14, జనవరి 2013, సోమవారం

సమస్యాపూరణం - 937 (పండువులన్న సంబరము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. మెండుగ సంతు, ప్రేమలును మిక్కుటమైన నివాసమందునన్,
    పండువయస్సు దంపతుల భాగ్య ఫలమ్ముల రీతి యొప్పుచున్,
    నిండు కుటుంబమున్నయెడ నెమ్మది నిండగ సంతసమ్ములే,
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా!

    రిప్లయితొలగించండి
  2. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    ఈ నాడు ప్రథమ తాంబూలము మీదే. పద్యము చాల బాగుగనున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. మెండుగ నూత్నవస్త్రములు, మిక్కిలి రుచ్యములైన వంటకా
    ల్దండిగ నాటపాటలని తథ్యము పిల్లల కెల్లవేళలన్
    పండువులన్న సంబరము, బామ్మకు తాతకె ముచ్చటల్ గదా
    నిండుమనంబుతో "శుభము నీకగు" నంచు వచించుటెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  4. గుండెల నిండు ప్రేముడిని కూతులు పుత్రులు గౌరవింపగా
    మెండగు మాల్మి మన్మలును మించుచు జేరగ జీవితమ్మునన్
    పండిన పంటలో యనగ భాగ్యమిదే యని పొంగు వేళలౌ
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా!

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 2:50:00 PM

    నిండుమనమ్ములన్ గృహము నిండగ పుత్రుడు జామి పౌత్రులీ
    అండగ నుండగన్ దుహిత యల్లుడు నప్త స్రనప్త బంధువుల్
    దండిగ ప్రేమజూపగ సుధారసధారలు డెందమొప్పగన్
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా!

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. పండువులన్న సంబరము పద్యము నొక్కటి వ్రాయ నిట్టులన్
    పండువులన్న సంబరము బాలుర కెంతయొ - హాలిడే గదా !
    పండువులన్న సంబరము వత్తురు కూతురు మన్మలింటికిన్
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా !


    ఉండెద రెక్కడో కొడుకు లొంటరి వారలె తల్లిదండ్రులౌ
    నుండడు రాడు పండుగకు నొక్కడు మన్మడు వారియింటకు
    న్నండయె లేక వృద్ధు లిటు లక్కట ! యెక్కడి దింక వారికిన్
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా !

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 3:53:00 PM

    రవీందర్ గారు సంక్రాంతి శుభాకంక్షలు. మీరుచెప్పినట్టుగానే పండుగ సంబరంతో వ్రాసిన రెండు పద్యాలు మనోహరంగా ప్రస్తుత జీవన స్థితి చెప్పినారు. చాల బాగున్నవి.
    2వ పద్యాంత ద్రుతానికి తరువాతి అచ్చుతో సంధి చేయగ ద్విత్వం అవకాశం లేదు. పరిశిలింప మనవి.

    రిప్లయితొలగించండి
  9. ధన్యవాదములు శర్మ గారూ ! ... వారి యింటకున్ అండయె లేక ... అంటే సరిపోతుందేమో !?

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 4:37:00 PM

    రవీందర్ గారు! న్ + అండ = నండ అవుతుంది. న్ తరువాత అచ్చుకు సంధి తప్పదు. కనుక "ఇంటకు+ఏ=
    "యింటకే" అని యడాగమం చేసి "యండయె"అన్నచో సరిపోవినేమో చూడ మనవి.

    రిప్లయితొలగించండి
  11. పండు వయస్సునందు తమ పంచను నొక్కరు లేక నెక్కడో
    యుండగ చేర బిల్వ నిటు యూరికి వచ్చిన బిడ్డలందరున్
    మెండుగ సందడిన్ సలుప మీదట మన్మలు మన్మరాండ్ర తో
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా!

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 14, 2013 4:55:00 PM

    మిత్రులు గోలి శాస్త్రి గారూ. ధారాయుతంగా మీ పద్యం చాల బాగున్నది.శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. ... వారి యింటకే యండయె లేక....ఇప్పుడు సవ్యంగా ఉంది శర్మ గారూ !

    రిప్లయితొలగించండి

  14. ఉండెద రెక్కడో కొడుకు లొంటరి వారలె తల్లిదండ్రులౌ
    నుండడు రాడు పండుగకు నొక్కడు మన్మడు వారి యింటకే
    యండయు లేక వృద్ధు లిటు లక్కట ! యెక్కడి దింక వారికిన్
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా !

    రిప్లయితొలగించండి
  15. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు! శుభాశీస్సులు.
    మీ పద్యము 1వ పాదములో చివర లేక నెక్కడో అని వాడేరు -- లేక యెక్కడో అని సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి




  16. పండుగపూట నందనుడు,భార్యయు,బౌత్రులు వెంట గూడి రా
    నిండిన యిల్లు సందడిగ నెయ్యపు మాటల శోభ గూర్చగా
    బండెను మాదు జీవితము ,భాగ్యము గల్గెనటంచు బొంగుచున్
    ' పండువులన్న సంబరము బామ్మకె,తాతకె ముచ్చటల్ గదా!'

    రిప్లయితొలగించండి
  17. అండగ లేని పుత్రులును యాశలుఁదీర విదేశ గడ్డపై
    నుండెడు పౌత్రులున్ వదల నొంటరి జీవిత మెల్లదీయగన్
    పండుగ నాడు వచ్చి తమ వారలు ప్రేమను పంచు చుండగన్
    బండుగలన్న సంబరము బామ్మకె తాతకె ముచ్చటల్ గదా!

    రిప్లయితొలగించండి
  18. దోష సవరణను చూపిన శ్రీ నేమానిగారికి నమస్సులు.
    బాల సుబ్రహ్మణ్యం గారూ ..ధన్యవాదములు.

    పండు వయస్సునందు తమ పంచను నొక్కరు లేక యెక్కడో
    యుండగ చేర బిల్వ నిటు యూరికి వచ్చిన బిడ్డలందరున్
    మెండుగ సందడిన్ సలుప మీదట మన్మలు మన్మరాండ్ర తో
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా!

    రిప్లయితొలగించండి
  19. ఈనాటి సమస్యకు నిండైన ఉత్సాహంతో పూరణలు చేసి పండుగ చేసిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    మిస్సన్న గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    నా అనారోగ్య పరిస్థితిని సానుభూతితో అర్థం చేసికొని మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేస్తున్నందుకు (ముఖ్యంగా పండిత నేమాని వారికి) కృతజ్ఞతా పూర్వక అభివందనాలు.

    రిప్లయితొలగించండి
  20. మెండుగ కాసులుండగను మేతకు సుంతయు భీతిలేకయే
    దండిగ పుత్రులుండగను ధాన్యము రాగను సంకురాత్రినిన్
    కొండొక మన్మరాలికట గొప్పగ పోసెడు భోగిపండ్లవౌ
    పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా!

    రిప్లయితొలగించండి