31, డిసెంబర్ 2015, గురువారం

పద్యరచన - 1134

కవిమిత్రులారా,
“నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీ 
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో 
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్”

నన్నయ గారి పై పద్యం యొక్క పూర్తి భావాన్ని కాని, కొంతభాగాన్ని కాని తేటగీతిలో చెప్పండి.

39 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నవ్య నవనీత సమాన మాపలు కులు
దారు ణాఖండల జగన్నుత విప్రు లందు
రాజు లందున విపరీత రాజ సమ్ము
శాంతు డయ్యునర పాలు శాప ముక్తి

ఇక్కడా తప్పులే

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
మరో ప్రయత్నం చేయండి.

కంది శంకరయ్య చెప్పారు...

మనము నవనీత తుల్యము మాట కఠిన
వజ్ర తుల్యము కావున బ్రాహ్మణుండు
శాపమును గ్రమ్మరింపఁగఁ జాలు; రాజు
లందు విపరీతవర్తన మరయగలము.

మంద పీతాంబర్ చెప్పారు...

మాట కఠినమ్ము వెన్నయే మనసు నిండ
బ్రాహ్మణుల యందు నివియె భూపాలురందు
తారు మారౌను ,శాపమున్ తాను మార్చ
నోప నొల్లడు విప్రుడే నోపుటొప్పు !!!

కంది శంకరయ్య చెప్పారు...

మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘విప్రుడే యోపు టొప్పు’ అనండి.

subbarao చెప్పారు...

విప్ర జనముల మనములు విమల మగుచు
పలుకులయ్యవి కఠినమై బరగు చుండు
విభుల యందున నీయవి వేరుగుంట
మార్చ నోపడు శాపము మహివి భుండు

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మనము నవనీత తుల్యము మాటలు గన
దారుణాఖండలాశని ధారలు సుమి
విప్రులకు విపరీత ముర్వీశుల కును
ద్విజు డెఱుగు శాప నిహతియు రాజె ఱుగడు

gurumoorthy చెప్పారు...

* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

భూసురే౦ద్రుని మనము నవోధృతమ్ము ,
వచన మా సురే౦ద్ర భయద వజ్ర సమము |
క్ష్మాపతుల రె౦డును వ్యతిరిక్తముగను౦డు
కాన నోపడు శాపము గ్రమ్మరి౦ప

sailaja చెప్పారు...

మాట కఠిన మైన మనసంత వెన్నయే
ద్విజులయందు జూడ నిజము గాను
నృపుల యందు నివియె విపరీతమగుగాన
శాపమోప లేడు,బాపడోపు!!!

విరించి చెప్పారు...

విప్రవర్యుల మనసులే వెన్నయైన
పలుకు లుకఠిన శరముల ములుకు లవియె
శాపమును గ్రమ్మరించిన జాలు రాజు
లందు విపరీత వర్తన మంత మగును

మిస్సన్న చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మిస్సన్న చెప్పారు...

వెన్న హృదయము పవి మాట విప్రులకును
రాజు లందిది ప్రతిలోమ మో జననుత!
కాన ద్విజుడోర్చు నరపతి క్షాంతి లేమి
శాపమిచ్చి మరల్పడు శాంతు డయ్యు.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసపూర్వాక్షరాల గురులఘుసామ్యం పాటించాలి కదా! ‘ద్విజు డెఱుగు శాపనిహతి భూవిభు డెఱుగడు’ అందామా?

కంది శంకరయ్య చెప్పారు...

గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘నవోధృతము’...?

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఓపలేనిది శాపమా? శాపోపశమనమా? ‘‘నిజముగ నివి| నృపులలోన గాన ముపమింప శాపమ్ము| భూపు డోపలేడు బాప డోపు’ అంటే ఎలా ఉంటుంది?

