26, మే 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1684 (రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!
(గరికిపాటివారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

41 కామెంట్‌లు:

 1. అమ్మురళీ కృష్ణుని నా
  మమ్మును స్మరియించుడెపుడు మనమున భక్తిన్
  కమ్మని యా స్మరణ శుభక
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 2. అమ్మాయని బిలచిన మది
  కమ్మని భావమున పొంగి కరుణిం చునుగా
  నెమ్మిని మ్రొక్కగ తల్లికి
  రమ్ము జనాళికిఁ గడుమధు రమ్మగును గదా

  రిప్లయితొలగించండి
 3. రమ్మని పిలిచెడి గాలులు
  జుమ్మని యెగసెడి తరంగ చోద్యపు ఘోషల్
  ఇమ్ముగ నుండు కడలి తీ
  రమ్ము జనాళికిఁ గడుమధురమ్మగును గదా

  రిప్లయితొలగించండి
 4. తమ్మిదొర బెట్టు వేడికి
  యిమ్ముగమరి నుండలేని యిరకాటములో
  నెమ్మది కలిగించెడు నీ
  రమ్ము జనాళికి గడు మధురమ్మగును గదా!!!

  రిప్లయితొలగించండి
 5. క్రమ్మిన వాకాశమ్మున
  నెమ్మదిగా జలధరములు నేస్తములగుచున్!
  చిమ్ముచు వర్షించగ నీ
  రమ్ము జనాళికి గడు మధురమ్ము గదా!

  రిప్లయితొలగించండి
 6. రమ్మో గోపీకృష్ణా
  కమ్మని సుందర వదనముఁ గాంచెద నిచటన్
  నిమ్ముగ వరము లిడునీ
  కరమ్ము జనాళికి గడు మధురమ్మగును గదా.

  రిప్లయితొలగించండి
 7. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...


  చెమ్మయును లేని బావుల
  కిమ్మగు సలిలమ్ము లుబ్బఁ గేరింతలతో
  రమ్మనెడి జలజలల నీ
  మ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 8. (2)
  చెమ్మయును లేక యెండిన
  కొమ్మలఁ గాయలును నెండి కుమిలిన తఱి, వ
  ర్షమ్ముపడ, భూజ ఫలసా
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  కృష్ణుని స్మరణ శుభకరమ్మన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  తల్లికి నమస్కరించడానికి రావలసిందిగా పిలిచిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  అందమైన కడలి తీరాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  సూర్యతాపానికి నీరమ్మెంత అవసరమో తెలిపిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  వాననీరు జనమోదకరమన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  వరదహస్తాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరి పాదంలో గణదోషం. ‘ఇమ్ముగ వరమ్ము లిడెడు క|రమ్ము జనావళికి...’ అనండి.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  బావిలొ నీటియూట, చెట్ల ఫలసారం విషయాలుగా మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. నాదో చిన్న సందేహం

  శుభకరమ్ము, కరమ్ము అంటూ ప్రయోగించవచ్చునా, శ్రీకరంబు, కరంబు అని వ్రాయాలని పెద్దలెవరో చెప్పగా వినిన గుర్తు. ఈ క్రింది పద్యం పరికిస్తే

  శ్రీరమ సీతకాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
  చార జనంబు కాగ

  జనంబు అన్నారు గానీ జనమ్ము అనలేదు. కాస్త వివరిస్తారా శంకరయ్యగారూ.

  రిప్లయితొలగించండి
 11. అలాగే ఈ పద్యం చూడండి

  ధారుణి రాజ్యసంపద మదంబున అన్నారు గానీ మదమ్మున అనలేదు మరి.

  రిప్లయితొలగించండి
 12. ఆప్రకారం ఈ సమస్య

  రమ్ము జనాళికి గడు మధురంబగునుగదా అని ఉండాలేమో అని నా అనుమానం.

