15, ఏప్రిల్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1024 (మరునిం బూజించ మేలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మరునిం బూజించ మేలు మాతామహికిన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

32 కామెంట్‌లు:

  1. పెరిగిరి కొమరులు మనవలు
    అరువది సంవత్సరములు నలవిగ నిండెన్
    హరునికి ప్రియమైనట్టి కొ
    మరునిం బూజింప మేలు మాతామహికిన్

    రిప్లయితొలగించండి
  2. కరుణా సింధుడు భక్తుల
    నిరతము కాపాడువాడు నిర్మల హృదయున్
    మరవక మదిని దశరథ కొ
    మరునింపూ జించ మేలు, మాతా! మహికిన్ .

    రిప్లయితొలగించండి
  3. అరువది వత్సర మగుటన
    భరమగు బంధముల విడిచి భవ హర యనుచున్
    శరణము గోరుచు హరునికొ
    మరుని బూజించ మేలు మాతా మహికిన్ .

    రిప్లయితొలగించండి
  4. పుష్పాభిషేకము:

    మిత్రులార!
    శుభాశీస్సులు.
    మన బ్లాగు గురువులు శ్రీ శంకరయ్య గారికి పద్య పుష్పాలతో అభిషేకము చేస్తే బాగుంటుంది అని భావించేను. నేనొక 3 పూవులతో మొదలు పెట్టేను. మీరు కూడా తలొక కొన్ని పూవులు వేయండి. స్వస్తి:

    సాహితీ జగమున శంకరాభరణము
    బ్లాగు నొకటి నిలిపి ప్రతిదినమ్ము
    పద్య విద్య యందు పాఠముల్ నేర్పెడు
    శంకరయ్య ప్రథిత సద్గురుండు

    వాఙ్మహాధినేత్రి వాత్సల్యమున్ గని
    భాషయందు మరియు పద్యరచన
    మందు పట్టు గలుగు కంది వంశోద్భవ
    శంకరయ్య ప్రథిత సద్గురుండు

    గణము, యతియు, ప్రాస, గమన మన్వయమును
    భావములను గూర్చి బహు విధముల
    సులభ పద్ధతులను సూచించు శ్రీ కంది
    శంకరయ్య ప్రథిత సద్గురుండు

    రిప్లయితొలగించండి
  5. సురలకు నరులకు విద్యా
    ధరులకుభూసురులకెల్ల దైవంబగు శ్రీ
    కరునిన్ ఘనునిన్ శివునికు
    మరునిం బూజించమేలు మాతామహికిన్!!!

    రిప్లయితొలగించండి
  6. సురలసురాదిగణంబులు
    గురుతరభక్తిప్రపత్త కోవిదులై శం
    కరుడవు పరాత్పర చిద
    మ్బరు, నిన్ బూజించ మేలు మాతామహికిన్.

    రిప్లయితొలగించండి

  7. తమ యీ సమస్య పూ రణ ,
    సమస్య గా మారెనయ్య! శంకరు సామీ !,
    సమయములు కుదర నందున ,
    సమ భావము లీ యనేర సారీ యండీ!
    -----------------------------------
    నమములు గురు తుల్యులకును ,
    నమములు మఱి శంకరయ్య సామికి నమముల్,
    నమముల తొ గోరు చుంటిని ,
    నిమ్ముగ నడ్రస్సు మీ ది నీ యుడు నిచటన్ .

    రిప్లయితొలగించండి
  8. హారము చదువుల నిలయము
    హారము నొక మంచి సొగసు నాం ధ్రా వనికిన్
    హారము సాహితి పరులకు
    హారమునకు సాటి లేదు యావద్భువి లోన్ .

    రిప్లయితొలగించండి
  9. సురగణ ములకధి పతియగు
    పరమాత్ముం డనగ నతడు పార్వతి సుతుడౌ !
    కరి ముఖుడగు శివకొ
    మరునిం బూజించ మేలు మాతా మహికిన్ !

    రిప్లయితొలగించండి
  10. గురువుల కధిపతి యగు శం
    కరునకు బహుమ తిస్ధి కరుణించగ నన్ !
    విరజాజుల హరిచందన
    పరిమళ ద్రవ్యముల కవిత పరమ ప్రీతిన్ !

    రిప్లయితొలగించండి
  11. ధరణి సహజ సంపదలన్
    నిరతము దోచి సమతుల్య నీమము దప్పన్
    హరి సర్వోత్తము నజరా
    మరునిం బూజించ మేలు మాతా మహికిన్!
    (మాతా మహి = భూ మాత )

    రిప్లయితొలగించండి
  12. అరయగ తనమానసమున
    హర!హర! తోరంపుభీతి యనవరతంబున్
    తిరుగుచు నున్నందున పలు
    మరు నిం బూజించ మేలు మాతామహికిన్.

