4, జనవరి 2013, శుక్రవారం

పద్య రచన - 211

శ్రీమంతం
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
ఈరోజు మా కోడలు సౌ|| కల్పన శ్రీమంతం. 
కవిమిత్రులు ఆశీస్సు లందజేయవలసిందిగా మనవి.

24 కామెంట్‌లు:

 1. శ్రీమంతంబగు కందివంశమునకున్ శ్రీభూషయౌ రీతిగా
  ప్రేమన్ జిల్కెడు వంశ వర్ధకుడు పృథ్విన్ జన్మనొందున్ హృదా
  రామంబుల్ వెలుగొందజేయు ననుచున్ రమ్యాక్షరాశీస్సులన్
  శ్రీమంతంపు వధూటి కల్పనకివే చెన్నొంద గావించెదన్

  రిప్లయితొలగించండి
 2. చిరం జీవి సౌభాగ్యవతి కల్పనకు హృదయ పూర్వక శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. కుం॥ సౌ॥ కల్పన శ్రీమంతం సంధర్భంగా హృదయపూర్వక శుభాశీస్సులు.

  హేమంతంబున జరిగెడు
  శ్రీమంతంబిది సుగుణుని శ్రీరాముని మీ
  ప్రేమను పొందెడు తనయుని
  యీమహి మెచ్ఛంగ నిచ్చునీశుడుమీకున్!

  రిప్లయితొలగించండి
 4. గురువు గారికి హృదయ పూర్వకాభినందనలు. చిరంజీవి సౌభాగ్యవతి కల్పన గారికి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 5. కోడలి సీమంతంబని
  వేడుక సెలవిచ్చినారు విబుధా! మనవం-
  డాడుత బుడిబుడిగా నడ-
  యాడుత నట్టింట మీకు హాయిగ త్వరలో.

  (గర్భిణీ స్త్రీకి జేసే శుభ కార్యాన్ని శ్రీమంతం అంటారా లేక సీమంతం అంటారా అని నా సందేహం.)

  రిప్లయితొలగించండి
 6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 04, 2013 9:53:00 AM

  మిస్సన్న మహోదయా! నమస్కారము. వాడుకలో రెండు పదములు గలవు. శ్రీమంతము-ఒప్పిదముగలది, సంపదగలది అని ఆంధ్రవాచస్పత్యము.స్త్రీకి నిజమైన సంపద సంతానమే గదా! ఇక సీమంతము అన్నది స్త్రీకి చేయు ఒక సంస్కారము. నా అవగాహనమేరకు చేప్పితిని. సవివరము పెద్దలు తెల్పవచ్చు.

  రిప్లయితొలగించండి
 7. అయ్యా! శ్రీ మిస్సన్న మహాశయా!
  శుభాశీస్సులు. బాగానే సెలవిచ్చేరు. సీమంతమే ఒప్పు.

  శ్రీమంతమ్ముగ పర్వము
  సీమంతము జరుగు ననుచు జిత్తంబలరన్
  శ్రీమంతంబని నుడువుట
  యో మిస్సన్నా! మహాత్మ! ఒప్పే యనమా?

  రిప్లయితొలగించండి
 8. కుం||సౌ|| కల్పన గారికి శుభాభినందనలు. మీ కుటుంబానికి సర్వశుభాలూ ఒనగూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 9. తరుణులు గూడి మహాసం
  బరముగ సీమంతమునిట భళిరా యనగన్
  జరిపించిరనెడు మంచి క
  బురు విన మనమున మఱింత మోదము కూడున్.

  రిప్లయితొలగించండి
 10. అమ్మ ! కల్పన! శ్రీ మంత మమ్మ నీ కు
  జరుపు చుండిరి యింతులు స హృ దయముగ
  అందు కొనుమమ్మ వారల యాశిసు లను
  బంధు మిత్రులు దోడురా భవ్య ముగను .

  అమ్మా ! కల్పన! వేగమె
  యిమ్మా నొక మనుమరాలి నీ శా రూపున్
  ఇమ్ముగ శంకరు సామికి
  నెమ్మది నా శీ ర్వదింతు నిరతము నిన్నున్

  రిప్లయితొలగించండి
 11. పండితుల వారికి ప్రణామములు.
  నిన్నటి మీ ఆశీస్సులు మాకు మఱింత ఉత్సాహమునిచ్చుచున్నవి.

  రిప్లయితొలగించండి
 12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 04, 2013 1:31:00 PM

  పూజ్యశ్రీ కందిశంకరార్య సదనాన జరుగు సీమంతోత్సవానికి,
  కులదీపకుండగు పౌత్రాగమనానికి స్వాగతం పలుకుతూ చి.ల.సౌ. కల్పన గారికి ఆశీఃపూర్వకముగా “స్వాగత” వృత్తమున

  రాగ రంజిత సరాగపు “సీమం
  తా”గమంబు సతతామని గాగన్
  కౌగిలిన్ శిశువు “కల్పన “నిల్పన్
  స్వాగతోత్సవము “పౌత్రుని” గాంచన్.

