13, జనవరి 2013, ఆదివారం

పద్య రచన - 220

కవిమిత్రులకు భోగి పండుగ శుభాకాంక్షలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:


  1. భోగి మంటలు బాపి జాడ్యము స్ఫూర్తినిచ్చుత వెల్గుతో
    భోగి మంటలు బాపి శైత్యము భూరి సౌఖ్యము గూర్చుతన్
    భోగి మంటలు దుఃఖ రాసుల పూర్తిగా దహియించుతన్
    భోగి మంటలు సజ్జనాళిని ప్రోత్సహించుత ప్రేమతో

    రిప్లయితొలగించండి
  2. భోగి పర్వదిన శుభాకాంక్షలు.

    భోగి మంటలు వేసేము వేగ రండు
    పనికి రానట్టి వాటిని వైచి పొండు
    మనసు నందున నెలకొన్న మలినములను
    రేగు మంటనిడ బ్రతుకు రేగు పండు.

    రిప్లయితొలగించండి
  3. భోగిమంటల గనలేము పురిని నేఁడు
    పట్నవాసపు భోగము పరిఢవిల్లె;
    విందులు, వినోదములకెల్ల పెద్ద పండు
    గలను మాట నిలిచెనయ్యొ, కనుము వినుము.

    రిప్లయితొలగించండి
  4. గోదా దేవికి మోక్షము
    రాధారమణుడొసగంగ రంగులమయమై
    భూదేవిఁరంగవల్లుల
    మోదాతిశయంబుఁ దిద్ద భోగియె జరుగున్

    రిప్లయితొలగించండి
  5. భోగములకు సూచకముల్
    వేగమె దహియించివేయు విపులాఘములన్
    రోగహరంబగు నికపై
    పోగొట్టును దు:ఖమండ్రు భోగిని మంటల్.

    మకరమునకు మార్తాండుడు
    సకలంబును గాచువాడు చనుదెంచగఁ దాఁ
    బ్రకటితమౌ నయనం బిదె
    యికపై శుభమంచు చేతు రీమంట లిలన్.

    అయనద్వయమున శ్రేష్ఠము
    సుయశంబులు కూర్చుచుండు సుందరమిదియున్
    భయమేలా రండిక నఘ
    చయమును గాల్చంగ ననుచు జనులీ భోగిన్

    ఉదయాత్పూర్వము మిక్కిలి
    ముదమందుచు చేరినిల్చి మునుపటి దొసగుల్
    మదిలో నిండిన కల్మష
    మది గాల్తురు భోగిమంటలం దెల్లెడలన్.

    ఈవిధి నిర్మలమతులై
    కావింతురు ధర్మకృతులు ఘనముగ మీదన్
    పావన మీసంక్రమణము
    భావింపగ పుణ్యదంబు భాగ్యప్రదమున్.

    రిప్లయితొలగించండి
  6. పనికి మాలిన కట్టెలు పదిల పఱచి
    బోగి మంటను వేతును భోగి నాడు
    అటుల జేయగ , బోవును నఘము లన్ని
    సంది యంబును నిసుమంత పొంద వలదు

    రిప్లయితొలగించండి
  7. భోగి మంటల మించిన రగులు వెతలు
    గగన మార్గము నంతయు కప్పి కొనగ
    కరుణ జూపుచు మము గాచి క్రాంతి నిడగ
    జగము నేలెడి శంకర దిగుము భువికి !

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 12:25:00 AM

    చిన్నితనంబున చిన్నారి చేతుల
    గోమయంపు కుప్ప కూడ బెట్టి
    చాలినంత దొరుక చక్కంగ జేయుచు
    మోదకాకృతులంత మోట కములు
    ఆతపమందున నడుగంట నిడుపులన్
    హస్త ముద్రలు పడి హత్తుకొనగ
    పిదప తర్జనితోడ బెజ్జంబు బెట్టుచు
    బుసములు నెండగ ప్రోగు జేసి
    పుల్ల ముక్క తోడ పూని రంధ్రము జేసి
    సూత్ర మొకటి దెచ్చి సులువుగా గ్రుచ్చుచు
    దండ జేసి వేయు చుండును దండిగ
    భోగి మంట లందు భోగ మియ్య

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 12:36:00 AM

    శ్రీ పండితార్య, గురువర్య, మిత్రవర్య, సోదర సోదరీమణు లందరికివే నాహృదయపుర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి