3, జనవరి 2013, గురువారం

పద్య రచన - 210

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. శ్రీరమాత్మజుడవై చిత్తసంభవుడవై
    శృంగార రస మాహాశేవధి వయి
    సకల లోకాలలో సాటియే లేనట్టి
    ప్రఖ్యాత సౌందర్య రాశివగుచు
    ప్రేయసీ ప్రియులకు హృదయాలయాలలో
    నారాధ్య దైవమై యలరుచుండి
    చిలుక వాహనముగా చెరకు ధనుస్సుగా
    పంచ బాణములను బట్టి తనరు
    దేవ! నిస్స్వార్థముగ మహాదేవు కంటి
    మంటలకు భస్మయితివో మార! మరల
    శిఖరిజా కృపచే పునర్జీవితమ్ము
    కాంచిన రతీప్రియా! నమస్కార శతము

    రిప్లయితొలగించండి
  2. వన్నెలుగల చిలుకను బహు
    కన్నెలు గల చిలుక వోలె కలయగ చూడన్
    అన్నా! పూవిలు కానిని
    చెన్నుగ చిత్రించినారు చిత్రం బహఃహా !

    రిప్లయితొలగించండి
  3. చెఱకు గడ విల్లుగా జేసి చివ్వుమనుచు
    నైదు పూబాణముల నేసి యవనిలోని
    జీవ కోటిని సిడిముడి చేయ గల్గు
    చిలుక తత్తడి రౌతుకు చేతు నతులు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. చెఱకు గెడను నా యుధముగ జేసి కొనిన
    మార ! వంద నంబులు పది వేలు సేతు
    మమ్ము పీడించ వలదు సు మా! యెచటను
    మదిని జెడ గొట్టు విలుకాడ ! మన్మధుండ!

    రిప్లయితొలగించండి
  6. చిత్రంలోని నలుగురు ముద్దరాళ్లు మదనుని విజేతృత్వానికి ప్రతీకలుగా కనిపిస్తున్నారు - అందుకని -

    చక్కెర వింటి జోదెక్కు పెట్టిన విల్లు
    తన మేనె యని చెప్పదగిన దొకతె ;

    చెరకు విల్మేటి చెచ్చెర వేయు తూపులు
    తన చూపులని చెప్పదగిన దొకతె ;

    తియ్య విల్తుని తేజి తేనె పల్కుల గుల్కు
    తన పల్కులని చెప్పదగిన దొకతె ;

    వలరాజు వాడి యమ్ముల గేరు విరిసౌరు
    తన మోమె యని చెప్పదగిన దొకతె ;

    పూలబాణాల ధరియించి పూవుబోండ్ల
    దేహమే తన గేహమై తేజరిల్లి
    ఎంత మగవానినైన నోడింతు ననుచు
    నరుగుదెంచుచున్నాడదే స్మరుడు కనుడు !!!

    రిప్లయితొలగించండి
  7. డా. విష్ణునందనన్ గారి పద్యము భావగర్భితముగా మధురముగా నలరారుచున్నది. వారికి శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. రతియను నాతినిన్ సుమ శరమ్ములఁ బూనిన వింటికానితో
    మతులు చలించు వారిక హిమాలయమందుననైన నిష్ఠతో
    యతివిధి నుండజాలరు, మహాశివుడైనను, మన్మథారి ;యా
    సతియెడ జేరు కారణము చక్కని తుమ్మెద నారి వాడె పో.

    రిప్లయితొలగించండి
  9. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
    శుభాశీస్సులు.
    తుమ్మెదలు చంపకముల దరికి రావు. కాని మీ చంపకమాలలో తుమ్మెదలను నర్తింప జేయుట అద్భుతము. మీకే తగినది. అభినందనలు. రతీ మన్మథులపైని మీ పద్యము చాలా బాగుగ నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 03, 2013 2:51:00 PM

    అశ్లీల సాహితి యరవిందమగుచుండ
    పత్రికాశోకము పరిఢ విల్ల
    వెండి తెరలు చూతమై డాబు చేయగ
    బుల్లితెరలు నవమల్లికనగ(యయి)
    అంతర జాలమ నంత నీలోత్పల
    మగుచు పరచుకొననవనినంత

    మనమధమమగుచునుండ మన్మథుండు
    తాప శోషణో న్మాద కృత్యములు చేయ
    పంచ బాణోద్ధృతిన్ ధరన్ సంచ రింప
    మగువ మాన ప్రాణంబులు మాసి పోయె.

