29, జనవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 951 (మేను శాశ్వతంబు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మేను శాశ్వతంబు మిత్తి రాదు.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

30 కామెంట్‌లు:

 1. మనము చేసి కొనిన మంచి తప: ఫల
  మేను శాశ్వతంబు; మిత్తి రాదు
  శివుని శరణు వేడ చిత్త శుద్ధిగలిగి
  నమ్ము మెపుడ తనిని నెమ్మనమున

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  అమృతము త్రాగగలిగితే :

  01)
  _______________________________

  మేఘమండలంబు - మీదున్న స్వర్గమ్ము
  మీద దండ యాత్ర - మించ గలిగి
  మృత్యు నాశనంబు - మినుకంత సేవించ
  మేను శాశ్వతంబు - మిత్తి రాదు
  _____________________________
  మృత్యు నాశనము = అమృతము

  రిప్లయితొలగించండి
 3. ఏది వింత ? మనుజు డేమని భావించు ?
  ననుచు ధర్మజుణ్ణి యక్షు డడుగ
  నరు డనుకొను నవని మరణము జూచియు
  మేను శాశ్వతంబు మిత్తి రాదు

  రిప్లయితొలగించండి
 4. కిశోర్జీ ! చాలా కాలము తరువాత " దండ యాత్ర " చేస్తున్నారు.పునః స్వాగతం. చక్కని పూరణ.
  చంద్రా జీ ! ఈ రోజు ప్రథమ తాంబూలము మీదే !
  రవీందర్ గారూ ! నేను అనుకొనిన విధముగా పూరణ చేసినారు. బాగుంది.
  మువ్వురకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ! ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 6. మేనశాశ్వత మనునదే నిజము :

  02)
  _______________________________

  మేది నందు మిత్తి - మీరుట సాధ్యమా ?
  మేటి వారి కైన - మిత్తి గలుగు !
  మేను శాశ్వతంబు - మిత్తి రాదనుమాట
  మిథ్య యనుట నిజము ! - మేలు కొనుడు !
  _____________________________

  రిప్లయితొలగించండి
 7. శిబి మొదలగువారు శాశ్వత కీర్తికాయులు గదా !

  03)
  _______________________________

  మింట తార లుండు - మేరను వెలుగుచు
  మించి కీర్తి నిలచు - మేదినందు
  సాటివారి కిలను - సాహాయ మొనరించ
  మేను శాశ్వతంబు - మిత్తి రాదు !
  _____________________________
  మేను = కీర్తికాయము

  రిప్లయితొలగించండి
 8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 29, 2013 9:08:00 AM

  సర్వవ్యాపకంబు సర్వకాలములందు
  సకల జీవు లందు సంచరించు
  వేద శాస్త్ర మరయ వినుము “పరమసత్య
  మేను” శాశ్వతంబు మిత్తి రాదు.

  రిప్లయితొలగించండి
 9. మేను శాశ్వతంబు మిత్తిరాదనుచును
  విర్ర వీగు టన్న వెర్రి గాదె!
  రామ,కృష్ణు లైన భూమిన బుట్టగ
  గిట్ట లేదె? నిల్చి కీర్తి పథముఁ!

  రిప్లయితొలగించండి
 10. జననమ్ము మరణమ్ము సకల ప్రాణులకును
  కలుగుచునుండు చక్రంబు రీతి
  నెల్ల వేదాంతమ్ము లీ సత్యమును దెల్పు
  తనువు లెవ్వియు శాశ్వతములు కావు
  క్రొత్త బట్టలు కట్టుకొను పాత బట్టలు
  విడిచి పెట్టుచునుండు విధము గానె
  దేహమనెడు బట్ట దేహి ధరించుచు
  విడిచిపెట్టుట భువి వింత కాదు
  సకల లోకములకు శాస్తను నేనన్న
  వారలేని మృత్యువాత బడరె
  మేను శాశ్వతంబు మిత్తి రాదను మాట
  సత్యదూరమయ్య! సాధుహృదయ!

  రిప్లయితొలగించండి
 11. నాగరాజు రవీందర్ గారి స్ఫూర్తితో

  అశాశ్వతాన్ని శాశ్వతమని తలచుట, అనాది నుండి అలవాటు గదా మానవులకు :

  04)
  _______________________________

  మేటి వింత యేది - మేదిని యందని
  యక్షు డడుగ జెప్పె - యముని సుతుడు
  "మహిని మృతుల గాంచు - మనుజుడు తలపోయు
  మేను శాశ్వతంబు - మిత్తి రాదు"
  _____________________________
  మేను = కీర్తికాయము

  రిప్లయితొలగించండి
 12. చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  బహుకాల దర్శనం.. సంతోషం!
  ఇప్పటి వరకు వచ్చిన మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  రెండు పూరణలలో 'మేదినందు' అన్నారు. మేదిని + అందు = మేదిని యందు... అని యడాగమం వస్తుంది.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  యక్షప్రశ్నకు సమాధానంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  'ధర్మజుణ్ణి' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ 'ధర్మసుతుని' అందాం.
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  'సర్వవ్యాపకంబు' అన్నప్పుడు వ్యా ముందున్న ర్వ గురువై గణదోషం ఏర్పడుతున్నది.

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా ! ధన్యవాదములు !

  మేనశాశ్వత మనునదే నిజము :

  02అ )
  _______________________________

  మేటి కైన మిత్తి - మీరుట సాధ్యమా ?
  మేదిని నెట దాగ - మిత్తి గలుగు !
  మేను శాశ్వతంబు - మిత్తి రాదనుమాట
  మిథ్య యనుట నిజము ! - మేలు కొనుడు !
  _____________________________

  *****
  03అ )
  _______________________________

  సాటివారి కిలను - సాహాయ మొనరించ
  మించి కీర్తి నిలచు - మేలు గలుగు !
  మింట తార లుండు - మేరను వెలుగుచు
  మేను శాశ్వతంబు - మిత్తి రాదు
  _____________________________
  మేను = కీర్తికాయము

  రిప్లయితొలగించండి
 14. కీర్తి కాయమే గదా శాశ్వతము :

  05)
  _______________________________

  మేటి వీరుల కైన - మేటి విఙ్ఞుల కైన
  మేన శాశ్వతముర - మిత్తి గలుగు !

  మేటి రూపసు లైన - మేటి తాపసు లైన
  మేన శాశ్వతముర - మిత్తి గలుగు !

  మేటి రాజుల దైన - మేటి భూజను లైన
  మేన శాశ్వతముర - మిత్తి గలుగు !

  మేటి ప్రేమికు లైన - మేటి శ్రామికు లైన
  మేన శాశ్వతముర - మిత్తి గలుగు !

  మేల మాడ కుండ - మేలు జేయు మొరుల
  మేలు శాశ్వతముర - మేను గాదు !
  మేలు జేయ , కీర్తి - మేదిని నిలచిన
  మేను శాశ్వతంబు - మిత్తి రాదు
  _____________________________
  మేను = కీర్తికాయము

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. అత్యంత సహజమగు మరణమును గూర్చి చింతింప నేల?

  6)
  _______________________________

  మేను వెనుక మిత్తి - మిత్తి వెనుక మేను
  వెంట నంటి దిరుగు - జంట రీతి !
  మిత్తి మాట మరచి - మేళ్ళొనరించిన
  మేను శాశ్వతంబు - మిత్తి రాదు
  _____________________________
  మేను = పుట్టుక
  మేను = కీర్తికాయము

  రిప్లయితొలగించండి
 17. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  జనన మరణ చక్రాన్ని వర్ణించిన మీ పద్యం అత్యుత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ 4,5,6వ పూరణలు ముఖ్యంగా సీసం, సవరించినవి అన్నీ బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  చివరి పాదంలో యతి తప్పింది. ము-మౌ లకు మైత్రి లేదు. 'మునులకు వలె' అందామా?

