23, ఏప్రిల్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1032 (బకము వచ్చి వాలి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె.

17 కామెంట్‌లు:

  1. పిల్ల చేప యొకటి యల్లనల్లన నీట
    నెగురు చుండి పైకి నీదుచుండ
    నదను జూసి దాని నాకలి గొనియున్న
    బకము వచ్చి వ్రాలి ప్రాణము గొనె.

    రిప్లయితొలగించండి
  2. ధర్మరాజ నీతి, ధర్మమ్ము, ధైర్యమ్ము
    ప్రశ్నజేయ యక్ష వరుడనంగ
    వనమునందు తమ్ములను హరియించ నా
    బకబు వచ్చి వాలి ప్రాణముగొనె

    రిప్లయితొలగించండి
  3. పిల్ల చేప యొకటి యల్లనల్లన నీట
    నెగురు చుండి పైకి నీదుచుండ
    నదను జూసి దాని నాకలి గొనియున్న
    బకము వచ్చి వాలి ప్రాణము గొనె.

    రిప్లయితొలగించండి
  4. రోషభీషణము కురుక్షేత్ర సంగ్రామ
    మందు నీచగతిని యందె కర్ణు
    డంత విజయుడేసె నంతమ్ము జేయ నం
    బకము, వచ్చి వాలి, ప్రాణము గొనె.

    రిప్లయితొలగించండి
  5. బలయుతుండు తరిమె వాలి - సుగ్రీవుని
    శరణుజొచ్చె రామ చంద్రునతడు
    భయముదక్కుమనుచు వరమిచ్చి వేసె నం
    బకము వచ్చి - వాలి ప్రాణము గొనె!!

    రిప్లయితొలగించండి
  6. ధర్మ పథము తప్పి దర్పమ్ముతో నొప్పి
    భార్య హితము వినక వచ్చి నంత
    వెనుక నుండి రామ విభుడు వేసిన మహాం
    బకము దగిలి వాలి ప్రాణము గొనె

    రిప్లయితొలగించండి
  7. రామచంద్రు డప్డు రవికుమారుని తోడ
    స్నేహ మంది బాస చేసె, పిదప
    వృక్ష చరుని పైకి వేయగా నప్పుడం
    బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె.

    రిప్లయితొలగించండి
  8. బకము వచ్చి వాలి ప్రాణము గొనె
    ననుట సత్య దూర మా ర్య ! విన గ
    బ క మనంగ కొంగ వాలి యరయ కోతి
    రెంటి కెట్లుగ కుదు రీ కలయిక .


    మడుగు లోని చేప నడుము బట్టి దినె ను
    బకము వచ్చి, వాలి ప్రాణము గొనె
    రామ బాణ మపుడ రహిని చెలగి న దై
    అన్న దమ్ముల కల హ మటు లాయె .


    రిప్లయితొలగించండి
  9. నిండు చెరువు లన్ని యెండి పోవుచు నుండె
    చేప లెల్ల భీతి చెందు చుండె
    నట్టి యదను జూచి యాకలితోనున్న
    బకము వచ్చి వాలి ప్రాణము గొనె .

    రిప్లయితొలగించండి
  10. కులుకుచుండి యొక్క జలరాశితీరాన
    మత్స్యశాబకంబు మరలమరల
    నెగురుచుండ చూచి యెటనుండియో ఒక్క
    బకము వచ్చి వాలి ప్రాణము గొనె.

    రిప్లయితొలగించండి
  11. బండి విరిగి పోయె బకము ప్రాణము పోయె
    యాతుధాన యోష హత్య జరిగె
    వత్స మంతరించె వణకె కంసుడు శా-
    బకము వచ్చి వాలి ప్రాణము గొనె.

    రిప్లయితొలగించండి
  12. మిత్ర లాభ మెంచి మిడిసిపడెడు వాలిఁ
    జంప దలచి రామ చంద్రు డంత
    చెట్టు చాటు నుండి కొట్టగ వడిగ నం
    బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె

    రిప్లయితొలగించండి
  13. మిత్ర లాభ మెంచి మిడిసిపడెడు వాలిఁ
    జంప దలచి రామ చంద్రు డంత
    చెట్టు చాటు నుండి కొట్టగ వడిగ నం
    బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె

    రిప్లయితొలగించండి
  14. పూలగుత్తి యందు పూన్చి బాంబు నొకటి
    ఉగ్రవాది యొకడు యుక్తి తోడ
    విసర నేత పైకి వెనువెంటనే యా స్త
    బకము వచ్చి వాలి ప్రాణము గొనె

    రిప్లయితొలగించండి
  15. గగన మందు దిరుగు కలహంసల గుంపు
    ధరను గాంచి పలికె వెఱగు పడుచు
    ఛెంగు మనుచు నెగురు చేప పిల్లల గాంచి
    బకము వచ్చి వాలి ప్రాణముఁ గొనె

    ఇప్పుడసలే అమ్మని సరిగ్గా నెర్పించక పోతే అస్సలూరు కోను
    పెద్ద పెద్ద పండితులకి అమ్మని కాగలగడం నా పూర్వ జన్మ సుకృతం ఇలాగే వేవేల మందిని గొప్ప పండితులు గా తీర్చి దిద్దగలరని దీవిస్తూ ! ....అమ్మ

    రిప్లయితొలగించండి
  16. గొల్ల పల్లె లోని గోపకులను మ్రింగ
    బకము వచ్చి వాలి , ప్రాణము గొనె
    చుంచువులను జీల్చి త్రుంచుచు బకుడిని
    చిన్ని కృష్ణు డంత చిందు లాడి

    రిప్లయితొలగించండి
  17. మనోహరంగా పూరణలు చెప్పిన కవిమిత్రులు...
    మిస్సన్న గారికి,
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
    ఆర్.వి.ఆర్. శర్మ గారికి,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    సహదేవుడు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    ‘రెంటి కెట్టుల కుదు రీ కలయిక’ అందాం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ‘లగుంపు’ అని జగణం వేసారు. అక్కడ ‘కలహంసముల గుంపు’ అంటే సరి.

    రిప్లయితొలగించండి