4, ఏప్రిల్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1013 (నరకుఁడు సంపెఁ గృష్ణుని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్ష సేయఁగన్.
(వరంగల్ శతావధానంలో జి.వి. కృష్ణమూర్తి గారిచ్చిన సమస్య)

24 కామెంట్‌లు:

  1. ఎరుకయె లేని వాడొకరు డీవిధి ముద్రణ జేసె నక్కటా!
    "నరకుడు సంపె కృష్ణుని సనాతన ధర్మము నుద్ధరింపగన్
    ధర నని" దాని నొక్కడు యథా విధి నిచ్చె సమస్య పేరిటన్
    హరి! హరి! యేమి వింత ఇది? యందరి బుద్ధులు వెల్గ జేయవే!

    రిప్లయితొలగించండి
  2. అవధాని కోట వేంకట లక్ష్మీనరసింహం గారి పూరణ......

    అరచుచుఁ గీలుపెట్టెనట యర్భకుఁ డొక్కఁడు నాటకమ్ములో
    వరుసలు మార్చి వేయునట వైరులు మిత్రులు మారిపోవఁగాఁ
    దరతమభేద మెంచకయె తప్పులు వల్కు శకారుఁ డిట్లనెన్
    నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్షసేయఁగన్.

    రిప్లయితొలగించండి
  3. నరకుని జంపి నాడు గద నాడట కృష్ణుడు నేడు చూడగా
    నరకెను పాత గాథనిటు నామము ' సత్యపు నాటకమ్మనెన్ '
    నరకుని ' ఫ్యాన్స్ ' వచ్చి తమ నాయక స్వప్నము జేర్చిరందులో
    నరకుఁడు సంపెఁ గృష్ణుని( స.నా ) తనధర్మము రక్షసేయఁగన్.

    రిప్లయితొలగించండి
  4. స్థిరముగ భూమి నుండ దలచెన్, బలగర్వముతోడ నెల్లరన్
    నరకుఁడు సంపెఁ; గృష్ణుని సనాతనధర్మము రక్ష సేయఁగన్
    ధరణికి రమ్మటంచుఁ, బలు ధార్మిక వాదులు వేడ నాతఁడే
    పరుగున వచ్చి చంపెనటుపై, నరకాసురునిన్ మహోగ్రతిన్.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 3వ పాదములో తమ నాయక స్వప్నము అనే చోట స్వ ముందర క గురువు అగును - అందుచేత గణభంగము. దాని కొద్దిగా మార్చండి తమ నాయకు స్వప్నము అనండి - సరిపోతుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. హరిగుణకీర్తనా గతివిహారముజేసెడి దివ్యమూర్తులన్
    నరకుఁడు సంపెఁ, గృష్ణుని సనాతనధర్మము రక్షసేయగన్
    పరమ విశేషభక్త గుణవర్యులు వేడగ నార్తరక్షణా
    పరుడయి భూమినిన్ వెలసె పారముఁ జూపగ సజ్జనాళికిన్.

    రిప్లయితొలగించండి
  7. ధరపయినొక్కచోట నవధానము సాగుచునుండె, దానిలో
    నరయగ పృచ్ఛకుండొకడు హర్షమునందుచు శేముషీధురం
    ధరుడయి తేజరిల్లు నవధానికి నిచ్చె సమస్య నీవిధిన్
    నరకుడు సంపె గృష్ణుని సనాతనధర్మము రక్షసేయగన్.

    రిప్లయితొలగించండి
  8. ధర ముని సాధు సజ్జనుల ధర్మము వీడి యధెశ్చ ధూర్తుడా

    నరకుడు సంపె, గృష్ణుని సనాతనధర్మము రక్షసేయగన్

    సరగున రమ్మటంచు కడు సన్నుతి జేయగ నార్తులెల్లరున్

    దురమున జంపి వాని జన దుఃఖము బాపెను గోల్చిరందరున్ .

    రిప్లయితొలగించండి

  9. వరబల గర్వితుండయి సుపర్వుల గెల్చి, మునీంద్రలోక భీ
    కరుఁడయి, దైవచింతనము గల్గిన మానవులన్ శరారువై
    నరకుఁడు సంపెఁ; గృష్ణుని సనాతన ధర్మము రక్షసేయఁగన్
    సరగునఁ బూనుకొమ్మనుచు సాధుజనమ్మదె కోరె నొక్కటన్.

    రిప్లయితొలగించండి
  10. అరకొఱ నేర్చి గాధతతి నల్పు డవజ్ఞత వెక్కసంబుతో
    హరి,హర దైవరుపముల, నార్యుల ధార్మము దంభమార్గమున్
    దెరలుగ కించపర్చునట ! తెంపుకు లోటుయె ! వాని పల్కులా ?
    " నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్ష సేయఁగన్."

    రిప్లయితొలగించండి
  11. మిత్రులారా! శుభాశీస్సులు.
    సమస్యలను నింపుటకు ననేక విధానములుండును. వేదాంత వాక్యాలలో "ఆత్మావై పుత్ర నామాసి" అనే సూక్తి కలదు. దాని ప్రకారము తండ్రియే పుత్రుడగుచున్నాడు. ఆ విధానములో తండ్రికి పుత్రునకు భేదమే లేదు. నరకుడు సాక్షాత్తు శ్రీ వరాహమూర్తికి భూదేవికి పుత్రుడే కదా! అందుచే ఇలాగ సమన్వయించుదాము:

    నరకుని కృష్ణునిన్ గనుగొనన్ దనయుండును దండ్రియౌట, నీ
    ధరణిని పుత్రుడౌను కద తండ్రియె తాత్త్వికమైన రీతి, నీ
    సరణి సమన్వయింపదగు చల్లగ నిట్టి సమస్య సోదరా!
    నరకుడు సంపె గృష్ణుని సనాతన ధర్మము రక్ష సేయగన్


    రిప్లయితొలగించండి
  12. “ నరకుడు సంపె కృష్ణుని సనాతన ధర్మము రక్ష సేయగన్ "
    అరయ నిదేమి ?! హాస్యమున కైనను పల్కుట పాడి గాదిలన్
    *నరకడు రాక్షసాధముడు నాడు తపస్వుల చంపుచుండగన్
    నరకుని సంపె కృష్ణుడు సనాతన ధర్మము రక్ష సేయగన్

    * నరకడు = దుష్టుడు

    రిప్లయితొలగించండి
  13. శ్రీ కంది శంకరయ్య గురుతుల్యులకు నమస్కారములు

    మొదటి పద్యములో టైపాటు దోర్లినందున సవరించి

    పోస్ట్ చేసిన ఈ పద్యమును చోదన్ది.



    ధర ముని సాధు సజ్జనుల ధర్మము వీడి యధేశ్చదూర్తుడా

    నరకుడు సంపె, గృష్ణుని సనాతనధర్మము రక్షసేయగన్

    సరగున రమ్మటంచు కడు సన్నుతి జేయగ నార్తులెల్లరున్

    దురమున జంపి వాని జన దుఃఖము బాపెను గొల్చిరందరున్ .

    రిప్లయితొలగించండి
  14. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు. సవరణతో నా పూరణ...
    నరకుని జంపి నాడు గద నాడట కృష్ణుడు నేడు చూడగా
    నరకెను పాత గాథనిటు నామము ' సత్యపు నాటకమ్మనెన్ '
    నరకుని ' ఫ్యాన్స్ ' వచ్చి తమ నాయకు స్వప్నము జేర్చిరందులో
    నరకుఁడు సంపెఁ గృష్ణుని- స. నా - తనధర్మము రక్షసేయఁగన్.

    రిప్లయితొలగించండి
  15. 'నరకుడు సంపె కృష్ణుని సనాతన ధర్మము రక్షసేయగన్'

    దొరలిన యచ్చు తప్పు 'ని' ని దోషము దిద్దగ నుంచ నచ్చటన్

    సరియగు నర్థమిచ్చెనది సక్రమ రీతిగఁ బల్కు నట్టులన్

    'నరకుని సంపె కృష్ణుని సనాతన ధర్మము రక్ష సేయగన్'

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురు తుల్యులకు నమస్కారము

    ఈ రోజు పద్య పూరణ ములో ఎందుకో టైపింగులో పొరపాట్లు జరుగు చున్నవి
    ' యధేశ్చ' బదులు ' యధేచ్ఛ' యని గమనించగలరు .

    రిప్లయితొలగించండి
  17. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    ధరణికి భారమై సుజన తాపసులన్ బుధకోటులన్ సదా
    నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్ష సేయఁగన్
    పరిపరి రీతులన్ సుజన పాలకునిన్ బ్రతిమాల శౌరి యా
    నరకుని చంపి ధారుణి జనాళికి మోదము గల్గజేసెగా!

    రిప్లయితొలగించండి
  18. శంకరాభరణ సహచరా! సహదేవా! నమస్సులు. చాల బాగ చెప్పారు. నరకుడు లోని డు తీసి కృష్ణుని లోని ని పెట్టారుగా.తిసివేసిన డును కృష్ణునికి కలిపిన తారుమారైన అక్షరాలను సరిచేసినట్లగునేమో? కృష్ణాంతరంగం ముందుగనే పసిగట్టగలవాడు సహదేవుడని గాధ.(భవిష్యత్తు తెలిసినవాడు)

    రిప్లయితొలగించండి
  19. అద్భుతమైన భావంతో పెద్దలు నేమాని వారూ, మంచి విరుపులతో మిత్రులూ సమర్థమైన పూరణలు చేశారు.

    నాదొక ఊహ:

    నరకుని తోడ యుద్ధమున నాథుని తోడుగ సత్యభామయున్
    నరకుచునుండ దైత్యుల, జనమ్ముల ముంచ నయోమయమ్మునన్
    నరకుని మంత్రి యొక్కరుడు నల్దెసలన్ ప్రకటించె నిట్లహో!
    నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్ష సేయఁగన్.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ గురువులకు, మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    అవధానంలో ఇంత దుష్కరమైన సమస్యనిచ్చిన శ్రీ కృష్ణమూర్తి గారు అభినందనీయులు. ఈరోజు పెద్దల పూరణలన్నీ చిత్రోక్తి ఛలోక్తులతో చాలా బాగున్నాయి.

    నరకాసురుడు కూడా పూర్వజన్మలో భగవద్వరప్రసాదాన్ని చూఱగొన్న పుణ్యధనుడని గర్గమహర్షి కథనం.

    వరమును గాంచెఁ గూఁతుల నవారితభక్తిఁ బదాఱువేల వా
    రిరుహవిశాలనేత్రలను శ్రీపతి కర్పణసేయఁ దొల్లి; ను
    ర్వరకుఁ దనూజుఁడై దురితవర్తనుఁడయ్యెఁ; దుదన్ దదీయులన్
    నరకుడు సంపెఁ; గృష్ణుని సనాతనధర్మము రక్ష సేయఁగన్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  21. గండూరి లక్ష్మీనారాయణ గారూ, శ్రీ శంకరయ్య గురువర్యులే అచ్చ్తప్పులతో సమ్మస్య నిచ్చారని శ్రీ సహదేవుల వారు చిత్తగించారు, కదా ! మరి అచ్చుతప్పులు మనకు కూడా దొర్లుతున్నాయి. నా తచ్చు అప్పులు సవరించి,

    అరకొఱ నేర్చి గాధతతి నల్పు డవజ్ఞత వెక్కసంబుతో
    హరి,హర దైవరూపముల, నార్యుల ధర్మము దంభమార్గమున్
    దెరలుగ కించపర్చునట ! తెంపుకు లోటుయె ! వాని పల్కులా ?
    " నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్ష సేయఁగన్."

    రిప్లయితొలగించండి
  22. శ్రీ Tbs శర్మ గారికి ధన్యవాదములు. అచ్చు తప్పుల దిద్దు బాటులో నేను చేసిన టైపు తప్పును సున్నితముగా తెలియజేసి నందులకు కృతజ్ఞతలు. చివరి పాదం :

    'నరకుని సంపె కృష్ణుడు సనాతన ధర్మము రక్ష సేయగన్'

    రిప్లయితొలగించండి
  23. మనోహర పూరణములను చెప్పిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సహదేవుడు గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    మిస్సన్న గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. మరచుచు బాబు గారినిక
    మైకున మెచ్చుచు మోహనున్ భళా
    కరచుచు హైందవత్వమును కల్లును గ్రోలుచు రాజమండ్రియౌ
    పురమున బైబులున్ చదివి మూఢుడు పాడెను పాఠమివ్విధిన్:👇
    "నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్ష సేయఁగన్"

    రిప్లయితొలగించండి