  రిప్లయితొలగించండి
 13. సౌఖ్యమబ్బుగాత, సత్పుత్రభాగ్యంబు
  కలుగుగాత, శుభము కల్పనకిక
  భగవదాశిషంబు పత్యనురాగంబు
  లందుచుండుగాత యనవరతము.

  రిప్లయితొలగించండి
 14. శ్రీమంతము జరుపుకొనెడు
  శ్రీమతి కల్పనకు గల్గు శ్రీలును శుభముల్
  ధీమంతుండగు తనయుడు
  శ్రీమంతుడె పుట్టిపెరిగి చిరముగ బ్రదుకున్

  రిప్లయితొలగించండి
 15. తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారూ మీ వివరణకు ధన్యవాదాములండీ.

  రిప్లయితొలగించండి
 16. సీమంతంబను వేడుక
  శ్రీ మంతంబైనదనుచు సెలవిచ్చిన శ్రీ
  నేమాని పండితార్యా !
  నేమోదంబందినాడ నిర్మల చరితా!

  రిప్లయితొలగించండి
 17. చక్కనైనట్టి చెలువకు మక్కువగను
  రమణులెల్లరు సలుపు సంరంభములను
  హరువు మీర సీమంతమ్ము ,నతిమనోహ
  రముగ జిత్రించె దామెర్ల రామరావు.

  ' సీమంతము 'అన్న పదమే సరియైనది.

  రిప్లయితొలగించండి


 18. మీ కోడలు చి.సౌ.కల్పనకు నా శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 19. సౌ|| కల్పన గారికి సర్వశుభాలూ ఒనగూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి

 20. ఒక్క సుబ్బారావుగారు తక్క, అందరూ పుత్రుడు/మనుమడు పుట్టాలని దీవించారు.
  2013లో కూడా ఇంత gender bias ఎందుకో?? :-)

  చి.ల.సౌ|| కల్పనకు,

  నిండుగ నవమాసంబులు
  మెండుగ ఆరోగ్యమిచ్చి, మీవంశమునన్
  పండంటి బిడ్డనొసగగ
  తొండపుదేవునిఁ దలచుచు స్తుతియింతు మదిన్

  రిప్లయితొలగించండి
 21. pushyam garu!
  namaskaramulu.now a days putrula kante putrikale manalanu aadaraabhimaanaalato chustaarani naa abhipraayamu.

  రిప్లయితొలగించండి

 22. నేను శుభాకాంక్షలు మాత్రం తెలిపానని గమనించగలరు.నాకు gender bias లేదు.పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలనే దీవిస్తున్నాను.(మగ ఐనా,ఆడ ఐనా.)

  రిప్లయితొలగించండి
 23. కంది (కావేటి) కల్పనశనివారం, జనవరి 05, 2013 1:42:00 PM

  అందరి ఆశీర్వాదాలతో ‘సీమంతం’ వేడుక సంతోషకరంగా జరిగింది. శుభాకాంక్షలు తెలిపిన పూజ్యులు శ్రీ పండిత నేమాని గారికి, శ్రీమతి రాజేశ్వరి నేదునూరి గారికి, శ్రీ సహదేవుడు గారికి, శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారికి, శ్రీ మిస్సన్న గారికి, శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ సుబ్బారావు గారికి, శ్రీ హ.వేం.స.నా.మూర్తి గారికి, శ్రీ నాగరాజు రవీందర్ గారికి, శ్రీ కమనీయం గారికి, శ్రీ పుష్యం గారికి, ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు.

  రిప్లయితొలగించండి
 24. మా కోడలు సౌ. కల్పన సీమంతానికి ఆశీస్సులందించిన కవిమిత్రులందరికీ ధన్యవాదాలు.
  పలికిరి శుభములు మా కో
  డలి సీమంతమ్మునందు లలితములగు వా
  క్కులతో పద్యమ్ములతో;
  కలిగెను మోదమ్ము; నతులు కవిమిత్రులకున్.
  *
  ‘సీమంతమే’ సరియైన పదం. ‘శ్రీమంతము’ శబ్దాన్ని విశేష్యంగా తీసుకుంటే దానికి కడిమిచెట్టు, రావిచెట్టు అనే అర్థాలు ఉన్నాయి. నేనే పొరబడ్డాను. మన్నించండి.
  *
  మా ఆవిడకు ‘మనుమడు’ కావాలనీ, నాకు ‘మనుమరాలు’ కావాలనీ ఉంది. ఈ విషయంలో మా యిద్దరి మధ్యా అప్పుడప్పుడు సంతోషకరమైన గొడవ జరుగుతూ ఉంటుంది. నేనెప్పుడైనా ‘నాకు మనుమరాలే కావాలి’ అంటే మా ఆవిడ ‘ఏమిటా అపశకునపు మాటలు? పైన తథాస్తు దేవతలుంటారు" అంటుంది.

  రిప్లయితొలగించండి