12, మే 2015, మంగళవారం

పద్య రచన - 903

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  రావణుడి చేతిలో కన్నా రాముని చేత చావే కోరుకున్న మారీచుడు :

  01)
  ______________________________

  కాంచన మృగమై కదలగ
  గాంచిన జానకియె కోర - కపిరథుడదిగో
  చాంచల్యపు మారీచుని
  వాంచా ఫల సిద్ది జేసె - వాడి శరముతో !
  ______________________________
  వాంచా = వాఞ్చా = కోరిక, కాంక్ష

  రిప్లయితొలగించండి
 2. మారీచుడు మాయా విగ
  సీరాముని కనుల ముందు సీతను గెలువ
  న్నారావణు బంపె ననగ
  కారడవిని మెరిసె నంట కాంచన మృగమై

  రిప్లయితొలగించండి
 3. ఘోరతర తమోరూపుని కుంభకర్ణు
  చండతర విశిఖ శిఖల సంహరించు
  రఘుకులనిధాను రణభీము రామచంద్రు
  రాక్షసాంతకు గొలిచెద రక్ష సేయ

  రిప్లయితొలగించండి
 4. కనక మృగమును జూపితా కాంక్ష తోడ
  పట్టి తెమ్మని భర్తను పట్టు బట్ట
  సీత కోర్కెను తీర్చగా సిద్ధమైన
  రాము డప్పుడు జానకీ రక్ష కొరకు
  తోడ బుట్టువున్ నియమించి తోడు గాను
  వెడలె నాలేడి వెంటను వేగముగను
  చెంగుచెంగున దుముకుచు చిత్రముగను
  పోవుచున్నట్టి మృగమును పొందనెంచి
  చేసి నట్టి ప్రయత్నముల్ చెడుట గాంచి
  యసుర మాయ యని యెఱిగి యాగ్రహమున
  వాడి భాణము వేసెనా పావనుండు
  చచ్చు సమయము నందున హెచ్చు గళముఁ
  నార్చె మారీషుడప్పుడు యార్తి తోడ
  రాము గళమున సౌమిత్రి రాక కోరి

  రిప్లయితొలగించండి

 5. ఆ.వె: పసిడి మృగమగోరె పడతి జానకిదేవి
  రాజసానయేగె రాఘవుండు
  మాయ దెలిసి యపుడె మారీచు గూల్చిన
  రామచంద్రు డొసగు రక్ష మనకు

  రిప్లయితొలగించండి
 6. మారీచుడు...

  రామ బాణము గ్రుచ్చు కొన్నను రావణాసురుడంపగన్
  స్వామి భక్తిని వీడ నెంచక పల్కె లక్ష్మణ సీతలన్!
  భూమి వీడగ మోక్ష మిచ్చెను మూర్తి రాముని బాణమే!
  స్వామి భక్తియు రామ చింతన సవ్యమైనను స్వర్గమే!

  రిప్లయితొలగించండి
 7. రక్కసు డా మా రీచుడు
  గ్రక్కున మఱి లేడి రూపు గలిగిన వాడై
  యక్కసు నం సీ తనుగొన
  రక్కసునిం జంపు చుండె రాముడు కనుడీ !

  రిప్లయితొలగించండి
 8. కోమలి యవనిజ కోరగ
  హేమపు హరిణమ్ము బట్ట ఇనవంశుండౌ
  రాముడు బాణము వేయగ
  నామారీచుండు కూలె నవనికి వ్యధతో

  రిప్లయితొలగించండి
 9. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...


  (మారీచవధ, సీతాపహరణ వృత్తాంతము)

  ఆ.వె.
  సీత నపహరింప సిద్ధుఁడై దశకంఠుఁ
  డపుడు తాటకేయు నంపె వనికి!
  వాఁడు మాయలేడి వలె వేషముం దాల్చి
  జనకజాత్మజకడ సంచరించె!!

  కం.
  సురుచిరమగు జొంపమ్ముల
  నురు గతితోఁ దినుచు మఱల నుఱుకుచుఁ దమితోఁ
  దిరిగి వెనుఁజూచుఁ జుఱుకునఁ
  జిఱు మోడుపుఁ గనులఁ బసిఁడి జింకను గాంచన్.

  తే.గీ.
  సీత మనమునఁ బ్రేమయుఁ జివురు లెత్త,
  "నాథ!బంగారు జింకయ నాకు వలయుఁ
  బెంచుకొన మనసాయెను బ్రియము తోడఁ
  దెచ్చి యీయుఁడు మన ప్రేమ తిరము గాఁగ!"

  ఆ.వె.
  అనిన సీత పల్కు లాలించి సౌమిత్రి
  "వద్దు వదిన! యీ సువర్ణ హరిణ;
  మిట్టి వింతఁ గంటె, యీరేడు లోకాల?
  నిది ప్రమాదకరము! హితము గాదు!!"

  తే.గీ.
  అన్న లక్ష్మణు మాటల నాలకించి,
  రాముఁ డనెఁ "దమ్ముఁడా! నన్ను రమణి సీత
  కోరు తొలి కోర్కి తప్పక తీర వలయుఁ;
  బోయి వైళమ దెచ్చెద మాయ లేడి!

  కం.
  మాయయినఁ బటాపంచలు
  సేయుదు; లేకున్న దాని సీతకు నిత్తున్;
  వేయును మాట లిఁకేలా?
  పోయియు నేఁ దెత్తు" నంచుఁ బోయె త్వర గతిన్.

  ఆ.వె.
  సీత సంతసించె శ్రీ రాముఁ డా జింకఁ
  బట్టి తెచ్చు నంచుఁ బరవశించి;
  లక్ష్మణుండు కన్నులందున సంశయ
  మొలుక, ధీరుఁ డౌట నులుక కుండె!

  కం.
  రాముండటు జింకనపుడు
  సేమముగనుఁ బట్టఁగాను స్థిరనిశ్చయుఁడై
  నేమమున వెంబడింపఁగ
  నా మారీచుండు మిగుల నడలుచుఁ బాఱెన్!

  ఆ.వె.
  అటులఁ బరుగులెత్తు నా జింకఁ బట్టంగఁ
  జిక్కదాయెఁ బరుగు లెక్కువయయె!
  రాముఁడపుడు నదియ రాక్షసమాయ య
  టంచు శరముచేతఁ ద్రుంచె దాని!!

  తే.గీ.
  అంత "హా సీత!హా లక్ష్మణా!" యటంచు
  నొక్క పెనుఁ గేక వినఁ బడ, "నక్కట! యట
  రాముఁ డాపద నుండెనో యేమొ? నీవు
  సత్వరమ్ముగఁ బొమ్ము లక్ష్మణ!యటకును"

  కం.
  అని సీత వల్క లక్ష్మణుఁ
  డనెఁ "దల్లీ! రాముఁ డెట్టి యాపద కెఱగాఁ,
  డనితర సాధ్యుఁడు, వీరుఁడు,
  విను, కారణ జన్ముఁ డతఁడు; భీతిల్లకుమీ!"

  ఆ.వె.
  మఱది మాట వినిన మానిని సీత తా
  నెంతొ వగచి యతని నింద సేయ;
  హృదయ శల్యుఁ డయ్యు, హ్రీ మనస్కుండయి,
  "గీత దాటకు" మని, గీసి వెడలె!

  తే.గీ.
  రావణుఁడు యోగి వేషాన రమణి సీత
  కడకు నేతెంచి, భిక్షను నడిగి, రేఖ
  దాట రాకున్కి, సీతయె దాటి రాఁగ,
  నపహరించెను హతవిధీ, యా రమణిని!

  (ఇది మారీచవధ మఱియు సీతాపహరణ ఘట్టము. స్వస్తి.)

  రిప్లయితొలగించండి
 10. 1.రావణాజ్ఞ చేత రయమున మారీచు
  డాయె లేడిగాను మాయచేత
  రామబాణ మేయ?రాక్షసు డేచచ్చె

  దుష్ట శిక్ష ణన్న నిష్ట యందు|
  2.అడవిన జేర ?రాముగని నాశగ రాక్షసుడొక్క పెట్టునన్
  తడుముచు బట్టనెంచ?తన తత్వము నెంచిన రాముడప్పుడే
  వడివడి బాణ మేయగనె-వాడికి దాడికి చావునబ్బెగా|
  గడిపెడిగౌరవంబునకు కల్మషమంటక?కీర్తిబొందెగా|

  రిప్లయితొలగించండి
 11. వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘శ్రీరాముడు... రావణు డంపె ననగ’ అనండి.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  కాని మీరు రాక్షసుని మహాకాయాన్నే చూశారు కాని అంతర్లీనంగా ఉన్న జింకను చూడలేదనుకుంటాను.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ తేటగీతిక బాగున్నది. అభినందనలు.
  పదమూడవ పాదాన్ని ‘నార్చె మారీచు డవ్వేళ యార్తితోడ’ అనండి. అప్పుడు+ఆర్త్రి అన్నప్పుడు యడాగమం రాదు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ మత్తకోకిల బాగున్నది. అభినందనలు.
  ‘మూర్తి’ శబ్దానికి అన్వయం? అక్కడ ‘పూజ్యరాముని బాణమే’ అంటే బాగుంటుందేమో?
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  పద్యం చివర ‘...యవనిన్ వ్యధతో’ అనండి.
  ******
  గుండు మధుసూదన్ గారూ,
  మీ సీతాహరణ ఘట్టాన్ని సవివరంగా ప్రస్త్గావించిన ఖండకృతి చాలా బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. గురుదేవులకు ధన్యవాదములు.
  సవరించిన పద్యం :
  రామ బాణము గ్రుచ్చు కొన్నను రావణాసురుడంపగన్
  స్వామి భక్తిని వీడ నెంచక పల్కె లక్ష్మణ సీతలన్!
  భూమి వీడగ మోక్ష మిచ్చెను పూజ్య రాముని బాణమే!
  స్వామి భక్తియు రామ చింతన సవ్యమైనను స్వర్గమే!

  రిప్లయితొలగించండి