30, జనవరి 2013, బుధవారం

సమస్యాపూరణం – 952 (శంకరుండు వద్దు మాకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా!
ఈ సమస్యను పంపిన తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదములు.

18 కామెంట్‌లు:

 1. శంకరుండు వేల్పు మాకు సద్గురుండు తండ్రియున్
  శంకరుండె రక్ష మాకు శంకరుండె సర్వమున్
  శంకరారి దుర్మదుండు సంఘద్రోహి ధర్మనా
  శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా

  రిప్లయితొలగించండి
 2. శ్రీ నేమాని వారి బాటలోనే....

  వంకలెన్నొ పెట్టు వాడు ' బాసు ' గానె వద్దులే
  శంకలెన్నొ గల్గు భార్య సాహచర్య మట్టులే
  జంకు బొంకు లున్న నేత సంఘ ద్రోహ దేశ నా
  శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా !

  రిప్లయితొలగించండి
 3. శంకరయ్య బ్లాగులోన చక్కనైన పద్యముల్
  జంకు గొంకు లేక వ్రాసి, శాంతి పొందు చుండగా,
  శంకరుందలంపనేల సద్విముక్తి కోరుచున్?
  శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా!

  రిప్లయితొలగించండి
 4. శ్రీ చింతా రామకృష్ణారావు గారి భావములు మాలాంటి వారి ఊహకు అందడము చాల కష్టమే. ఎవరి ఆనందము వారిదే. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. ఈమధ్య బ్లాగులో వ్యంగ్యాస్త్రాలు ఎక్కువయినట్టున్నాయి.

  రిప్లయితొలగించండి
 6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 30, 2013 1:58:00 PM

  శంకరుండతండు సర్వ శక్తి మంతు డన్నిటన్
  పంక జాసనాది వంద్యు పద్మనాభ కీర్తుడున్
  శంక రుండు కావ రమ్ము శంకలేదు కంఠపా
  శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ గదా!

  రిప్లయితొలగించండి
 7. అజ్ఞాతను కాను కదా?
  సుజ్ఞేయము కాగ వ్రాసి చూపుట తప్పా?
  విజ్ఞులు శంకరు లెరుగుచు
  నాజ్ఞాపించినవి వ్రాతునవ్యంగ్యముగన్.
  వ్యంగ్యము చూప నేమిటికి? ప్రస్ఫుట భావ మనోజ్ఞకంబు న
  వ్యంగ్య సుబోధకంబునగు పద్యము వ్రాయుదు నెప్పుడైన నే
  వ్యంగ్యము చూపి వ్రాయుటకు పల్కగనేరనొ పండితుల్ కడన్?
  వ్యంగ్యపు మాటలేవియును వర్ధిల జేయవు సత్కవీశులన్.
  భావము సుస్పష్టముకద?
  ధీవర నేమానివారు దీవింతురటుల్.
  జీవన గతిలో కవులకు
  భావన, సత్కవిత, చాలు. పరమమగునదియే.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ తోపెల్ల శర్మ గారి పద్యమును ఇలా సవరించి వ్రాద్దాము:

  శంకరుండతండు సర్వ శక్తిమంతు డన్నిటన్
  పంకజాసనార్చితుండు పద్మనాభ వంద్యుడున్
  శంకరుండు మమ్ము గాచు, శంక లేదు, కంఠపా
  శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మనసులో శ్రీకృష్ణునికి గాంధారి నివేదన :

  01)
  _______________________________

  లంక నాశనమ్మొనర్చు - రావణాసురున్ వలెన్
  వంక జేరినాడు మాదు - వంశ నాశనమ్ముకై
  యింక మేము సైపలేము - యిట్టి వంశ ఘాతకున్
  వంక దీర్చి బుద్ధి మార్చు - పద్మనాభ పాహిమాం
  లెంకలమ్ము నీకు మేము - లేచి రమ్ము మాధవా
  పంకజాక్ష నీకు పాద - వందనమ్ము జేతురా
  కింకరుండు వీని గావు - కేశవా మనోహరా
  మంకు పట్టు వీడు నట్లు - మార్చు మయ్య ! వంశ నా
  శంకరుండు వద్దు మాకు - శాంతి కావలెన్ గదా !
  _______________________________

  రిప్లయితొలగించండి


 10. ఇక్కడేదో, పొగ కనబడు చున్నది!
  అగ్గి రాజేయ వలయునా ?

  జిలేబి.

  రిప్లయితొలగించండి
 11. దక్ష ప్రజాపతి యజ్ఞము నారంభించుచు అందరినీ ఆహ్వ్నానించి శివుడిని మాత్రం పిలువడు. అప్పుడు కొందరు దేవతలు మునులు అదేమిటంటే అతను శివునిపై నున్న తృణీకార భావంతో యిలా అంటాడు.

  శంకరుండు వానికుండు చంకలోన పాములే
  టెంకి లేక దిర్గుచుండు డిండిమంపు పాణిచే
  అంకమందు గల్గి యుండు నన్ని పున్కలే సుమా
  శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా

  రిప్లయితొలగించండి
 12. శంక రుండ వంచు నిన్ను చంద్ర శేఖరా య నన్
  వంక లేదు నిన్ను గాంచ చంద్ర వంక యంద మౌ !
  శంక యేల నీదు చెంత సర్వ మంగ ళుండ గా
  శంక రుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా !

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమాని వారూ,
  ధర్మనాశంకరుని తృణీకరించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. ధన్యవాదాలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  మీ చమత్కార పూరణకు ధన్యవాదాలు. ఇంతకన్న ఎక్కువ వ్యాఖ్యానించలేను.
  *
  అజ్ఞాత గారూ,
  ... # * $ @ % ? !
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  నేమాని వారి సవరణ మీ పద్యానికి శోభను చేకూర్చింది.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  అమ్మా జిలేబీ....
  శతసహస్ర వందనాలు. మమ్మల్నిలా ప్రశాంతంగా బ్రతకనివ్వు తల్లీ....
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  దక్షుని మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  పద్యం బాగుంది. అయినా శంకరుడుండగా అతన్నే వద్దనడం ఏమిటి?

  రిప్లయితొలగించండి
 14. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 31, 2013 12:14:00 AM

  ముక్కోటి దేవతల్ మునుముందు వినుతింప
  ముక్తకంఠముతోడ మునులునుడువ
  నారద తుంబుర నాదవిన్యాస గా
  నామృత ఝర్ఝరు లాక్రమింప
  అతిసుందరులగు యప్సరసలట నయ
  నానందకరముగ నాట్యమాడ
  పాల్కడలిని శేష పాన్‌పు పై పవళింప
  పాదము లొత్తగ పద్మవాస
  పద్మనాభుండు పదునాల్గు భువనములను
  కాచు చుండగ ధారుణిన్ కాంచుమయ్య
  రంగ నాధుని రూపమునంగ రంగ
  వైభవమ్ముగ సాగంగ భక్తి తోడ.

  రిప్లయితొలగించండి
 15. డా. ప్రభల రామలక్ష్మిగురువారం, జనవరి 31, 2013 1:47:00 AM

  వంకలేని వాడటంచు వంద్యుడైన వాని తో
  ఇంక సాటిలేరు మీకు, మీరె మాకు రాజుగా !
  సంకటాలు కల్గ జేసి సంకెలేయు సంఘనా
  శం కరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా !

  రిప్లయితొలగించండి
 16. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. నూతన వదువు ఆలోచన:
  సంకటంబు గంగ గౌరి శంకరున్ని జేరగన్!
  యింక నేమి కృష్ణు బాధ యింతు లంత కూడగన్!
  శంక లేదు రాము డంటి స్వామి చాలు! శౌరియున్,
  శంకరుండు మాకు వద్దు! శాంతి కావలెన్ గదా!

  రిప్లయితొలగించండి