22, ఏప్రిల్ 2013, సోమవారం

పద్య రచన - 319 (అహంకారము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“అహంకారము”

11 కామెంట్‌లు:

  1. మట్టి గరిపించి తెలియని, మత్తునిచ్చు!
    మదము పెంపొంది జ్ఞానమ్ము మాయమగును!!
    అహము నహరహమందుండ నిహము చెడును
    పరముఁ దెలియగ మార్గమ్ము పదిలపడదు!

    రిప్లయితొలగించండి
  2. అహము నిండిన వానికి నిహము నందు
    మిత్ర సాంగత్య ముండదు మెప్పు లేదు
    ఎదిగి నంతనె ప్రియముగ నొదిగి యున్న
    వినయ సంపద గలిగిన తనరు సుఖము !

    రిప్లయితొలగించండి
  3. హుంకారము జేయుచును న
    హంకారము బడుగుల నెడ నలయక జూపన్
    ఢంకా గొట్టుచు జెప్పెద
    నేంకాదన బోకుడయ్య యిడుముల బడుగా !

    రిప్లయితొలగించండి
  4. అహము కలవాని కరయగ నిహము నందు
    మెప్పు గలుగదు మఱియును మిత్రు లెవరు
    చేర నీ యరు సరిగదా చీ కొడుదురు
    అహము కారపు లక్షణ మదియ సుమ్ము .

    రిప్లయితొలగించండి
  5. నేను నేనను నహము తా నిన్ను పట్టె
    నేమి సేతువు ? వచ్చితి వెచటి నుండి ?
    పుట్టు మనుజుడు తప్పక గిట్టు కతన
    భ్రాంతి విడనాడు మిక వెఱ్ఱి బాగు లోడ !

    రిప్లయితొలగించండి
  6. అహంకారం కాదెవ్వరికిన్ అలంకారం
    దహించును అహంకారము దావాలనం వోలె
    యిహమున పరమపదము బొందగలవు
    సహనమునన్ సత్ సావాసములనన్

    రిప్లయితొలగించండి
  7. రవీంద్రగారి స్ఫూర్తితో.....

    అడవిలోనఁ బుట్టి హరియించు నడవిని
    మేలు గాదు హాని మిగుల కలుగు
    దయనుఁ జూపదోయి దావానలమ్మది
    యహము కాల్చు పరము నిహము కూడ.

    రిప్లయితొలగించండి
  8. అహమన్నది గర్వంబిడ
    సహియింతురు భువిన నశక్తి చాటున వారల్
    దహియింపగ బలశాలుల
    నిహ పరముల నొంద కుండ నెది రింత్రు గదా?

    రిప్లయితొలగించండి
  9. నాశము జేసె నా నహుషు నాశము జేసె హిరణ్య కశ్యపున్
    నాశము జేసె రావణుని నాశము జేసెను కౌరవేశ్వరున్
    నాశము జేసె కంసుని వినాశము జేసెను చేది భూపతిన్
    నాశము జేసె నౌ నహము నాశము తప్పదు లొంగఁ దానికిన్.

    రిప్లయితొలగించండి
  10. ఉపకారము చేయ మనిషి
    కి మేలు కలుగు, అహంకారముచే చెడున్
    కలుగు, వెటకారముచె కీ
    డు కలుగు, సద్భావనతో మెలుగుము నరుడా

    (తప్పులుంటే క్షమించి తప్పులను ఎత్తిచూపండి)

    రిప్లయితొలగించండి
  11. అహంకార మనే అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి,
    మిస్సన్న గారికి,
    కిశోర్ కుమార్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలాకాలానికి మీ చిత్రాన్ని చూసే భాగ్యాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
    ఆ చిత్రాన్ని చూసాక ‘అక్కయ్యా’ అని కాక ‘అమ్మా’ అని పిలవాలని అనిపిస్తున్నది.
    *
    టి.యం. రవీంద్ర గారూ,
    మీ భావానికి నా పద్యానుకృతి......
    కా దహంకారమే యలంకార మెవరి
    కది దహించును మనల దావాగ్ని వోలె
    నిహపరంబుల సుఖముల నిచ్చు మనకు
    సత్పురుష సాంగత్యంబు సహనములును.
    *
    కిశోర్ కుమార్ గారూ,
    మీ పద్యంలో గణ, యతి, ప్రాసల నియమాలను పాటించలేదు. సవరణకు లొంగని విధంగా ఉంది. నిరుత్సాహ పడకండి. ప్రయత్నం కొనసాగించండి. స్వస్తి!

    రిప్లయితొలగించండి