21, జనవరి 2013, సోమవారం

సమస్యాపూరణం - 944 (తనయుఁ జంపి చేసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తనయుఁ జంపి చేసె జనహితమ్ము.

12 కామెంట్‌లు:

 1. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 21, 2013 8:20:00 AM

  నరక బాధ పెట్టు నరకుని పాలనన్
  బ్రతుక లేము కావ రావ దేవ
  యనుచు మెరను పెట్ట, సత్యభామతనదు
  తనయుఁ జంపి చేసె జనహితమ్ము.

  రిప్లయితొలగించండి
 2. ధరను మునుల పుణ్య నరులనే హింసించ
  దానవారి హరిని దరికి జేరి
  వేడు కొనగ సురలు వేంచేసి కైకసీ
  తనయుఁ జంపి చేసె జనహితమ్ము.

  రిప్లయితొలగించండి
 3. నరకు విభుని పాల న నరకమ్ము కతన
  వేడ ప్రజలు ,సురలు విష్ణు నపుడు
  లోక హితము కొఱకు లోకేశు నర్ధాంగి
  తనయు జంపి చేసె జన హితమ్ము .

  రిప్లయితొలగించండి
 4. శ్రీరాముడు......

  యజ్ఞ వాటిక నెడ నాటంక పఱచుచు
  రక్తమాంసములను రంగరించి
  కుమ్మరింప జూచి కోపించి తాటకా
  తనయుఁ జంపి చేసె జనహితమ్ము.

  రిప్లయితొలగించండి
 5. మన శ్రీ శంకర సద్గురుండు కవి సమ్మాన్యుండు సోత్సాహియై
  యనునిత్యంబు ననేక ప్రక్రియలతో నందంబుగా సాహితీ
  వనిలోనన్ దగు శిక్షణన్ బొసగగా పద్య ప్రపంచంబునన్
  విను వీధిన్ విహరించు సభ్యవితతిన్ వేడ్కన్ బ్రశంసించెదన్

  రిప్లయితొలగించండి
 6. దుర్గము డనువాడు దుష్టరాక్షసు డొండు
  జనుల కష్టపెట్ట కినిసి హిమజ
  సకల ప్రాణులకును జనని గావున తానె
  తనయు జంపి చేసె జనహితమ్ము

  రిప్లయితొలగించండి
 7. తనయు జంపి చేసె జనహితమ్ము నొకర్తె
  క్ష్మాస్వరూపయైన సత్యభామ
  జనకు నానతిమెయి జనని నొక్కడు చంపె
  భద్రగుణ రతుండు భార్గవుండు

  రిప్లయితొలగించండి
 8. చిన్న సవరణతో:

  తనయు జంపి చేసె జనహితమ్ము నొకండు
  చక్రపాణి నరకు సంహరించి
  జనకు నానతి మెయి జనని నొక్కడు జంపె
  భద్రగుణరతుండు భార్గవుండు

  రిప్లయితొలగించండి
 9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథే కాని నరకుని చంపింది శ్రీకృష్ణుడే...
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటి పాదం నడక కొద్దిగా ఇబ్బంది పెడుతున్నది. ఇలా మార్చితే ఎలా ఉంటుంది?
  "నరక విభుని పాలనము నరకము గాగ"
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ ప్రశంసాపద్యానికి ధన్యవాదాలు. 'సద్గురుండు" అన్నారు. అక్కడ "సజ్జనుండు" అంటే చాలేమో... నేను బోధగురువును కాదు, బాధగురువును....
  మీ స్వపరిష్కృత పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  లోకమాతపై మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 21, 2013 11:11:00 PM

  శ్రీకృష్ణునికి నరకాంతకుడు అనే పేరు మరిచి పుక్కిట గాధను ఎన్నితిని.గురువుగారి యొక్కసూచన పూజ్యశ్రీ పండితులవారి పునఃపూరణ చూచి నాపునఃప్రయత్నము

  ఎగ్గు సిగ్గు లేక నెగ్గించి పెద్దలన్
  దబ్బర పనులు కడు నిబ్బరమున
  నూరు చేయగ గిరి ధరుడంత సాత్వతీ
  తనయుఁ జంపి చేసె జనహితమ్ము.

  రిప్లయితొలగించండి
 11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  శ్రీకృష్ణుని మేనత్త పేరును బాగానే గుర్తుంచుకున్నారే! సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాస పూర్వాక్షర లఘు గురు సామ్యాన్ని పాటించాలి కదా!
  "నూరు చేయగ గిరి ధారుండు సాత్వతీ" అందాం....

  రిప్లయితొలగించండి
 12. తనదు పుత్రుఁలోక దనుజుడనగ
  తల్లియోర్వగలదెధరణి మీద
  నరకుఁ బట్టి సత్య , నారాయణుని గూడి
  తనయుఁ జంపి చేసె జనహితమ్ము

  రిప్లయితొలగించండి