  రిప్లయితొలగించండి
 13. ఇమ్మహిని కీర్తి గాంచిన
  యమ్మానవవిమల మూర్తి యసురారుని సీ
  తమ్మ రమణుని కథా సా
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 14. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  కరము, కరంబు, కరమ్ము; జనము, జనంబు, జనమ్ము... ఇలా మూడు రూపాలూ సాధువులే.. వ్యాకరణసూత్రాలను వెదికి చూపే అవకాశం ప్రస్తుతం నాకు లేదు కానీ కొన్ని పూర్వకవుల ఉదాహరణలు...
  సం|తానము తోడబుట్టువులు, తల్లియుఁదండ్రి ‘కులమ్ము’ దేశమున్ (సౌందరనందనం, పింగళి లక్ష్మీకాంతం)
  దైత్యదా|నవ సురయక్షరాక్షస ‘గణమ్ము’ ‘గరమ్ము’ ‘భయమ్ముఁ’ బొందె... (భార.అరణ్య. 1.332)
  పదముకొఱంత భావమది పట్టదు మున్న ‘రసమ్ము’ సున్నయే| కుదురు ‘గుణమ్ము’ లేదు (ప్రసన్న భాస్కరము-125, మానాప్రగడ శేషశాయి)
  మాత్రు దేశ ‘సే|వాచరణమ్ము’ ,నందసువు లర్పణ జేసినా వారి పార్ధివ|శ్రీ చెలువారు చోట (జాషువా)
  తెమ్ము బంగారుకుండ ‘జలమ్ము’ లనుచుఁ| దెమ్ము లతకూన మంచి‘సుమమ్ము’ లనుచుఁ| దెమ్ము బా గైనకొమ్మ‘ఫలమ్ము’ లనుచు (విజయవిలాసము- చేమకూర వేంకట కవి)
  అభిమానైక ‘ధనమ్ము’ ముఖ్యమని గ్రంథానేకముల్ పల్కు తం| డ్రి! (బులుసు వేంకటేశ్వర్లు)
  సరయూనదీతీర సతత సన్మంగళ-ప్రాభవోన్నత మహా ‘వైభవమ్ము’,
  కనక గోపుర హర్మ్య ఘన కవాటోజ్జ్వల-త్ప్రాకార గోపుర ‘శ్రీకరమ్ము’,
  గజ వాజి రథ భట గణికాతపత్ర చా-మర కేతు తోరణ ‘మండితమ్ము’,
  ధరణీ వధూటికాభరణ విభ్రమ రేఖ-దరిసించు మాణిక్య ‘దర్పణమ్ము’,
  తే. భానుకుల దీప రాజన్య పట్టభద్ర-భాసి నవరత్న ఖచిత ‘సింహాసనమ్ము’
  నాఁగ నుతి కెక్కు మహిమ ‘ననారతమ్ము’-ధర్మ ‘నిలయమ్ము’, మహి ‘నయోధ్యాపురమ్ము’. (మొల్ల రామాయణము)

  రిప్లయితొలగించండి
 15. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  రామకథాసారంతో చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  త్రాగుబోతు లెక్కువయ్యారన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 16. ఇమ్ముగ పూదోట విహా
  రమ్ము చెలియ గూడి కాష్మిరమ్మున యేకాం
  తమ్మున మౌనపు శృంగా
  రమ్ము జనాళికి గడు మధురేమ్మగును గదా.

  రిప్లయితొలగించండి
 17. శంకరయ్యగారూ, వివరణకు ధన్యోహం. కానీ మరో చిన్న అనుమానం. ప్రస్తుతం మీరు ఉదహరించినవన్నీ మీకు గుర్తున్నవా?? లేక మీరు చూసి(చూస్తూ) వ్రాసినవా?? చూస్తూ వ్రాసినట్లైతే నా సందేహం పూర్తిగా నివృత్తైనట్లే, గుర్తున్నది వ్రాసినట్లైతేనే చిక్కు.

  రిప్లయితొలగించండి
 18. తమ్ముడ ! మమ్ముల జూడగ
  రమ్ము ,జనాళి కి గడు మధుర మ్మగును గదా
  కమ్మటి నీ గానమ్ములు
  వమ్మును నిక సేయ కిపుడు పాడుము వరుసన్

  రిప్లయితొలగించండి
 19. క్రమ్మెను నాకాశము ద
  ట్టమ్ముగ మేఘముల గుంపు ఢంకారముచే
  చిమ్మెను జలధారలు నీ
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 20. సాహితీ మిత్రులు శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మగారూ,
  మీ సందేహము ననుసరించి....మీకు ఉదా. "వల్మీకంబు" అనెడి రూపము మాత్రమే సమ్మత మనిపించుచున్నది. కాని నన్నయ భారతమునఁ గల ప్రయోగములు...వల్మీకంబు-వల్మీకమ్ము అను రెండును సమ్మతములే యని నన్నయగారి యీ క్రింది ప్రయోగములే నిరూపించుచున్నవి. పరిశీలింపుఁడు...