    రిప్లయితొలగించండి
  13. ఆది దంపతు లైనట్టి యాది దేవు
    లాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటికిని రెప్ప యట్లయి గాచు గాత!
    కంది శంకరు గురువుని గరుణ తోడ

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీనారాయణ గారి పూరణ అద్భుతము.

    గురువుగ సాక్షాత్కారము
    వరమంచునొసగి రచనల ప్రావీణ్యత మా
    పరమునుఁ జేసిన తరుణమె
    సరిసాటిఁ గనని శుభములు సంప్రాప్తించెన్.

    చిఱుపాపడు కూతురికి కొ
    మరునిం బూజించ మేలు మాతామహికిన్
    శిరమున కిరీటమిడి; భూ
    ధరుడై నాంధ్రులనుఁ గావ ధర్మము నిలుపన్.

    రిప్లయితొలగించండి
  15. గురుభ్యో నమ:
    పద్య ప్రసూనాంజలి గైకొనుమ :

    పద్య మెటుల వ్రాయ వలయునో జెప్పిన
    పద్యవిద్య గురువు ; పద్య మందు
    ప్రాసయతుల నెట్లు పాటించవలయునో
    వ్రాసి చూపి నట్టి ప్రథిత గురువు

    పాఠశాల వంటి పద్యాల బడి యిదే
    'శంకరాభరణము ' బ్లాగు యనగ
    విసుగు చూపకుండ వివరించు చుండెడు
    శంకరార్యు డితడు సద్గురుండు

    రిప్లయితొలగించండి
  16. కందివంశజాత! వందనంబులు మీకు
    సత్కవీంద్ర! మాన్య! శంకరార్య!
    సర్వహితముగోరి శంకరాభరణంబు
    నడుపుచున్న మీకు నతులొనర్తు.

    నిత్యపద్యరచన నిష్ఠగా జేయించ
    దలచి మమ్ముబోంట్ల బిలిచి సతము
    పద్యపంక్తు లిచ్చి హృద్యంపువ్యాఖ్యలు
    చేయు మీకు నతులు చేతునార్య!

    ఎన్నిపనులు నిత్య మున్నను వాటిని
    ప్రక్కనుంచి ముందు పద్యరచన
    ముఖ్యమని దలంచి ముందొక పంక్తిని
    మాకు నొసగు చుండు మాన్య! నతులు.

    ఆపకుండ సతత మారోగ్యమునుగూడ
    లెక్క చేయకుండ మిక్కిలిగను
    ఉత్సహించి మాకు నుత్సాహమును బంచు
    చుండు శంకరార్య! దండ మందు.

    యతులు ప్రాస లరసి యత్యద్భుతంబుగా
    నిట్లు మిత్రులంద రెల్ల వేళ
    కవిత లల్లుటకును కారకులైనట్టి
    శంకరార్య! మిమ్ము సన్నుతింతు.

    రిప్లయితొలగించండి
  17. వెన్నపూస మనసు వినయ శీలత్వమున్
    విద్య పంచి బెట్టు వేడుకయును
    మంచి గురుని జేసె నెంచగ బ్లాగులన్
    కంది శంకరుండు ఘనుడు జూడ!

    రిప్లయితొలగించండి
  18. పద్యముల వ్రాయ నేర్పెడు ప్రాజ్ఞు డితడు
    ఒప్పు తప్పులు జెప్పెడు నొజ్జ యితడు
    గర్వమించుక లేని నిగర్వి యితడు
    చల్లగా జూడుమా తల్లి శారదాంబ !!!

    తెలుగు భాష తీపి తెలిసిన రసికుండు
    కవుల ప్రోత్సహించు కర్ష కుండు
    కంది శంకరయ్య కవి చంద్ర మౌళికి
    వందనములు గంధ చందనములు !!!

    రిప్లయితొలగించండి
  19. మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
    నమఃపూర్వక పద్యప్రసూనాభిషేకం

    శ్రీ “శంకరాభరణ” నా
    మాశంసిత మధుర మధు రమాకల్పవిధా
    నా౽శిత కవి కవితోత్పల
    తాశంకర శంకరయ్య తరుణశశాంకా!

    మీ ప్రేమాతిశయముఁ బ
    ద్యప్రణయనదీక్ష నన్నుఁ దావకవాత్స
    ల్యప్రశ్రితుఁ గావించె సు
    ధాప్రేక్షణ శంకరార్య! ధన్యతఁ జెందన్.

    “భారతీసేవకప్రథుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
    “పద్యవిద్యానిత్యవ్రతుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
    “గురుకవీంద్రాచార్యవరుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
    “దయమీఱు ప్రియసహృదయుఁ”డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!

    శంకరయ్య బుధేంద్రుని వంకఁ జూచి
    సర్వసుఖములు గూర్పు నా స్వామి!” యనుచుఁ
    గళలు తళుకొత్త, మోము వెన్నెలలు విరియ
    శంకరయ్య నడుగు నెలవంకఁ జూతు.

