24, మే 2015, ఆదివారం

దత్తపది - 78 ((తీపు-కారము-పులుపు-చేదు)

కవిమిత్రులారా,
తీపు - కారము - పులుపు - చేదు.
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

24 కామెంట్‌లు:

 1. విరటు గొలువున సైరంధ్రి విరియు పులుపు
  మది వికారము చెందెను చేదు కొనగ
  తనువు తీపున వ్యధచెంది తనివి పొంగి
  యలమ టించెను కీచకుం డహ రహమ్ము

  ఇక్కడ పులుపు = పొగరు

  రిప్లయితొలగించండి
 2. సీ
  ఛీ! యధికారము చేదుస్సహులవగ
  రుగ్న మనస్కులై రోతబనుల
  నొనరించు దుష్ట సహోదర ద్వయంబుఁ
  మద్భుజ మండలా మండితంబు
  ఘన గదాదండంబు ఖండ ఖండములుగా
  సేయగగాంక్ష గాంచెదనటంచు
  చూపులు పుటముబ్బ జూచుకుంతీపుత్ర
  మధ్యముండాసభా మమధ్యమందు
  తే.గీ
  కరిని బట్టంగ నురికెడి హరి యనంగ
  అంగజు న్గాల్చెడిమహా లింగడనగ
  నగదరాతి దంభోళికా సెగలనంగ
  అంగలేయుచు దిరిగెభయంకరముగ

  రిప్లయితొలగించండి
 3. గురువుగారు
  క్షమించండి,
  బ్రాకెట్లలో వగరుంది పులుపు లేదు
  బయట పులుపుంది వగరు లేదు
  గమనించ గలరు.
  అందువల్ల పులుపు కోసం పద్యం మార్చవలసి వచ్చింది

  రిప్లయితొలగించండి
 4. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  ధన్యవాదాలు... సవరించాను.

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవ పాదంలో ‘ద్వయంబు’ అన్నచోట గణభంగం. అక్కడ ‘ద్వితయంబు’ అందామా?
  ‘సభామధ్యమందు’లో ఒక ‘మ’ అదనంగా టైపయింది.

  రిప్లయితొలగించండి
 6. గురువు గారూ సీసం మీదిి తేట గీతి ముక్త పద గ్రస్త మవలేదాండీ

  రిప్లయితొలగించండి
 7. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  ‘ద్వంద్వము’ అని నిరభ్యంతరంగా అనవచ్చు.
  మీ పద్యంలోని ముక్తపదగ్రస్తం బాగుంది. నేను మీరు చెప్పేదాకా గమనించలేదు.

  రిప్లయితొలగించండి
 8. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  (ఉపపాండవులనుం జంపిన యశ్వత్థామనుఁ జంపెదనని యర్జునుఁడు శపథముఁ జేయు సందర్భము)

  "ౘంపి తీ పుత్రులను నీవు సంతసమునఁ;
  గోరి యుపపాండవుల కపకారము నిడి
  నట్టి పాపులు పుడమి నుండంగఁ ౙనదు!
  త్రుటిని నిను నాదు శరముచేఁ దునిమివైతు!!"

  రిప్లయితొలగించండి
 9. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. తీపులు బెట్టగ తీయగ రారాజు
  .........జూదమాడగ ధర్మ జునుని బిలచె
  పులుపుతో కౌరవుల్ పురజనమ్ములుజూడ
  .......వదిన వలువబట్టె పదుగురెదుట
  మమకారమునజిక్కి మరదలి సుతులను
  ........దృతరాష్ట్రు డంపెను ప్రాంతరముకు
  చేదుకొనగ వృష్ణి యోధులా పాండవుల్
  ........విజయమ్ముతోబొందె విమల యశము

  ధర్మ పరిరక్షణార్ధమై ధరణిలోన
  సారధిగ కృష్ణుడయ్యెను భారతమున
  మంచి చెడ్డల మధ్యన మానవులకు
  జరుగు నిత్యము భారత సమర మిలను!!!