  కం.
  అమ్మునిదేహము వల్మీ
  కమ్మునఁ గప్పంగఁబడి నికటవల్లీ గు
  ల్మమ్ములునైఁ బ్రాఁకిన నన
  యమ్మును నేర్పడక యుండె నవ్వనభూమిన్.
  (నన్నయ భారత ప్రయోగము: ఆరణ్య.3ఆ.175ప.)

  కం.
  ఇమ్ముగఁ దద్ధూమాఘ్రా
  ణమ్మున గర్భములు దాల్చి నాతులు నవమా
  సమ్ములు నిండుడుఁ గనిరి ము
  దమ్మున జంతుప్రముఖసుతప్రకరమ్మున్.
  (నన్నయ భారత ప్రయోగము: ఆరణ్య.3ఆ.316ప.)


  కం.
  ఇమ్ముని నీయజ్ఞాయత
  నమ్ముఁ బ్రవేశింపఁ దగఁడు నరనాయక యు
  గ్రమ్ముగఁ జలిపెడు శుభ కా
  ర్యమ్ములకుం బాసి బ్రహ్మహత్యావ్రతముల్.
  (నన్నయ భారత ప్రయోగము:ఆరణ్య.3ఆ.277ప.)

  ఇంకను నుదాహరింపవలెనన్నచో....పెక్కులనుఁ జూపవచ్చును. మీకు సమాధానము లభించుటే నా యభిమతము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 21. శ్రీ గుండు మధుసూధన్ గారూ

  సోదాహరణమైన మీ వివరణకు ధన్యోహం. కొందరు కవులు, ఉదాహరణకి శ్రీనాధుడు, కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా అన్నాడు. కంఠమ్ము అనలేదు.రెండవ పాదంలో కూడా "ఆంధ్ర నైషధకర్త అంఘ్రి యుగ్మంబున అన్నాడు యుగ్మమ్ము అనలేదు, అదే పద్యంలో చివరిపాదంలో "ఎట్లు చెల్లింతు టంకమ్ములేడునూర్లు" అన్నాడు, టంకంబులు అనలేదు . ఎప్పుడు ఎలా వ్రాయాలి, ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకునే ప్రయత్నంగా పై ప్రశ్న వేసేను. సమాధానం దొరికింది. సంతోషం.

  రిప్లయితొలగించండి
 22. నమ్మిన ప్రేమే మనసుకు
  సొమ్ముల షోకులకు మించి శోభను గూర్చే
  దమ్మే|సతిపతి మమకా
  రమ్ము జనాళికి గడు మధురమ్మగునుగదా|
  2}కమ్మనివంటల కంటెను
  నమ్మకమును బంచ గల్గు నవ్వుల కంటెన్
  అమ్మిడు నాదర సహకా
  రమ్ము జనాళికి గడు మధురమ్మగునుగదా

  రిప్లయితొలగించండి
 23. కమ్మని జోలలు పాడుచు
  కిమ్మన లాలించు తల్లి కేలూయలలో!
  నిమ్ముగఁ దానొసగెడు క్షీ
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 24. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీకు సందేహనివృత్తి అయినందుకు సంతోషం.
  నే నిచ్చిన ఉదాహరణలన్నీ గుర్తుకు తెచ్చుకొని వ్రాసినవి కావు, చూసి టైప్ చేసినవీ కావు. గూగుల్‍లో వెదకి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినవి. ఉదాహరణకు... గూగుల్‍లో ‘గణమ్ము’ అని వెదికాను. telugupennidhi.com లో “దైత్యదా|నవ సురయక్షరాక్షస ‘గణమ్ము’ ‘గరమ్ము’ ‘భయమ్ముఁ’ బొందె... (భార.అరణ్య. 1.332)” అన్నది దొరికింది. చూడండి...
  గణమ్ము
  ఇలాగే మిగిలినవన్నీ...

  రిప్లయితొలగించండి
 25. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  కరము, కరమ్ము, కరంబు... అన్నీ సాధువులే. ఎట్టి నిషేధాలూ లేవు. మన సౌలభ్యాన్ని బట్టి దేనినైనా వినియోగించుకోవచ్చు...

  అంబుజగర్భుని దివ్యప
  దంబులఁ దలఁదాల్చి భక్తి దప్పక తమ క్షే
  మంబును గోరిన మునిసం
  ఘంబును దలఁతు శుకశౌనకప్రముఖులనే.

  అమ్మధుసూదను శుభపా
  దమ్ములఁ దలఁదాల్చి భక్తి దప్పక తమ క్షే
  మమ్మును గోరిన మునిసం
  ఘమ్మును దలఁతు శుకశౌనకప్రముఖులనే.

