18, జనవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 941 (శిల్పము జూడ వేడుకను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.
ఆకాశవాణి సౌజన్యంతో ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. అల్పమె రాలఁ జెక్కుకళ? లద్భుతమై యలరారుచుండదో
    కల్పములెన్నొదాటినను, కన్నులకింపులు గూర్చి భవ్యమై
    శిల్పుల పేర్మి బెంచునిది; శీతలమౌ తెలిమంచుతెమ్మెరన్
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

    రిప్లయితొలగించండి
  2. ఆల్పము గాని రూపమది నయ్యెడ రాముదు కృష్ణ రూపమే

    కల్పన జేసి జూడగను కాదని వేరుగ జూడజాలమే

    సల్పెద జోత లాతనికి సాదృశ తారక రామ రూపుతో

    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

    రిప్లయితొలగించండి
  3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 18, 2013 12:44:00 PM

    కల్పన పెళ్ళియంచు శుభకార్యము చూడగవత్తు రంచుసం
    కల్పము చేసియుంచిరట కన్యక శిల్పము వేదిముంగిటన్
    సల్పగ నాట పిల్లలట చాతురి కన్యక చేయిలాగగన్
    శిల్పము జూడవేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

    రిప్లయితొలగించండి
  4. నిల్పును సర్వలోకముల నీరజ నేత్రుడు నిర్వికారుడై
    తల్పము జూడ వేతలల త్రాచు నివాసము పాలసంద్రమున్
    తాల్పును శంఖచక్రములు దర్శన మీయగ దేవళమ్మునన్
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

    రిప్లయితొలగించండి
  5. చిన్న టైపాటు సవరణ తో..

    నందమూరి తారక రామారావు గురించి...

    ఆల్పము గాని రూపమది నయ్యెడ రాముడు కృష్ణ రూపమే

    కల్పన జేసి జూడగను కాదని వేరుగ జూడజాలమే

    సల్పెద జోత లాతనికి సాదృశ తారక రామ రూపుతో

    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

    రిప్లయితొలగించండి
  6. కల్పము లెన్ని మారినను కన్నుల విందగు శిల్ప సం పదల్
    స్వల్పము గాటు తప్పినను సౌరులు మారుచు వికృతమ్మగున్
    అల్పము కాదు కాదనుట రాలను చెక్కు టనల్పమే యనన్
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్ !

    రిప్లయితొలగించండి
  7. తెల్పగ మేఘదూతమును తెల్పుచు యక్షు సతీవియోగమున్
    సల్పెను కావ్య కల్పనను సంస్కృత మందున కాళిదాసుడే
    అల్పము కాని వర్ణనల యందము గొల్పెడు కావ్యకల్పనా
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

    రిప్లయితొలగించండి




  8. అల్పముగాని యోచన గళాత్మకబుద్ధులు కొందరొక్కెడన్
    గల్పనజేసి తేనె కలకండను జేరిచి యందమైన యా
    శిల్పమనోజ్ఞ సుందరిగ జేసి ,జిలుంగుల పూత బూయగా
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.!

    రిప్లయితొలగించండి




  9. అల్పముగాని యోచన గళాత్మకబుద్ధులు కొందరొక్కెడన్
    గల్పనజేసి తేనె కలకండను జేరిచి యందమైన యా
    శిల్పమనోజ్ఞ సుందరిగ జేసి ,జిలుంగుల పూత బూయగా
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.!

    రిప్లయితొలగించండి
  10. సల్పుట యాగ రక్షణము చక్కని సీతను చేయి పట్టుటల్
    నిల్పుట తండ్రి మాటను వనిన్ జరియించుట కోతి మూకతో
    గల్పుట మైత్రి రావణుని కాల్పురి కంపుట రామ సత్కథా
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

    రిప్లయితొలగించండి
  11. డా. ప్రభల రామలక్ష్మిశుక్రవారం, జనవరి 18, 2013 9:44:00 PM

    కల్పనలెన్నొచేయవలెకన్నులకాననిలోనివీధిలో
    అల్పముకానిభావనల అర్థము తెల్పెడిరూపుతేవలెన్
    అల్పములైనరేణువుల ఐక్యముతోడనురూపు దాల్చు ఏ
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్

    రిప్లయితొలగించండి
  12. డా. ప్రభల రామలక్ష్మిశుక్రవారం, జనవరి 18, 2013 9:46:00 PM

    కల్పనలెన్నొ చేయవలె కన్నులకానని లోనివీధిలో
    అల్పముకాని భావనల అర్థము తెల్పెడి రూపు తేవలెన్
    అల్పములైన రేణువుల ఐక్యముతోడను రూపు దాల్చు ఏ
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్

    రిప్లయితొలగించండి
  13. నేమాని పండితార్యా! మీరు రాని లోటు కొట్టొచ్చినట్లు
    కనుపిస్తోంది.
    గురువుగారికేమో అనారోగ్యం.

    రిప్లయితొలగించండి
  14. గురువు దూరదేశములందుండగా శిష్యులు/అభివృధ్ధి కాంక్షించు వారలు బోథననరయవచ్చు !!!

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు...
    అనారోగ్యం.. ఆపై తప్పని దూరప్రయాణాలు... బ్లాగును వెంట వెంట వీక్షించి స్పందనలు తెలియజేసే అవకాశం లేకపోయింది... మన్నించండి...
    నిన్నటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన....
    లక్ష్మీదేవి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    కమనీయం గారికి,
    మిస్సన్న గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు...
    *
    అజ్ఞాత గారూ,
    మీ వ్యాఖ్య అర్థం కాలేదు.....

    రిప్లయితొలగించండి
  16. అల్పుడు గాని సర్వమహితాత్ముని శ్రీహరిఁ పెళ్లియాడగన్
    గల్పనలల్ల రుక్మిణికి కాలమె తెల్వక మోహతాపియై
    తల్పము కంటకంబవగ దక్కిన విగ్రహ ధ్యాసవీడకన్
    శిల్పముఁ జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్

    రిప్లయితొలగించండి
  17. వేల్పుల గొల్చుచందమున పెండ్లికి వచ్చిన వారి కోసమై
    స్వల్పము గాద నల్పమగు స్వాగత మివ్వగ సాదరమ్ముగా
    కల్పన చేసియుండి రట కన్నుల విందుగ ద్వారమందునన్
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.

    రిప్లయితొలగించండి
  18. కొల్పుచు భక్తి శ్రద్ధలను కోరిక తీర
    తెలంగణమ్మునన్
    తెల్పుచు ధన్యవాదములు తేరకు నిచ్చిన రాజధానికై
    నిల్పగ కాంగ్రెసోత్తములు నీరజ నేత్రగు సోనియమ్మదౌ
    శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్

    రిప్లయితొలగించండి