  రిప్లయితొలగించండి
 18. గురుదేవులకు,శ్రీ నేమాని పండితులకు పాదాబివందనములతో
  ========*=======
  ఖలులకు, కటికులకు కలియుగమున దమ
  మేను శాశ్వతంబు,మిత్తిరాదు
  బరుల సొమ్ము దినెడి పాలకులకు,నర
  హంతకులకు నేడు వింత గాను

  రిప్లయితొలగించండి
 19. మనము జేయు మంచి పనుల పుణ్య పు ఫల
  మేను శాశ్వతంబు , మిత్తి రాదు
  శ్రద్ధ తోడ మనము శంకరు బూజింప
  ముక్తి కలుగు నిజము మునులకు వలె

  రిప్లయితొలగించండి
 20. సమ్మతంబు గాదు సర్వుల కీ మాట
  " మేను శాశ్వతంబు మిత్తి రాదు "
  అనుటె సత్య మెపుడు " నన్ని ప్రాణులకును
  మే నశాశ్వతంబు మిత్తి వచ్చు "

  రిప్లయితొలగించండి
 21. పరుల సుఖము కొరకు ప్రాణంబులర్పించు
  పుణ్యమూర్తుల తలపు మరువగ తరమే
  కీర్తిశేషులైనగూడ స్థిరము వారి
  మేను శాశ్వతంబు మిత్తి రాదు.
  - - -
  డా. ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి
  బెంగుళూరు

  రిప్లయితొలగించండి
 22. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, జనవరి 29, 2013 6:07:00 PM

  కనినదంత నీవె కాజేయజూచిన
  కలుగు నీకు కడకు కష్టమెంతొ
  కనుము ఎంతమంది కటకటాలబడిరొ
  మేను శాశ్వతంబు మిత్తిరాదె?

  రిప్లయితొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 24. ఘోర తపము జేసి క్రూర రక్కసు డొండు
  చావులేని వరము స్రష్ట నడిగె
  పలికె నిటుల వాడు “ పరమాత్మ ! యవ్విధ
  మేను శాశ్వతంబు మిత్తి రాదు

  నాకు నెటుల నైన " ననుచు విధాతకు
  ప్రాంజలించె నపుడు వరము గోరి
  దనుజ గుణము లెపుడు తలచూపు నిటులనే !
  అవతరణము నెత్తు హరియె యపుడు

  రిప్లయితొలగించండి
 25. మేను శాస్వ తంబు మిత్తిరా దనుకోక
  యశము నొంది వారు నలువ లైరి
  పరుల కుపక రించు ప్రాణమిచ్చె దధీచి
  దైవ మనగ వేరు ధరను లేరు !

  రిప్లయితొలగించండి
 26. చక్కని పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు.
  నా పూరణ...

  మేను లేని వాడ మీ యూహ జను వాడ
  పుట్టు కైన లేని పూరుషుండ
  నరుడ కనులు తెరిచి నను కనుగొను నిజ
  మేను శాశ్వతంబు మిత్తి రాదు.

  రిప్లయితొలగించండి
 27. వరప్రసాద్ గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ తాజా పూరణలు రెండూ చాలా బాగున్నవి. అభినందనలు.
  *
  డా. ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారూ,
  మంచి భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  ఆటవెలది రెండవ పాదంలో 5 సూర్యగణాలుండాలి కదా... మీరు మొదటి పాదం వలెనే వ్రాసారు.
  పుణ్యమూర్తుల తలపును మరువకు..... అంటే సరి.
  *
  డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  కనుము + ఎంత... అని విసంధిగా వ్రాయరాదు కదా. అక్కడ సంధి తప్పనిసరి. 'కనగ నెంత' అందామా?
  *
  రాజేశ్వరి అక్కయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, జనవరి 29, 2013 11:22:00 PM


  గురువులకు వందనములతో...
  కనినదంత నీవె కాజేయజూచిన
  కలుగు నీకు కడకు కష్టమెంతొ
  కనగ నెంతమంది కటకటాలబడిరొ
  మేను శాశ్వతంబు మిత్తిరాదె?

  రిప్లయితొలగించండి