    కమ్రపద్యమాకంది మా కంది శంక
    రయ్య గారి నెపుడు శంకరయ్య గారు
    తనను, నాంధ్రభాషను “భక్తితత్పరుఁ డయి
    సేవచేయుఁ గాఁత" మని రక్షించుఁ గాఁత.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  20. సరస చక్రవర్తి శంకరార్యులు వారు
    భోజరాజు గారె భువిని నేడు !
    కవుల విశ్రమింప కల్పవృక్షము నాట
    ముకుళ హస్తములను మొగ్గ లిడుదు.

    రిప్లయితొలగించండి
  21. గురువర్యుల గొప్ప తనము
    నిరతము నగుపించు వారి నేర్పును జూడన్
    పరిచయమైన దినాదిగ
    పరిమళములపారిజాత పదముల వాడే!

    రిప్లయితొలగించండి
  22. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    వరమొసఁగెడి దేవరవని
    యొరిగ లిడుచు మా పితామహుని సేమముకై
    పరమేశ్వరుఁ దత్ప్రణతా
    మరు నిన్ బూజింప మేలు మాతామహికిన్.

    ఇంకొకటి:

    కరుణాతరంగితాక్షివి
    చరణానతసకలవిబుధసంఘవు లలితా
    పరమేశ్వరి వంచును బలు
    మరు నిన్ బూజింప మేలు మాతా! మహికిన్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. శ్రీ గురుభ్యో నమః ;

    దినము తక్క వచ్చు దినకరుం డొకపరి
    దినము తక్క దిచట దెలుగు కవిత
    దినము దినము ప్రభలు దీప్తించు గురులకున్
    దినము తక్క కుండ వినతు లిడుదు !

    రిప్లయితొలగించండి
  24. శ్రీ పండిత నేమాని గురువుల సూచనను శిరసావహిస్తూ.....
    పద్యవిద్య యందు పాఠాలు నేర్పుచు
    పలుకలమ్మ ఒడికి పదిలముగను
    అడుగులిడగ జేసి ఆనందమందించు
    శంకరార్య మీరు శంకరులుగ.
    17-12-2012 వ తేదీన "శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యమునిచ్చున్" అను సమస్యను పూరించి శంకరాభరణ సాహితీవనంలో ప్రవేశించా!

    అవసరములేని మాటలు
    అవమానమునందజేయునను యోచనతో
    అవసరమని తలచిన కే
    శవ(శంకర) సాన్నిధ్యమ్ము మదికి సౌఖ్యము గూర్చెన్.

    ఈ బ్లాగును పరిచయం చేసిన పెద్దలు శ్రీ టి. బి. యెస్. శర్మ గారికి ఈ బ్లాగు ముఖమున మరొక్కసారి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  25. చక్కని పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు.

    చిరు నవ్వు పెద్ద బొజ్జయు
    కరి ముఖమును గలిగినట్టి గణనాథుని నా
    సురపూజిత చరణు హరు కొ
    మరునిం బూజించ మేలు మాతా ! మహికిన్.

    రిప్లయితొలగించండి
  26. మురళీధరరావు గారు,
    మీ పద్యములో మాతా మహుడని సవరించాలేమో , గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  27. కవిమిత్రులకు నమస్కృతులు.
    మొన్న మరణించిన మా బంధువు అంత్యక్రియలకు నిన్న ఉదయమే ఊరికి వెళ్ళి, రాత్రికి తిరిగి వచ్చాను. ఈ రోజు కూడా మరో బంధువు తొమ్మిదవ రోజు కార్యక్రమానికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందువల్ల నిన్నటి మీ పూరణల, పద్యాలపై నా స్పందనను తెలుపలేకపోయాను. మన్నించండి.
    నిన్నటి సమస్యకు చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు....
    నాగరాజు రవీందర్ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    సుబ్బారావు గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    సహదేవుడు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    పండిత నేమాని వారు అవ్యాజమైన వాత్సల్యంతో ప్రారంభించిన పుష్పాభిషేకానికి స్పందించి మిత్రులందరూ ప్రశంసాపద్యపుష్పాలను అందించి నాకు ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించారు. అందరికి ధవ్యవాదాలు. ఇవి బ్లాగు నిర్వహణలో నా బాధ్యతను గుర్తు చేస్తున్నవి.

    రిప్లయితొలగించండి
  28. తరువుల మరుగున మెసలుచు
    బరువుగ మేతలను మేసి పడుకొను మాతా!
    కరకరమని ఘాసమును నె
    మరు నిన్ బూజించ మేలు మాతామహికిన్

    మాత = గోవు

    రిప్లయితొలగించండి
  29. పరువపు వేడ్కల నందున
    మరునిం బూజించ మేలు;..మాతామహికిన్
    దొరకక కామపు సూక్తుల
    బరువగు పొత్తమును దాచి పరుపుల క్రిందన్

    రిప్లయితొలగించండి