  రిప్లయితొలగించండి
 11. వలపు తీ పున కీచకుం డలమ టించి
  డెంద మందు వి కారము చేదు కొనగ
  పులుపు చేతను జేరెను బొలతి యైన
  ద్రోవ దేకాం త ముననుండ దుష్ట మతిని

  రిప్లయితొలగించండి
 12. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ధర్మజుని బిలిచె’ అనవలసింది ‘ధర్మజునుని బిలిచె’ అన్నారు. అక్కడ ‘ధర్మజుఁ బిలిపించె’ అనండి.
  ‘ప్రాంతరమునకు’ అనాలి. అక్కడ ‘ప్రాంతరమున/ వనములకును’ అనండి.
  కర్తృపదం ‘పాండవుల్’ బహువచనం, ‘పొందె’ అని క్రియాపదాన్ని ఏకవచనంలో ప్రయోగించారు. ‘పాండవుల్ విజయమ్మున గనిరి విమలయశము’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. తీపులు పుట్టె నాతనువు తీయగ నో సయిరంధ్రి! కన్నులున్
  కాపులు కాసె పొంగ మమకారము నీకయి రేబవళ్ళు, నీ
  చూపులు పుక్కిటంగొనియె చూడుము నాయెద, నోర్వజాలనే
  మాపులు మించ సింహబలు మానిని! చేదుకొనంగదే వడిన్

  రిప్లయితొలగించండి
 14. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సైరంధ్రి’ని సయిరంధ్రి అనరాదు. అక్కడ స్త్రీ పర్యాయపదాలేమైనా (వనజాక్షి, వగలాడి, జవరాల) వేయండి.

  రిప్లయితొలగించండి
 15. అర్జునుడు విశ్వరూప సందర్శన సందర్బమున

  నామనో వికారము లెల్ల నాశ మొంద
  నీదు దయచే దురూహ్యుని నిన్ను గంటి
  శ్రీపతీ! పురుషోత్తమ! చిద్విభూష!
  చూపులు పునీతములు గాగ చూచితేను

  రిప్లయితొలగించండి
 16. కురుక్షేత్ర రణానంతరము కౌరవుల గురించి ప్రజలు అనుకుంటున్నట్లుగా ఒక ఊహ........

  కుంతీపుత్రులతో రణంబనుట లేకున్నన్ మనశ్శాంతిచే
  కాంతాపుత్రులతోడ దివ్యఘనసత్కారమ్ములన్ బొందుచూ
  సంతోషమ్మున గాక తూపులు పురస్కారబటంచున్ జనెన్
  భ్రాంతుల్ వీడెను పార్థుచే దురితజీవస్తోమ సంఘాళికిన్.

  రిప్లయితొలగించండి
 17. కీచకుడు సైరంధ్రి తో

  నాతీ! పులపరి నైనన్
  రేతిరి తలపులు పులకలు రేపెన్! గనవే?
  మాతో ఛీత్కారములా?
  సైతున్! కౌగిలికి చేదు సమయము వరకున్!

  రిప్లయితొలగించండి
 18. గురువుగారూ ధన్యవాదములు. మీ సూచన ననుసరించి పద్యాన్ని యిలా సవరిస్తున్నాను.

  తీపులు పుట్టె నాతనువు తీయగ మాలిని! రమ్ము కన్నులున్
  కాపులు కాసె పొంగ మమకారము నీకయి రేబవళ్ళు, నీ
  చూపులు పుక్కిటంగొనియె చూడుము నాయెద, నోర్వజాల నే
  మాపులు మించ సింహబలు మానిని! చేదుకొనంగదే వడిన్

  రిప్లయితొలగించండి
 19. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  వింతౌ,పాపులు పుట్టి పోవుటది యుర్విన్ గాధలన్ జూడమే!
  చెంతన్ జేరిన వారి ప్రోద్బలముచే చేదుర్సదా దుష్కృతుల్,
  కుంతీ పుత్రులు ధర్మజాదులకటా! ఘోరాటవిన్ జేరినన్
  సుంతైనన్నపకారమున్ సలుపగా జూపించిరే క్రోధమున్

  రిప్లయితొలగించండి
 20. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సత్కారమ్ములన్ బొందుచున్’ అనండి. ‘పురస్కారం బటంచున్’ అన్నచోట ర తర్వాత అనుస్వారం తప్పిపోయింది.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ సవరణ బాగున్నది. సంతోషం!
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో ‘చేదుర్’...?

  రిప్లయితొలగించండి
 21. కుంతీ|పురుషోత్తముడౌ
  సంతానమె?ధర్మరాజు|సహకారమునన్
  పంతముచే దునుమాడక
  కొంతయు నిడుపులు-పుకార్లకు వెరువడుగదా|

  రిప్లయితొలగించండి
 22. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 23. కుంతి, శ్రీ కృష్ణునితో....

  కార ముఖ్యులు నా సుతుల్, కనగ వీడి
  పోరు రేపులు మాపులు పుణ్య చరిత
  నమ్మితీ పుడమి నిగాచు నాథుడేడి
  ఆదుకొనవయ్య వారినే చేదుకొనుము

  రిప్లయితొలగించండి