప్పి దెచ్చె గడుసుఖమ్ము
    కడుపునీతమగును కాంతజన్మనెపుడు
    కడుపుచల్లనైన కాలమందు|

    రిప్లయితొలగించండి
  18. 1]సోమరి తనమున్న సోమన్న యనువాని
    కడుపు నొప్పి దెచ్చె కడు సుఖమ్ము|
    అమ్మనాన్న ప్రేమ లందించు తిండిచే
    కమ్మనైన వంట కంట బడగ.
    2}క్రొత్త పెళ్లి కొడుకు కోరిన కట్నము
    ఇవ్వకున్న?నలిగి “నవ్వలేని
    కడుపు నొప్పిదెచ్చె” కడు సుఖమ్ము
    అత్తమామ యింటఆలివంట|

    రిప్లయితొలగించండి
  19. వరుస భోజనముల వలన కడుపు యుబ్బి
    బువ్వ యెక్కువయ్యి బొజ్జ నొవ్వ
    విధియు లేక నపుడు వైద్యుల కడకేగ
    కడుపు నొప్పి తెచ్చె గడు సుఖము.

    రిప్లయితొలగించండి
  20. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    వైవిధ్యమైన విరుపుతో నిన్నటి పూరణ బాగున్నది. కాని చివరిపాదంలో గణదోషం.
    గోకుల్ చాట్ ప్రస్తావనతో మీ ఈనాటి పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ ‘కన్నకడుపు’ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *****
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కడుపు+ఉబ్బి’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘కడుపె యుబ్బి’ అనండి.

    రిప్లయితొలగించండి
  21. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    వ్యాకరణమనంగ బ్యాకు బెంచిన వాలె
    కడుపు నొప్పి యనుచు గడుసు వాడు
    తెలుగు పాఠ మనగ తేలవేసెను కండ్లు
    కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము.

    రిప్లయితొలగించండి
  22. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన నిన్నటి పూరణ:
    లక్ష్మణ స్వామి రామాజ్ఞతో సీతామాతను అడవిలో విడచి వెళ్లిన కాసేపటికి

    చేరగ వచ్చెడిదది మృగ
    మా? రుతి యేతెంచె? సీత మాయంబయ్యెన్
    తారాడుచు రాముఁ దలచి
    యారాటము తోడ మరది నగుపడఁ జూచెన్!

    రిప్లయితొలగించండి
  23. గురుదేవులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  24. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. మాస్టరుగారూ ! మీకు త్వరగా స్వస్త్థత చేకూరాలని కోరుకొనుచున్నాను..

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్కారములతో...

    (బడికి నెగఁగొట్టనెంచి కడుపునొప్పి బాధనభినయించిన బాలుని యుదంతము)

    ఇంటిపనినిఁ జేయ నొంటికిఁ బడక, తా
    బడికి నేఁగలేక బాలుఁ డపుడు
    కడుపునొప్పియనఁగ, బడిమాన్ప, ముదమయ్యెఁ!
    గడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము!!

    రిప్లయితొలగించండి
  27. గుండు మధుసూదన్ గారూ,
    ఉపాధ్యాయులుగా ఇలాంటి బడిదొంగల నెంతమందిని చూసి ఉంటారో! మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి