3, ఏప్రిల్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1012 (పాడు పనులఁ జేయు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పాడు పనులఁ జేయువాఁడు ఘనుఁడు.

23 కామెంట్‌లు:

  1. ధరణి నెల్ల జనులు ధర్మమున్ బాటింప
    ధర్మ మెల్లరకును త్రాత యగును
    ధర్మ వర్తనుడయి ధర్మ రీతులను కా
    పాడు పనుల జేయువాడు ఘనుడు

    రిప్లయితొలగించండి
  2. పనిని జేయు మనుచు పరమాత్ముడే చెప్పె
    ఫలిత మతడు జూచు భయము వలదు
    పనియు పాట లేక పండగా నొళ్ళౌను
    పాడు, పనుల జేయువాడు ఘనుడు

    రిప్లయితొలగించండి
  3. పాడు పనులు మంచి పనులు లోకమునందు
    సల్పుచుందు రెపుడు సగటు జనులు
    ధర్మమును నిలుప నధర్మ మార్గముల రా*
    పాడు పనుల జేయువాడు ఘనుడు

    *ఎదిరించు

    రిప్లయితొలగించండి
  4. పాలకడలియందు పవ్వళింపునుఁ జేయు,
    సిరులఁ గురియు తల్లిఁ జేతఁబట్టు;
    సృష్టి కర్త సృజనఁ జేయు, ప్రాణులనుఁ గా
    పాడు పనులఁ జేయు; వాఁడు ఘనుఁడు.

    రిప్లయితొలగించండి
  5. సర్వలోకములును శాస్త్రసమ్మతమైన
    ధర్మమందు నిలచి దనరుచుండు
    నట్టి ధర్మపథమునందునిల్వంగ చొ
    ప్పాడు పనులఁ జేయు వాఁడె ఘనుఁడు.

    చొప్పాడు = సత్యముఁ బల్కుట

    రిప్లయితొలగించండి
  6. వెన్నదొంగయంచు, కన్నియల్ నీరాడ
    చీరలపహరించి చేరబిలచు
    వాడటంచు తూలనాడగా కూడదా
    పాడు పనులచేయువాడు ఘనుడు

    రిప్లయితొలగించండి
  7. దుష్ట బుద్ధి గలుగు ధూర్తుడు జగతిని
    పాడు పనుల జేయు , వాడు ఘనుడు
    సాటి వాని బాధ సరి జేయు పురుషుడు
    మానవులకు సేవ మాధ వుసరి .

    రిప్లయితొలగించండి
  8. తనువు మనము జగము తారక రాముడె
    యనుచు రామ దాసు యాదు కొనగ
    రామ మూర్తిఁ దలఁచి రమ్య కీర్త నలెన్నొ
    పాడు పనులు జేయు వాడు ఘనుడు

    రిప్లయితొలగించండి






  9. అక్రమార్జనమున నధికలాభముబొంది,
    పైకి పెద్దమనిషి వలె నటించి
    దొంగపనులు,మరియు,దోపిడీల్ చాటుగ ,
    పాడుపనుల జేయు వాడు ఘనుడు.

    రిప్లయితొలగించండి
  10. డా.కమనీయంగారూ! నమస్సులు. ప్రస్తుత సమాజమందు నెలకొని యున్న దౌర్భాగ్యాన్ని బాగా చెప్పారు. సొమ్ము ఏరీతిని సంపాదించాడన్నది అనవసరము. సొమ్ములున్న ఏదైనా చేయ వచ్చునన్న అహంకారం పెచ్చుపెరిగింది. విచిత్రంగా విషయం వారికి తెలిసికూడా కొంతమంది అటువంటి వారికి వంత పాడడం. ధనమూలమిదంజగత్ కి కొత్త అర్థంచెప్పుకోవాలి. మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీపండిత గురువులకు నమస్సులతో
    నేటి ప్రత్యక్ష వీక్షణిని నిత్యమేదో యొకచోట
    మేటి పాటలతోడ జనులు మెచ్చురీతిని బాలలంత
    పోటీ పడుచు ఘంటసాల వోలె బాలుని రీతి పాడ
    పాట పాడు పనులఁ జేయువాఁడు ఘనుఁడు నెంచి జూడ.
    (ప్రత్యక్ష వీక్షణిని= TV ని)

    రిప్లయితొలగించండి
  12. పాడులనెడు బేళ్ళ పట్నాలు పల్లెలు
    గలవు ప్రత్తిపాడు, కంకిపాడు
    మొదలుగాగ మంచి బుద్ధితో మా కోట
    పాడు పనుల జేయువాడు ఘనుడు

    రిప్లయితొలగించండి
  13. శ్రీ గురువుగారూ! మాకాకినాడ దగ్గరలోని రంగంపేట ప్రక్కనొక "కోటపాడు" ఉన్నది. ఈ కోటపాడు ఎక్కడ ఉన్నది? విజయనగరమా! సాలూరా!

    రిప్లయితొలగించండి
  14. కాన రెవరు నిన్ను కలిమి లేనప్పుడు
    కాసు లున్న వాడె వాసికేక్కు
    నంచు నీతి వీడి సంచులు నింపెడి
    పాడు పనులు జేయు వాడు ఘనుడు.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    నా మనస్సులో కల కోటపాడు ఒడిషాలో నున్నది. ఒకప్పుడు అది ఆంధ్రాలో భాగమే. నేను ఆ యూరిని ఎప్పుడునూ చూడలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. మిత్రులకు శుభాశీస్సులు. 31-3-2013 సాయంకాలము నేను అమలాపురములో ఆంధ్ర పద్య కవితా సదస్సు వారు ఏర్పాటు చేసిన సభలో "శ్రీమదధ్యాత్మ రామాయణము - తత్త్వ దీపిక" అనే అంశముపై 1 గంట సేపు ఉపన్యసించేను. కార్యక్రమము విజయవంత మయినది. ఈ సభకు నన్ను పరిచయము చేయుటలోను, సభను నిర్వహించుట లోను, ఆద్యంతము మా దంపతులకు స్వాగతము వసతి సత్కారాదులు చేయుటలోను అనగా అన్ని విషయములలోను శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ దంపతులు చాల శ్రమ తీసికొని చక్కగా నిర్వహించి మమ్ములను ఎంతయును ఆనందపరచినారు. ఆ దంపతులకు మా అప్రత్యేక శుభాశీస్సులు. తదుపరి విషయములైన వీడియో, ఫోటోలు, పేపరు వార్తలు అన్నీ కూడా శ్రీ శర్మ గారు చక్కగా చేసేరు. శుభం భూయాత్. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. స్వార్థబుద్ధితోడ సర్వంబు భక్షించి
    నాట్యమాడువాడు నాయకుండు,
    కలియుగంబులోన కలుషాత్మకుండౌచు
    పాడు పనుల జేయువాడు ఘనుడు

    రిప్లయితొలగించండి
  18. పాప భీతి లేక పదిమంది బాధించు
    కలి యుగమ్ము నందు వెలయు జనులు
    నేటి ధర్మ మిదియె నెరపించు కలియన
    పాడు పనులఁ జేయువాఁ డు ఘనుఁ డు . !

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    =====*======
    కరుణ యన్న పదము వరుణదేవుని జెంత
    వీడి, పేద వాడి ప్రేగు బంధ
    ములను కత్తిరించి పుడమిపైన పరమ
    పాడు పనుల జేయువాడు ఘనుడు

    రిప్లయితొలగించండి
  20. భూము లన్ని మ్రింగి భూరి సంపద దాచి
    గనుల కొల్ల గొట్టి కనుల గప్పి
    భాగ మీయ జూచు వారల దరి వంత
    బాడు పనుల జేయు వాడు ఘనుడు.

    రిప్లయితొలగించండి
  21. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి, (బహుకాల దర్శనం!)
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    కమనీయం గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    వరప్రసాద్ గారికి,
    మిస్సన్న గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. చిన్న సవరణతో...

    పనిని జేయు మనుచు పరమాత్ముడే చెప్పె
    ఫలిత మతడు జూచు భయము వలదు
    పనియు పాట లేక పడి నిద్ర బోవుట
    పాడు, పనుల జేయువాడు ఘనుడు

    రిప్లయితొలగించండి