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అంత మగును’ అన్నది కొత్తభావం. ‘విపరీత వర్తన మరయగలము’ అంటే బాగుంటుందేమో ఆలోచించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం కొంచెం సంశయార్థంగా ఉంది. ‘మోజ+అనగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘మోజనంగ’ అనవచ్చు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. గమనించ లేదు “జ” సరిపోయిందికదా యనుకున్నాను. మీ సవరణ చక్కగా సరిపోయింది. ధన్యవాదములు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మనము నవనీత తుల్యము మాటలు గన
దారుణాఖండలాశని ధారలు సుమి
విప్రులకు విపరీత ముర్వీశుల కును
ద్విజు డెఱుగు శాప నిహతి భూవిభు డెఱుగడు

sailaja చెప్పారు...

ప్రణామములు గురువుగారు.. ఓపలేడు అన్నది ఉపసంహారం అవ్వదు.. మీ సూచన చాలా బాగుంది..ధన్యవాదములు..


మాట కఠిన మైన మనసంత వెన్నయే
ద్విజులయందు జూడ నిజము గనివి
నృపుల లోన గాన ముపమింప శాపమ్ము
భూపు డోప లేడు బాపడోపు!!!

gurumoorthy చెప్పారు...

గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

గురువర్యునికి నమస్కారములు

నవోధృతము = వెన్న

మీకు మరియు కవులకు కవయిత్రులకు నూతన స౦వత్సర. శుభాకా౦క్షలు

రేపు ఉదయo మాక౦దరికి మీరొక పద్య౦తో నూతన వత్సర శుభాకా౦క్షలు తెలుపుతూ దీవి౦చ౦డి

Unknown చెప్పారు...

మాట కఠినమైనను నిండు మనసు వెన్న
బాపలకు గాన శాపమ్ము బాప గలరు
రేని యందున నివి విపరీత మవగ
శాపమును గ్రమ్మరింపగ జాల డతడు

Unknown చెప్పారు...

. నిండుమనసన నవనీతనిలువలేగ|
విప్రులందున, రాజుల విధులయందు.
రాజుశాపమ్ము నొసగగ మోజనంగ?
ద్విజుడు నోపునా? విపరీత మిదియె|

A.Satyanarayana Reddy చెప్పారు...

రేడు మెత్తగామాటల నాడు చుండు
మనసు సంతతము కఠిన మనుట నిజ ము
బ్రాహ్మణులయందు నియ్యది వేరు గుండు
శా పమోచన ద్విజునకు సాధ్య మెపుడు
సార్వభౌముల కయ్యదసాధ్య మగును

కంది శంకరయ్య చెప్పారు...

గురుమూర్తి ఆచారి గారూ,
ధన్యవాదాలు.
మీకు కూడ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!

కంది శంకరయ్య చెప్పారు...

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నవనీతనిలువలు’ అనడం దుష్టసమాసం. అన్వయలోపం ఉంది. చివరిపాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ....
నిండుమనమన నవనీత నిధులె గాద
విప్రులందున, రాజుల విధము వేరు,
రాజు లోపరు శాపమ్ము గ్రమ్మరింప
ద్విజుడు నోపును విపరీత విధము గాగ.

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

భూసురేంద్రుడు,భూపతి పుడమి యందు
సములు,శాపమివ్వగలరు శక్తి యుతులు
బ్రాహ్మణుడు శాపముపహరింప గలడిలను
భూపతి కదియసాధ్యమౌ పోల్చి చూడ.
2.భూసురుడును భూపతియును పుడమిలోన
త్రికరణముల వారు శక్తిపరులిలను
కాని రాజు శాపమొసగ గలడు గాని
సద్ద్విజుని వోలెమరలింప శక్తుడౌనె.

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

హమ్మో ! మళ్ళీ కుస్తీ ! .......

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

శైలజగారూ!

మీ పూరణము ఆటవెలదిలో బాగున్నది. అభినందనలు. కాని, నియమము తేటగీతి కదా! పరిశీలింపుఁడు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

భూసురుని యెద మిసిమియౌ! బాస కఱకు!
కాన, శాప మిడియుఁ ద్రిప్పఁ గలఁ డతండు!
భూవరున కిది విపరీతము నగుఁ గాన,
శాప మిడియునుఁ ద్రిప్పంగఁ జాలఁ డితఁడు!!

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.