    కలియుగంబున కంతుని కార్య మెల్ల
    నబల పాలిట యభిశాప మగుచునుండ
    మాన వాళి మంచినడతన్ మసలు కొనగ
    మన్మథా!నీదు ధాటిని మాను కొనుము.

    రిప్లయితొలగించండి
  11. అరవింద మశోకంబును
    సరియగు చూతంబు లింక సానందముగా
    నరయగ నవమల్లికలను
    మరి నీలోత్పలము బూను మారుండెపుడున్.

    ధనువుగ నిక్షువు జేకొని
    మనములలో ప్రేమ గూర్చు మానవులైనన్
    ఘనులా సురవరులైనను
    దనుజాదులు వీనివశులు తథ్యము చూడన్.

    నిగమస్తుతుడగు శివునకు
    నగజాతను గూర్చబూన నాయత్నమునన్
    తెగిపడె బుగ్గిగ నచ్చట
    జగములకై భవునివలన సన్మతియగుటన్.

    పంచబాణుడన్న ప్రద్యుమ్నుడన్నను
    మదనుడన్న మరియు మారుడనిన
    మీనకేతనుండు మీదట కందర్పు
    డన్న మన్మథుం డనంగు డతడు.

    కాముడు కాంక్షించినచో
    నీమంబును బూని తపము నిత్యము చూడన్
    తామొనరింపగ జాలరు
    భూమిన్ సన్మునిజనంబు బుద్ధి చలించున్.

    మన్మథ! ప్రణతులొనర్చెద
    సన్మతి నాకందజేసి సత్యోక్తులతో
    సన్మార్గ వర్తనంబున
    సన్మానము గూర్పవయ్య సభలం దెపుడున్.

    రిప్లయితొలగించండి
  12. పుడమిలోన చెలగు పురుషార్థములు నాల్గు
    పురుషు డెపుడు వాని నరయ గోరు
    పొలతుకలు నలుగురు పురుషార్థముల భంగి
    యరుగుచున్న వారు మరుని వెంట

    రిప్లయితొలగించండి
  13. మన్మధ బాణము సోకిన
    యున్మత్తు లౌదు రనగ నూహల యందున్ !
    సన్మతి లేకను స్థిరముగ
    చిన్మయులై దిరి గెదరట చిలుకల పైనే !

    రిప్లయితొలగించండి






  14. చిలుక తత్తడి రౌతువి,,చెలియనీకు
    ముద్దులొల్కు రతీదేవి మోహనాంగి
    అలరులమ్ములామనిదొర యనుగుమిత్రు
    డట్టి నీకడ్డు కలదె యీ యవనిలోన.

    ఈ చిత్రంలో పంచబాణునికి నాలుగే బాణాలు ఉన్నవి.ఐదవది అప్పుడే మనమీద ప్రయోగించాడా?

    రిప్లయితొలగించండి





  15. చిలుక తత్తడి రౌతువి,,చెలియనీకు
    ముద్దులొల్కు రతీదేవి మోహనాంగి
    అలరులమ్ములామనిదొర యనుగుమిత్రు
    డట్టి నీకడ్డు కలదె యీ యవనిలోన.

    ఈ చిత్రంలో పంచబాణునికి నాలుగే బాణాలు ఉన్నవి.ఐదవది అప్పుడే మనమీద ప్రయోగించాడా?

    రిప్లయితొలగించండి
  16. పంచబాణము లన పంచేంద్రియము లొప్పు
    వశము జేసికొనును పంచశరుడు
    తప్పలేదు తుదకు దక్షిణామూర్తికి
    జయము జయము నీకు స్మరుడ ! మరుడ !

    రిప్లయితొలగించండి
  17. మన్మథుని గురించి మనోజ్ఞమైన పద్యాలు రచించి రంజింపజేసిన కవిమిత్రులు.....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    సుబ్బారావు గారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    కమనీయం గారికి
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ పండిత నేమాని గారి ప్రశంసాపూర్వకాభినందనలకు బహుధా ధన్యవాదాలు !!!

    రిప్లయితొలగించండి
  19. జోరును పెంచకు మన్మథ!
    దారులుఁ దప్పిన నడతకు తరుణులు బలియో
    దారుణమది పెట్రేగెను!
    పేరొందినపత్రిఁబట్టపిరమిడు లేమౌ?

    రిప్లయితొలగించండి