1, జూన్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1069 (శకుని ధర్మాత్ముఁ డనఘుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శకుని ధర్మాత్ముఁ డనఘుఁడు సత్పురుషుఁడు.

17 కామెంట్‌లు:

 1. అక్ష విద్యను తెలిసిన పక్షి యనగ
  మాయ జూదము నోడించె మంత్ర శక్తి
  కౌరవుల వెన్ను గాచిన కల్ప తరువు
  శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు !

  రిప్లయితొలగించండి
 2. మాయ జూదము నాడించె మర్మ మెఱిగి
  శకుని ధర్మాత్ము డనఘుడు సత్పురుషుడు
  ధర్మరాజు చేతను ; సుయోధనుడు గెలిచె
  మాయ పాచికలను వేయ మామ శకుని

  రిప్లయితొలగించండి
 3. చలన చిత్రంబునాతడు శకుని మామ
  పవన సుతునకు గుడికట్టె భక్తుడతడు
  తోటివారికి గుంటూరు ధూళిపాళ్ళ
  శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు !

  రిప్లయితొలగించండి
 4. కూల్చె...లంకేశుఁ, బౌలస్త్యుఁ, గూళ, గళద
  శకుని...ధర్మాత్ముఁ, డనఘుఁడు, సత్పురుషుఁడు,
  రఘుకులాంబుధి సోముఁడు, రామవిభుఁడు!
  తీర్చుకొనెఁ బ్రతీకారమ్ము ధీరమతిని!!
  (గళదశకుని=దశసంఖ్యాకమైన గళములుగలవానిని=దశకంఠుని)

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  శకునిని ‘పక్షి’ అనడం, ‘జూదము నోడించె’ అనడం పొసగడం లేదు. నా సవరణలతో మీ పద్యం....
  అక్ష విద్యను తెలిసినయట్టి ఘనుడు
  మాయ జూదమున గెలిచె మంత్ర శక్తి
  కౌరవుల గాచి వారి పొగడ్త గనెను
  శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు !
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధూళిపాళ వారి ప్రస్తావనతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  ‘చలన చిత్రంబు నాతడు’ అన్నదాన్ని ‘చలన చిత్రమున నతడు’ అంటే బాగుంటుందేమో.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ‘గళ దశకుని’... వైవిధ్యమైన ప్రయత్నం మీది. పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. సకల కళా చతురుండై
  రకరకముల పోరి యిచ్చె రాజ్యము నాకున్
  నికరంబుగ మా మాతుల
  శకుని ధర్మాత్ముఁ డనఘుఁడు సత్పురుషుఁడు!!

  రిప్లయితొలగించండి
 7. జిగురు సత్యనారాయణ గారూ,
  సమస్య తేటగీతిలో ఉంటే మీరు పై మూడు పాదాలూ కందం వ్రాసారు.
  నాలుగవ పదాన్ని (సమస్యను) ఇలా మారుద్దామా?
  ‘శకునియె ధర్మాత్ము డనఘ సత్పురుషుండున్’

  రిప్లయితొలగించండి
 8. శ్రీ జిగురు సత్యనారాయణ గారు సమస్య కంద పాదము కాదు, నాల్గవ పాదమును మరొకసారి చూడగలరు

  రిప్లయితొలగించండి
 9. గురువుగారు మీ సవరణ చూడలేదు క్షమించగలరు

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
  =========*==========
  కలియుగమ్మున ధన పిచ్చి గల ఘనులకు
  శకుని ధర్మాత్ముఁ డనఘుఁడు,సత్పురుషుఁడు,
  ధర్మ రాజు దరిద్రుడు ధరణి పైన,
  వారి మార్గమందు నడువ,వైరి యనును

  రిప్లయితొలగించండి
 11. మాయ పాచికతో నాడు మర్మమెఱుగు (తోన్+ ఆడు)
  శకుని, ధర్మాత్ముఁ డనఘుఁడు సత్పురుషుఁడు
  పాండవాగ్రజునోడించి పనిచె కాన
  లకు సుయోధనుడను వాని లబ్ధికొఱకు.

  రిప్లయితొలగించండి
 12. రాయబార సమయంలో కృష్ణుడు;

  బావ! దుర్యోధనా! నాడు పంతమూని
  మాయ జూదాన జయమును మప్పె నీకు
  శకుని, ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు
  ధర్మ నందను బాధింప తగున టయ్య?

  రిప్లయితొలగించండి
 13. కౌర వాన్వయ విధ్వంస కార్య శిల్పి!
  శకుని! ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు
  ధర్మజుని మాయ నోడింప తగుదు వీవు!
  నీ మనోరధ నియతి వర్ణింప దరమె?

  రిప్లయితొలగించండి
 14. వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ధనపిచ్చి’ అన్న సమాసం దోషం.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. నిజమే సమస్యా పాదాన్ని గమనించ లేదు. క్షమించాలి. సవరణతో....

  సకల కళా చతురుండై
  రకరకముల పోరి యిచ్చె రాజ్యము నాకున్
  నికరంబుగ మా మాతుల
  శకునియె ధర్మాత్ము డనఘ సత్పురుషుండున్!!

  సకల కళలందు చతురుండు సహచరుండు
  రకరకముల జూదమునాడి రాజ్యమిచ్చె
  నికరమిదియె మా మామయె నీతిమయుఁడు
  శకుని ధర్మాత్ముఁ డనఘుఁడు సత్పురుషుఁడు!!

  రిప్లయితొలగించండి
 16. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
  ప్రణామములు!

  నందగోపుని సుతులకు నామకరణ
  మహ మొనర్పంగ నేతెంచె మానితర్షి
  విభుఁడు గర్గుం డవశ్యభావి సకల శుభ
  శకుని, ధర్మాత్ముఁ, డనఘుఁడు, సత్పురుషుఁడు.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి