30, జనవరి 2013, బుధవారం

పద్య రచన – 237

తిరుచ్చి రంగనాథస్వామి
కవిమిత్రులారా,  
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. శ్రీమద్రమాదేవి శృంగారరసమయి
    యొప్పుగా పాదము లొత్తుచుండ
    వారిజాతాసన వాసవాది సురలు
    వేడ్కతో స్తుతులు గావించుచుండ
    నారద సనక సనందనాది మునులు
    జయ జయ ధ్వానముల్ సలుపుచుండ
    బహు ప్రకారములుగా భక్త బృందంబులు
    వివిధ సేవలను గావించుచుండ
    నెల్లరను చల్లగా కటాక్షించుచుండి
    విశ్వ పరిపాలనమ్ము గావించుచుండు
    ద్విజతురంగ! దయాపాంగ! ధృతరథాంగ!
    రంగ! శ్రీరంగ! శ్యామాంగ! ప్రణతి ప్రణతి

    రిప్లయితొలగించండి
  2. శేష శయన! పద్మ సంభవ జనకుడ!
    పద్మ నయన ధవుడ! పరమ పురుష!
    గరుడగమన! రంగ! కరముల మోడ్తును
    పరమ యోగి హృదయ చరుడ! దేవ!

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగున్నది. జనకుడ!, ధవుడ!, చరుడ! అనే సంబోధనలు వ్యాకరణ శుద్ధములే అయినను శ్రుతిపేయములు కావని అంటారు. అందుచేత మీ పద్యమునకు కొన్ని మార్పులు చేసేను. చూడండి:

    శేషశయన! పద్మసంభవ సంస్తుత్య!
    పద్మనయన! శౌరి! పరమపురుష!
    గరుడ గమన! రంగ! కరములు మోడ్తును
    పరమయోగి హృదయవాస! శ్రీశ!

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా ! చక్కని మార్పులు చేశారు. చాలా బాగున్నది ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. విష్ణు చిత్తుని కొమరిత విభుడ వయ్యు
    బ్రహ్మ లోకము నందున పరమ పూజ్య
    విప్ర నారాయ ణుడవై వెలసి మురియ
    రాము కారాధ్య దైవమ్ము రంగ నాధ !

    రిప్లయితొలగించండి
  6. శ్రీరంగనాథస్వామిపై మనోహరమైన పద్యాలు రచించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 31, 2013 12:17:00 AM

    ముక్కోటి దేవతల్ మునుముందు వినుతింప
    ముక్తకంఠముతోడ మునులునుడువ
    నారద తుంబుర నాదవిన్యాస గా
    నామృత ఝర్ఝరు లాక్రమింప
    అతిసుందరులగు యప్సరసలట నయ
    నానందకరముగ నాట్యమాడ
    పాల్కడలిని శేష పాన్‌పు పై పవళింప
    పాదము లొత్తగ పద్మవాస
    పద్మనాభుండు పదునాల్గు భువనములను
    కాచు చుండగ ధారుణిన్ కాంచుమయ్య
    రంగ నాధుని రూపమునంగ రంగ
    వైభవమ్ముగ సాగంగ భక్తి తోడ.


    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ఎత్తుగీతి మొదటిపాదంలో యతి తప్పింది.
    'పుష్కరాక్షుండు పదునాల్గు భువనములను' లేదా 'భోగిశయనుండు పదునాల్గు భువనములను' అందాం....

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 31, 2013 2:58:00 PM

    ముక్కోటి దేవతల్ మునుముందు వినుతింప
    ముక్తకంఠముతోడ మునులునుడువ
    నారద తుంబుర నాదవిన్యాస గా
    నామృత ఝర్ఝరు లాక్రమింప
    అతిసుందరులగు యప్సరసలట నయ
    నానందకరముగ నాట్యమాడ
    పాల్కడలిని శేష పాన్‌పు పై పవళింప
    పాదము లొత్తగ పద్మవాస
    భోగిశయనుండు పదునాల్గు భువనములను
    కాచు చుండగ ధారుణిన్ కాంచుమయ్య
    రంగ నాధుని రూపమునంగ రంగ
    వైభవమ్ముగ సాగంగ భక్తి తోడ.

    రిప్లయితొలగించండి
  10. రంగ నాథుని కొలువగ బెంగ తొలఁగి
    నిద్ర నానంత శయనుండె నిత్య మిచ్చు
    విప్ర వర్యులుఁ జేసెడు వేద మంత్ర
    పూజ,లోకమంతటికిని పుణ్యమిచ్చు

    రిప్లయితొలగించండి