6, ఏప్రిల్ 2013, శనివారం

పద్య రచన – 303 (తృప్తి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“తృప్తి”

18 కామెంట్‌లు:

  1. తృప్తిలేని వాడు దీనుడై నాశిల్లు
    తృప్తి వలన నెసగు తేజమవని
    తృప్తి సుఖము గూర్చు దీర్చు సమస్యలు
    శాంతి తోడ దనరు స్వాంతమెపుడు

    రిప్లయితొలగించండి
  2. ఆశల కంతము లేదిల
    పాశములను త్రెంచి తనరు పరమార్ధముకై !
    పేశలమగు జీవితమున
    కౌశలమున తృప్తి జెంది కడలిని దాటన్ 1

    రిప్లయితొలగించండి
  3. ఉన్న వాడు కనగ నున్న వాడే కాదు
    లేని వాడు తృప్తి లేని నాడు
    లేని వాడు నిజము లేని వాడే కాదు
    ఉన్న వాడు తృప్తి యున్న నాడు.

    రిప్లయితొలగించండి
  4. తృప్తియెసుఖమునునిచ్చును
    తృప్తియెనిలనాయుబెంచుతృప్తియెబలమున్
    తృప్తియెవరమదిమనిషికి
    తృప్తియెమఱికలుగు వాడునృగవుడుధరలోన్

    రిప్లయితొలగించండి
  5. తృప్తితో వీడుమీ దేహమున్ లోకమున్,
    తృప్తినిన్ పొంది సందేహమున్ వీడుమా!
    తృప్తిచే మూర్తినిన్ దేవునిన్ చూడగా
    ప్రాప్తి గల్గు, మోక్షసంపాదనల్ ముఖ్యమౌ.

    రిప్లయితొలగించండి
  6. సేకరణ: సాహిత్యాభిమాని.
    తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
    దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
    జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
    తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

    రిప్లయితొలగించండి
  7. అనుభవించగలడె నానందమేనాడు
    తృప్తిలేనినరుడు తృష్ణవలన
    కోరికుండుటొప్పు పేరాశయేముప్పు
    తృప్తి గలుగ పొందు దృతియు శాంతి!!!

    రిప్లయితొలగించండి
  8. ఉన్నదానితోడ నుర్వీతలంబున
    సంతసించుచుండ సర్వజగతి
    సౌఖ్యమబ్బుచుండు విఖ్యాతి చేకూరు
    తృప్తి జీవితాన దీప్తి నొసగు.

    తృప్తిలేనిచోట వ్యాప్తంబులైయుండు
    వేగ మఖిలమైన రోగములును
    మానసంబులోన మమతానురాగాల
    గంధమించుకైన కానరాదు.

    రిప్లయితొలగించండి
  9. అమ్మా! శ్రీమతి లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    మీ స్రగ్విణీ వృత్తము బాగుగనున్నది. 4వ పాదములో చిన్న గణభంగము కనుపట్టుచున్నది. "ప్రాప్తి గల్గు"కి బదులుగా ప్రాప్తమౌ అని వాడండి సరిపోవును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. ఈనాటి అంశంపై ‘తృప్తి’కరమైన పద్యాలను రచించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    ‘తృప్తియె యాయువును బెంచు’ అందాం.
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘కలడె యానంద’ మని అనండి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ సాహిత్యాభిమాని గారికి
    నమస్సులతో,

    మీరిచ్చిన ఏనుగు లక్ష్మణకవి గారి భర్తృహరి శతకానువాద పద్యం "తృప్తి"కి ఉదాహరణం కాదు. గర్వ పద్ధతికి ఉదాహరణం.

    "తెలివి యొకింత లేనియెడఁ దృప్తుఁడనై కరి భంగి మెలంగితిన్"

    అని పద్యపాఠం కాదు.

    "తెలివి యొకింత లేనియెడ దృప్తుఁడనై కరి భంగి మెలంగితిన్"

    అని పాఠం. దృప్తుఁడు = గర్వించినవాఁడు అని అర్థం.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి






  12. ఆధునికులు వాక్రుచ్చెద రవని దృప్తి
    నంద ,నభివృద్ధియు,వికాస మాగిపోవు,
    పరుగులెత్త దేశమ్ము,జీవనము దృప్తి
    పడక, శ్రమపడవలెనని వారి మాట.

    రిప్లయితొలగించండి
  13. కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    దప్పి కగొనిన వార్కియు దకము తోడ
    నాకొనిన వారలకు పట్టె డన్న మిచ్చి
    తృప్తి పరుపగలము గాని తృప్తి పరుప
    లేము నిలువెత్తు ధనమిచ్చి లెక్క జూడ.

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    =========*========
    కోరిన వరము బొంద భక్తునకు దృప్తి
    నేత చీరలను గన వనితకు దృప్తి
    గోవు పొదుగును గన కర్షకునికి దృప్తి
    కమ్మని కవితలను విన్న కవికి దృప్తి

    రిప్లయితొలగించండి
  17. అయ్యా,
    దోషము సూచించినందుకు ధన్యవాదములు.

    తృప్తితో వీడుమీ దేహమున్ లోకమున్,
    తృప్తినిన్ పొంది సందేహమున్ వీడుమా!
    తృప్తిచే మూర్తినిన్ దేవునిన్ చూడగా
    ప్రాప్తమౌ మోక్షముల్, పాయగా కర్మముల్.

    రిప్లయితొలగించండి
  18. శక్తి మీరి కోర శాంతము కరువౌను
    శక్తి పొంది పోర సకలమందు
    తృప్తి యన్న పదము ప్రాప్తిని బట్టియు
    మారు చుండు ధరణి మనుజు లార!

    రిప్లయితొలగించండి