28, జనవరి 2013, సోమవారం

సమస్యాపూరణం – 950 (చినవానిని పెండ్లియాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.


35 కామెంట్‌లు:

  1. మను వాడెదమని యెందఱొ
    చనుదెంచిరి చిన్నదాని సరసకు యువకుల్
    తను ప్రేమించుచు మనసి
    చ్చిన వానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

    రిప్లయితొలగించండి
  2. వినగా నాతని లీలలు
    మనమందున హరిని నిలిపి మన్నన జేసెన్
    అనుజుడు వలదన మది దో
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

    రిప్లయితొలగించండి
  3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 28, 2013 8:27:00 AM

    మనసున మనసై తలపుల
    వనమున మురిపెము లెనయుచు వడివడి చదువన్
    చిననాటి నుండి తావల
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

    రిప్లయితొలగించండి
  4. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 28, 2013 8:31:00 AM

    శ్రీ శాస్త్రి గారూ! రుక్మిణీ ఘట్టం బాగుంది.చిన్న మనవి.
    జేసెన్ + అనుజు. సంధికార్యం తప్పదు.పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  5. చక్కని పూరణలు చేసిన రవీందర్ గారికి బాల సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు.
    ఆర్యా ! నిజమే " జేసెన్ననుజుడు " అంటే సరిపోతుంది. అయినా పదాలు ( సమాసము కానివి) వేరు, పాదాలు వేరు కనుక తప్పులేదని భావించుచున్నాను. గురువులు సందేహము తీర్తురు గాక. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  6. అనగనగరుక్మిణీసతి
    వినియెనుగోవిందు గూర్చివేడుకతోడన్
    మనమున తలచెను, ప్రేమిం
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్ .

    రిప్లయితొలగించండి
  7. జేసెన్ననుజుడు
    జేసెన్ + అనుజుడు = జేసెననుజుడు
    ఇక్కడ ద్విత్తాక్షరం వస్తుందా?

    రిప్లయితొలగించండి
  8. జేసెన్ అనుజుడు

    నిజమే పాదాలు వేరు కనుక తప్పులేదని భావించుచున్నాను.

    రిప్లయితొలగించండి
  9. తన దాని నౌదు ననుచున్
    వినతుల రుక్మిణి బనుపగ విప్రుని తోడన్
    గొనిపోవనెంచి యరుదెం
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్!

    రిప్లయితొలగించండి
  10. మిత్రులు గోలి వారు యిలా సవరిస్తే ఎలా వుంటుంది?
    'మన్నన జేయగ
    ననుజుడు వలదన...'
    స్వస్తి .

    రిప్లయితొలగించండి
  11. నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    'తను ప్రేమించుచు' అన్నదానిని 'తననే వలచిన' అంటే ఎలా ఉంటుంది?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి విషయంతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    'చేసెన్ + అనుజుడు = చేసె ననుజుడు' అవుతుంది. 'చేసె న్ననుజుడు' వంటి రూపాలు అక్కడక్కడ కనిపించినా పండితామోదాలు కావు.
    అజ్ఞాత గారు చెప్పినట్లు వాక్య ప్రారంభం కనుక అనుజుడు అని అచ్చుతో మొదలుపెట్టవచ్చు.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మనమున వలచిన వానిని,
    తన మనమున గలుగు వాని, తన బావను స
    జ్జను లెల్లర పజ్జన నిలి
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

    రిప్లయితొలగించండి

  13. చినవాఁడఁ గాను, ప్రేమిం
    చినవాఁడను, నీదు వన్నె చిన్నెలఁ గీర్తిం
    చినవాఁడ ననఁగఁ దా మె
    చ్చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

    రిప్లయితొలగించండి
  14. చింతా రామ కృష్ణా రావు గారూ,
    సజ్జనుల పజ్జన నిలిచినవాడికి వేరే యోగ్యత లేముంటాయి? అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. వినుమీ సంగతి మొదటన
    కనులకు పెను విందు సేయు కామేశ్వరియున్
    ననురాగముతో దా వల
    చిన వానిని పెండ్లి యాడి చేడియ మురిసెన్ .

    రిప్లయితొలగించండి
  16. మనసెరిగిన ప్రియుని కా
    దని మనలేనని మనసున దలచుచు వాడే
    తన సర్వంబని తావల
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.
    - - -
    డా. ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి
    బెంగుళూరు

    రిప్లయితొలగించండి
  17. సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    'కామేశ్వరియున్ + అనురాగము' అన్నప్పుడు నుగాగమం రాదు కదా... కామేశ్వరియే యనురాగము'... అందామా?
    *
    డా. ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారూ,
    మంచి భానంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    మొదటి పాదంలో ఒక లఘువు తక్కువయింది. 'మన సెరిగిన తన ప్రియుఁ గా/దని....' అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  18. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీ పద్యము బాగున్నది. రుక్మి రుక్మిణికి అనుజుడా? అగ్రజుడగునని నా భావన. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. డా. ప్రభల రామలక్ష్మిసోమవారం, జనవరి 28, 2013 6:59:00 PM

    తనమనసును తడవకనే
    తనపెండ్లిని చేయబూన తగునా మీకున్
    కినుకను తెలిపియు తను వల
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్
    డా. ప్రభల రామలక్ష్మి

    రిప్లయితొలగించండి

  20. గురువు గారూ ! మీ సూచన మేరకు మార్పులు చేయగా :

    మను వాడెదమని యెందఱొ
    చనుదెంచగ చిన్నదాని సరసకు యువకుల్
    తను నచ్చిన వాడిని యా
    చిన వానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. మరియొక చిన్న మార్పుతో :

    మను వాడెదమని యెందఱొ
    చనుదెంచగ చిన్నదాని సరసకు యువకుల్
    తను నచ్చిన వాడిని నొక
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

    రిప్లయితొలగించండి
  23. మునుపెన్నడు గాంచ నట్టి
    కనువిందగు సొగసు లెన్నొ కనుపించగనే !
    మనమున సంతస మొందుచు
    చిన వానిని పెండ్లి యాడి చేడియ మురిసెన్ !

    రిప్లయితొలగించండి
  24. ఇదొక చిన్న ప్రయత్నము:

    మనములు కలియ విమలు వల
    చిన వానిని పెండ్లియాడి చేడియ మురిసెన్
    జనతతి చేరి పొగడ నతి
    వినయగుణు రమణు శుభాంగు విజ్ఞు నరవరున్

    నరవరున్ మనోహరుని మనములు కలియ
    విమలు వలచిన వానిని పెండ్లియాడి
    చేడియ మురిసెన్ జనతతి చేరి పొగడ
    నతి వినయగుణు రమణు శుభాంగు విజ్ఞు

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యులకు, పండిత నేమాని గారికి, అజ్ఞాతగారికి, బాల సుబ్రహ్మణ్యం గారికి, సహదేవుడు గారికి ధన్యవాదములు. మీ మీ సూచనలతో పూరణను సవరించుచున్నాను.
    చక్కని పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు.


    వినగా నాతని లీలలు
    మనమందున హరిని నిలిపి మన్నన జేసెన్
    తనయన్న నెదిరి మది దో
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.

    రిప్లయితొలగించండి
  26. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం...
    మునుపెన్నడు గాంచని యా
    కనువిందగు..... అని సవరిద్దాం.
    *
    పండిత నేమాని వారూ,
    గర్భకవిత్వంతో సమస్యాపూరణమా! అద్భుతమైన ప్రయోగం.
    మీ కంద గర్భిత గీతం అలరించింది. ధన్యవాదాలు.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 28, 2013 9:40:00 PM

    శాస్త్రిగారూ! అద్భుతముగా వచ్చింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 28, 2013 9:46:00 PM

    పండితార్యా!ఏమి మా అదృష్టము. క్రొత్తదారి చూపినారు. ధన్యులము.

    రిప్లయితొలగించండి
  29. మొనగాడు పరుగు లందు స
    చిను టెండూల్కరు, వయసున చినవా డైనన్
    ఘనుడని యంజలి మది మె
    చ్చిన వానిని పెండ్లి యాడి చేడియ మురిసెన్!

    రిప్లయితొలగించండి
  30. సహదేవుడు గారూ,
    మంచి పట్టే పట్టారు. వాస్తవాన్ని చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అన్నట్టు.... ఐశ్వర్యారాయ్ కంటే అభిషేక్ బచ్చన్ చిన్నవాడని విన్నాను. నిజమేనా?

    రిప్లయితొలగించండి
  31. గురువుగారికి నమస్సులు,
    ధన్యవాదములు.నేను కూడ చదివినట్లు గుర్తు. ఐశ్వరే పెద్దదై వుండొచ్చు నేమొనండి. స్వస్తి .

    రిప్లయితొలగించండి


  32. కం//
    నునుపుగ మీసము తీసిన
    వనితల వలె ఉండుననెడి భావము తోడన్
    ఘనముగ సరి మీసము మొల
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్

    రిప్లయితొలగించండి
  33. అయ్యా,

    ప్రాసకోసం 'వనితలు' అనవలసివచ్చినది కాని, నాలాగున మీసము లేనివారందరూ కోపగించుకోవద్దని మనవి.

    మీసమూడినంత రోసము పోదయా
    జుట్టు నెరిసినంత పట్టుపోదు
    తోకలేని పులికి తేకువ తక్కువా
    తరచి చూచినంత ధరణిలోన


    రిప్లయితొలగించండి
  34. వినయము విద్యయు రూపము
    మనమున సంతసము శాంతి మాయలె యనుచున్
    ఘనముగ నల్లధనము దా
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్

    రిప్లయితొలగించండి
  35. కనగా క్రికెట్టు నందున
    ఘనమగు రీతిని పరుగిడు గండరగండున్
    తనకన్న నారు సాలులు
    చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్

    రిప్లయితొలగించండి