శ్రీ ఆముదాల మురళి గారి 122వ అష్టావధానం
'మదనపల్లె సాహితీ కళా వేదిక'
ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా
ది. 2-12-2018 (ఆదివారం)
నిర్వహణ, సమన్వయం - శ్రీ మునిగోటి సుందరరామ శర్మ గారు
1. నిషిద్ధాక్షరి - శ్రీ కంది శంకరయ్య గారు
(మదనపల్లె సాహితీ మూర్తుల ప్రాశస్త్యం)
(స)వి(ద)శ్వా(స)త్మ(క)భా(స)వ(వ)దీ(ప)వ్యత్
(ధ)శశ్వత్(క)వ్యా(ప)స(గ)క(-)వి(వ)తా(న)ధిసా(హ)ధి(క)త(క)వ(ల)ద్యా
(వ)ప్పాశ్వ(మ)వ(ర)ద(-)న(ద)ధీ(భ)మ(త)య(స)మౌ
(నాల్గవ పాదం నిషేధం లేదు. కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. (-) ఉన్నచోట నిషేధం లేదు).
విశ్వాత్మభావదీవ్యత్
శశ్వత్ వ్యాసకవితాదిసాధితవద్యా
ప్పాశ్వవదనధీమయమౌ
శాశ్వతమగు మదనపల్లి సత్కవి తపముల్.
2. సమస్య - శ్రీ లోకా జగన్నాథ శాస్త్రి గారు
(దేశము వీడిపోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్)
ఆశలు చుట్టుముట్టగ ధనార్జన సేయుటె ధ్యేయమంచు ధీ
కోశము విక్రయించి సమకూర్చగ గుప్పెడు గ్రుడ్డిగవ్వలన్
కాశియు గంగయున్ గలుగ కాదని వేడుక పోవవచ్చునా
దేశము వీడిపోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్.
3. దత్తపది - శ్రీ తెనాలి శేషగిరి రావు గారు
(గాజులు, జాజులు, పోజులు, మోజులు పదాలతో వరూధిని విరహవేదనా వర్ణన)
గాజులు పూలవాల్జడయు కాముని బాణములంచు నెంచితిన్
జాజులు వాడిపోయె రససాగరసప్తక మావిరయ్యెగా
మోజులు తీరవాయె నను ముంచెను పారుడు దుఃఖవార్ధిలో
పూజలు నిష్ఫలమ్ములయె పో జులుముం గనబర్చ నాగడే.
4. న్యస్తాక్షరి - శ్రీ వాసా కృష్ణమూర్తి గారు
(విక్రమాదిత్యుని నవరత్నాల సభావర్ణన ఉత్పలమాలలో... న్యస్తాక్షరాలు 1వ పాదం 2వ అక్షరం 'త్య', 2వ పాదం 8వ అక్షరం 'స', 3వ పాదం 12వ అక్షరం 'ర', 4వ పాదం 16వ అక్షరం 'ధ')
ని(త్య)ము విక్రమార్క నవనీత హృదంతర శారదాబ్జమున్
సత్య సుధర్మ బద్ధ (స)రసాకృతి సత్కవిరత్నమండలిన్
భత్యము నిచ్చి ప్రోచు రసభావ(ర)వీందుకరాళి కావ్యముల్
ముత్యపు ప్రోవులన్ కనకమూలము గూర్చిన (ధ)ర్మగాథయే.
5. వర్ణన - శ్రీ మల్లెల నాగరాజు గారు
(ప్రేమ వివాహం చేసికొన్నవారి తల్లిదండ్రుల ఆవేదన మత్తేభంలో)
పదముల్ గ్రందక గుండె క్రింద నిడి పాపన్ బుజ్జి చిన్నారినిన్
హృదయంబందున గూడుగట్టి రసవాక్ప్రేమంబునన్ పెంచినన్
ముదితల్ వే తలిదండ్రి వీడి చనుటల్ మోదంబె? ఖేదం బగున్
విదితంబౌనె కుటుంబ గౌరవము లీ పిల్లల్ మనోవీథిలోన్.
6. ఆశువు - శ్రీ కె.యల్. అనంతశయనం గారు
౧. (మదనపల్లె సాహితీ కళాసమితి ప్రాశస్త్యం)
మొలకలెత్తెడి సాహిత్య మూర్తులకును
జన్మనిచ్చెడు స్థానమై సహజమైన
భావబంధుర కవితల భాగ్యమిచ్చి
వెల్గు మదనపల్లెను కళావేదిక గద!
౨. (ఏసుక్రీస్తు భగవద్గీతను చదివితే ఎలా ఉంటుంది?)
ధర్మము దప్పరా దనుచు తాను స్వయమ్ముగ బోధ సేయడే
నిర్మల భక్తి తత్పరత నిత్య మహింసను పాదుకొల్పడే
కర్మల వీడి జీవుడిట కానడు జన్మ మటంచు బల్కడే
శర్మద వృత్తి యేసు తను సాంగముగా పఠియించి గీతమున్.
౩. (శ్లోకానువాదం)
శాంతి సత్యంబు దయయును సర్వభూత
హిత మహింసయు దానంబు హ్రీసహితపు
వర్తనంబును గల్గుట వారిజాక్షు
పూజకగు పుష్పచయమని పూజ్యవాణి.
7. పురాణ పఠనం - శ్రీ జలకనూరి మురళీధర్ రాజు గారు
8. అప్రస్తుత ప్రసంగం - డా. మునిగోటి సుందరరామ శర్మ గారు
అవధానానంతరం 'మదనపల్లె సాహితీ కళావేదిక' వారు ఆముదాల మురళి గారిని
"అవధాన రత్నాకర" బిరుదంతో సత్కరించారు.