20, ఏప్రిల్ 2013, శనివారం

పద్య రచన - 317 (కవిత్వ ప్రయోజనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కవిత్వ ప్రయోజనము”

11 కామెంట్‌లు:

  1. మిత్రులారా!

    ఉగాది నాడు (11-4-2013) విశాఖపట్టణములోని విశాఖ సాహితి అనే సాహిత్య సంస్థ మరియు లలితా పీఠం (విశాఖ) వారు సంయుక్తముగ నిర్వహించిన సాహిత్య కార్యక్రమములో భాగముగా చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మచే అష్టావధానమును జరిపించిరి. అవధానానంతరము అవధానికి "అవధాన సుధాకర" అనే బిరుదమును ఒసంగిరి. ఈ బిరుద ప్రదాన ప్రతిపాదన శ్రీ శ్రీ శ్రీ కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి (పూర్వ ఆశ్రమములో డా. ప్రసాదరాయ కులపతి) అనుగ్రహ పూర్వకమైన ఆమోదమును కూడ పొందినది.

    చి. శర్మ గారి ప్రపితామహులు పితామహులు మంచి పద్య కవులే. ఆలాగుననే వాని అన్న కూడ మంచి పద్య కవియే. చి. శర్మ ఇప్పటికి 32 అష్టావధానములను విజయోత్సాహముతో నిర్వహించెను. చి. శర్మ తెలుగులో డాక్టరేట్ కై కృషి చేయుచుండెను. ఆతడు తెలుగు సాహితీ రంగములో సమున్నత స్థానములకు ఎదగాలని మా ఆశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. రాంభట్ల వారికి అభినందనలు...

    రాంభట్ల వారు చేయు వి
    జృంభణ నవధానమందు చేసెడి విధమే
    బంభర ఝుంకారమ్ముల
    సంభారములందజేసి జయ మందవలెన్.

    రిప్లయితొలగించండి
  3. హృదయానందము గూర్చుచు
    పృధివిన్ సామాజిక స్పృహ పెంపొందించన్
    గదిలెడు కవితా వాహిని
    పదుగురు మెచ్చగఁబలికిన పాండిత్యమగున్

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారికి నమస్సులు. శంకరయ్య గారికి, పెద్దలకు అభివాదాలు.

    యశము నర్థమ్ము, వ్యవహార కుశలతయును,
    మంగళేతరక్షతమును , మాన్య మోక్ష
    పథము జూపుట, భార్య నా బలుకుటనెడు
    నర్థములు కవిత్వమునకు నరసె బుధులు!!


    రిప్లయితొలగించండి

  5. కవి విరచిత మగు దానిని
    సవినయముగ విబుధు లనిరి సత్కవి త య గా
    అవిరళ మగు నానందము
    కవనంబున గలుగు నిజము కవివరు లారా !

    రిప్లయితొలగించండి
  6. పార్వతీశ్వర శర్మ గారికి అభినందనలు.

    సురుచిరమగు పదసంపద
    మురిపించెడు కావ్యలక్ష్మి మోదంబొసగున్,
    పరమార్థముఁ గూర్చును, మఱి
    ధరియిత్రిని జనులకును సుధర్మము నేర్పున్.

    గురువుగారు,
    నిన్నటి సమస్యాపూరణము

    సోముని శిరమునఁ దాల్చెను,
    కామునిఁ గూల్చెన్, గిరిసుత కామేశ్వరినిన్
    ప్రేమగఁ గను నా త్రిపుర వి
    రాముని పెండ్లి జరిగెను ధరాధరసుతతోన్.

    రిప్లయితొలగించండి
  7. యశము ధనము నిచ్చు, వ్యవహారవిదు జేయు
    శుభము లందజేయు, సుందరివలె
    బోధచేయుచుండు పుడమిని కాన క
    వనము సుఖము నొసగు జనుల కెపుడు.

    రిప్లయితొలగించండి
  8. అవధానసుధాకరుడయి
    శ్రవణానందంబు గలుగు సరణిని నేడున్
    కవితామృతమును బంచుట
    స్తవనీయము పార్వతీశశర్మాఖ్యకవీ!

    రిప్లయితొలగించండి
  9. చెవియొగ్గి వినెడు వారికి
    సవివరము విషయములను సత్కృతి చేతన్
    వివిధములగు పాకమ్ముల
    కవనములోనందజేయ కడు సంతసమౌ !

    రిప్లయితొలగించండి
  10. “అవధాన సుధాకర” రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి అభినందనలు తెల్పిన కవిమిత్రులందరికీ ధన్యవాదాలు.
    *
    కవిత్వ ప్రయోజనాన్ని తెలుపుతూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    సహదేవుడు గారికి,
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. కావ్యములు చదివి నంతనె
    శ్రావ్యముగా నుండి మదికి శ్రాంతము నిచ్చున్ !
    భావ్యము ప్రబంధ పఠనము
    సేవ్యము సహృదయముగ శేషుని పదముల్ !

    చిరంజీవి పార్వతీశ శర్మకు అభినందన మందారములు

    రిప్లయితొలగించండి