  రిప్లయితొలగించండి
 26. శర్మ గారూ,
  ఎప్పుడో చదివినవి గుర్తుకు తెచ్చుకొని కవి ‘గుణంబు’ అని ప్రయోగిస్తే నేను ‘గుణమ్ము’ అని పొరబడడానికి నే నుదాహరించిన వాటిలో క్రిందిదానికి అవకాశమే లేదు.
  తెమ్ము బంగారుకుండ ‘జలమ్ము’ లనుచుఁ
  దెమ్ము లతకూన మంచి‘సుమమ్ము’ లనుచుఁ
  దెమ్ము బా గైనకొమ్మ‘ఫలమ్ము’ లనుచు (విజయవిలాసము)
  పై ఉదాహరణలో జలమ్ము, సుమమ్ము, ఫలమ్ము పదాలు ప్రాసయతి స్థానంలో ఉన్నాయి. అవి జలంబు, సుమంబు, ఫలంబు అయ్యే అవకాశాలు లేవు. గమనించండి.

  రిప్లయితొలగించండి
 27. పోచిరాజు సుబ్బారావు గారూ,
  గాయకుణ్ణి రమ్మన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  వర్షజలాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ మమకార, సహకారమ్ముల పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మాతృక్షీరమ్మును గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 28. ఇమ్మహిపైనమనుజుల ధ
  నమ్మే నిజముగ సతతము నడిపించు సుమా!
  సొమ్ములపైఁగల మమకా
  రమ్ము జనాళికి కడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 29. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  ధనమ్ముపై మమకారమ్మును గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 30. ఇమ్ముగ నెన్నిక వాగ్దా
  నమ్ముల నెఱవేర్చుచుండ నాయకులెల్లన్
  నమ్ముము సిరిసంపదల వ
  రమ్ముజనాళికి గడుమధురమ్మగును గదా

  రిప్లయితొలగించండి
 31. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 33. సమ్మతి నెలకొక సెలవు ది
  నమ్మున సతిసుతులగూడి నవరసములతో
  కమ్మని రసనపు టాహా
  రమ్ముజనాళికి గడుమధురమ్మగును గదా

  రిప్లయితొలగించండి
 34. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  అమ్ముని బల్కిన గాధగు
  కమ్మని రామాయణమ్ము కర్ణములకు రు
  చ్యమ్మయి ముక్తి నొసగు సా
  రమ్ముజనాళికి గడుమధురమ్మగును గదా !

  రిప్లయితొలగించండి
 35. ఇమ్మగు రామునిదౌ నా
  మమ్మది భక్తిని పలికిన మాయును పాపం
  బిమ్మహి,తారక,మాసా
  రమ్ము జనాళికి గడు మధురమ్మగును గదా!

  ఇమ్మహి వేసవి ,పిక రా
  వమ్మును కూపపు జలములు,వడపిందియలు
  న్నిమ్మగు మామిడి ఫలసా
  రమ్ము జనాళికి గడు మధురమ్మగును గదా!

  ఇమ్మగు పుల్లని మామిడి
  కమ్మని కారమ్ము,నావ కలియగ నూనెన్
  నెమ్మదికింపగు,వడకా
  రమ్ము జనాళికి గడు మధురమ్మగును కదా!

  కమ్మని మల్లెల వాసన
  కొమ్మకు తలనటు విరియగ కోరిక రగులున్
  తెమ్మెరల చుంబనపు సా
  రమ్ము జనాళికి గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 36. ఇమ్ముగ వ్యవసాయమ్మును
  నమ్ముచు పంటల కొరకిటు నయముగ నేలన్
  గుమ్మెడు రైతులదగు సీ
  రమ్ము జనాళికి గడుమధురమ్ము గదా!

  రిప్లయితొలగించండి
 37. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 38. కమ్మని వీణా నాదము
  అమ్మహదేవుని కీర్తన లాహా మధురం
  బిమ్ముగ సంగీతమున స్వ
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 39. కుమ్మగ హైదరబాదున
  కమ్మని బిరియాని రెండు కరముల తోడన్
  రమ్ము తెరచు స్వర్గద్వా
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి


 40. రమ్మనుచున్ దరి రారా
  రమ్మనుచున్బిల్చుచు రస రమ్యత గానన్,
  క్రమ్మన మైకము జుమ్మన
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 41. గమ్మున లేవగ నెందుకు?
  నెమ్మదిగా నావులించి నీలుగ వచ్చున్
  సుమ్ముగనీ భానున్ వా
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి