27, జనవరి 2013, ఆదివారం

పద్య రచన – 234


కవిమిత్రులారా,  
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. సహస్ర శీర్ష శోభితాయ సత్యమూర్తయే నమః
  సహస్ర దివ్య లోచనాయ చారుమూర్తయే నమః
  సహస్ర పాదపంకజాయ సౌఖ్యదాయ తే నమః
  సహస్ర దివ్య నామ రూప సంధృతాయ తే నమః

  క్షీర సాగర సుతా చిత్తాబ్జ మకరంద
  పాన విలోలాయ తే నమోస్తు
  వేదసంస్తుత్యాయ వేదాంత వేద్యాయ
  త్రిభువన నాథాయ తే నమోస్తు
  భోగీంద్ర శయనాయ యోగీంద్ర వరదాయ
  నానావతారాయ తే నమోస్తు
  సురబృంద పూజిత చరణ సరోజాయ
  జ్ఞాన నిధానాయ తే నమోస్తు
  ధర్మ సంరక్షణ విధాన తత్పరాయ
  దినకర సహస్ర దీప్తాయ తే నమోస్తు
  చక్రరాజయుధ ధరాయ శాశ్వతాయ
  దీనలోక శరణ్యాయ తే నమోస్తు

  రిప్లయితొలగించండి
 2. తేటగీతిలో ఒక టైపు పొరపాటు:
  3వ పా: చక్ర రాజాయుధ ధరాయ శాశ్వతాయ అని పాదము ఉండాలి.

  రిప్లయితొలగించండి
 3. వాయు పుత్రుడు స్తోత్రంబు చేయు చుండ
  గరుడు డొకవైపు కదలక కరము మోడ్ప
  శంఖ చక్రమ్ము గద తోడ సదయు డైన
  హరిని భజియింతు నామది నార్తి తోడ

  రిప్లయితొలగించండి
 4. మరొక ప్రయత్నము:
  పరమ భక్త శేఖరులగు పక్షిరాజ పావనుల్
  చరణ దివ్య వారిజాత సన్నిధిన్ జెలంగగా
  నిరత విశ్వపాలనాత్త నిర్మలాత్ము శ్రీహరిన్
  సరసిజాక్షు సాగరాత్మజావిభున్ నుతించెదన్

  రిప్లయితొలగించండి
 5. శ్రీరామచంద్రుడు.ఆదివారం, జనవరి 27, 2013 9:25:00 AM

  భారతీకృపాకటాక్షపాతృలగు, పండిత నేమానివారికి సాదర ప్రణామములు,
  మీచే కావింపబడిన పద్యరచన తిక్కనార్యుని హరిహరనాథ స్తొత్రంవలె మంచి సొబగునొందింది. అద్భుతం. అటులనే. పరమ భక్త శేఖరులగు.... అను రచన " చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర పాహిమాం...... స్తొత్రంవలె కడు రమ్యంగా ఉంది. ధన్యవాదములు. "రసనకు బూతవృత్తి సుకరంబుగ చేకురునట్లు వాక్సుధారసములు జిల్క పద్యముఖరంగమునందు నటింపవయ్య". నా భావొద్వేగానికి అక్షర రూపమీయదలచి జేసిన ప్రయత్నమందు దోషములున్నయెడల క్షంతవ్యుణ్ణి, అటులనె పెద్దవారైన తమ పూర్తి నామధేయంబెరుంగక తమ ఇంటి పేరుతోనే సంబోధన చేసినందులకు మన్నించగలరు.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శ్రీరామచంద్రుడు గారికి శుభాశీస్సులు.
  మీ నుండి వెలువడిన మంచి వాక్యములు చాల ఆనందము కూర్చినవి. మనకు ముఖతః పరిచయము లేదు. మీలోని కవిత్వపరమైన వినయగుణమును ప్రశంసించుచున్నాను. నా పేరు నేమాని రామజోగి సన్యాసి రావు, ప్రస్తుత నివాసము విశాఖపట్టణము. 12వ ఏటి నుండి పద్య విద్య అలవడినది. తెలుగులో చదువు పి.యు.సి. వరకు మాత్రమే. అంతా శ్రుత పాండిత్యమే. భగవత్ కటాక్షము వలన పూర్వము అష్టావధానములను చేసితిని. అనేకపద్య కావ్యములను స్తోత్రములను వ్రాసితిని. మిత్రులతో కాలక్షేపమునకు శంకరాభరణము మరియు ఆంధ్రామృతము బ్లాగులను చూస్తూ ఉంటాను. వృత్తి పరముగా కంపనీ సెక్రెటరీ -- ప్రస్తుతము విశ్రాంత జీవితమే. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 27, 2013 3:08:00 PM

  పక్షిరాజ పవనసుత పరమభక్త
  గుణగణాంచిత ధీరుల కొల్వబడుచు
  శంఖచక్రములిరుచేత శౌరిపట్టి
  నాదు కష్టముల్ తీర్పుమా ! నతులొనర్తు

  రిప్లయితొలగించండి
 8. ఆంజ నేయుడు కైదండ లంద జేయ
  గరుడు డాది పురుషునకు కరము లెత్తి
  వంద నంబులు జేయగ వాసు దేవు
  డభయ మిచ్చెను నిరువుర కపుడు చూడు .

  రిప్లయితొలగించండి
 9. విష్ణుస్తుతిని మనోహరంగా చేసిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  సుబ్బారావు గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  శ్రీరామచంద్రుడు గారూ,
  నా బ్లాగును వీక్షించి మీ సదభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, జనవరి 27, 2013 11:44:00 PM

  పరమ భాగవతులైన భక్తులిచట
  చేరి కొలుచుచునుండెగా శ్రీనివాసు
  పనియు తగిలిన తీతురు పరుగులెన్నొ
  సమయముండిన కొలుతురు సరసిజాక్షు

  రిప్లయితొలగించండి
 11. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, జనవరి 27, 2013 11:50:00 PM

  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు,
  మీ పద్యం చాలా హృద్యం గా ఉంది.
  అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. నారద తుంబుర వందిత!
  మారుతి ఖగరాజ సేవ మాకందరికిన్
  జేరగ నీ పద సన్నిధి
  దారుల నిడె శంఖ చక్ర ధారీ! శౌరీ!

  రిప్లయితొలగించండి
 13. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  మీ పద్యంలోని భావం మనోహరంగా ఉంది. అభినందనలు.
  మొదటి పాదంలో 'తులైన' అన్నచోట గణదోషం. 'తులయిన' అంటే సరి!
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీరామచంద్రుడు.సోమవారం, జనవరి 28, 2013 7:40:00 PM

  పూజనీయులైన, పండిత శ్రీ ఎన్. ఆర్. ఎస్. రావు గార్కి,
  వందన శతములు. చిన్ననాటినుండి నేనెవరికైనా ఉత్తరము వ్రాసే భాష ఇదే ధోరణిలో ఉంటుంది. వ్యవహారిక భాషోద్యమం అంటూ కొంతమంది ప్రముఖులు చేసిన ప్రయత్నములకు నేను పూర్తి వ్యతిరేకిని. ఇది ప్రయత్నపూర్వకముగా అవలంబించినది కాదని మనవి చేస్తున్నాను. తమబోటి పెద్దలు నా ధోరణి మార్చుకోమని సూచించిన యెడల వినయంగా స్వీకరిస్తాను. దయచేసి దిశానిర్దేశం చేయగలరు.

  శ్రీ సహదేవుడుగారికి,
  మీ పద్యం ప్రాతఃస్మరణీయ పద్యాలలో ఒకటిగా చేసుకోవచ్చనే భావన కలుగుతున్నది.

  రిప్లయితొలగించండి