17, జూన్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1085 (పానకములోని పుడుకలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పానకములోని పుడుకలు పాండుసుతులు.

29 కామెంట్‌లు:

  1. పూనకము తోడ రారాజు పూని చెప్పె
    వాదమేలయ్య వినవయ్య యాదవయ్య
    సంధి సేయము సమరమ్ము సలుప గలము
    పానకములోని పుడుకలు పాండుసుతులు.

    రిప్లయితొలగించండి
  2. ధార్తరాష్ట్రులు దుర్మతుల్ ధర్మ విముఖు
    లగుట నాశన మొందిరి యౌర! వారె
    పానకములోని పుడుకలు, పాండుసుతులు
    శాశ్వత యశమ్ము గాంచిరి సన్మతులన

    రిప్లయితొలగించండి
  3. మామ, తమ్ముఁడు, మిత్రుఁడు మామకాజ్ఞఁ
    బాలనము సేసి, నను సార్వభౌముఁ జేయ,
    జ్ఞాతులను గూల్చి, నిష్కంటకము నొనర్త్రు;
    పానకములోని పుడుకలు పాండుసుతులు! ౧

    భారతమ్మునఁ గనఁగాను గౌరవ తతి
    పానకములోని పుడుకలు! పాండుసుతులు
    కృష్ణుఁడను ఛత్రఛాయను క్షేమముగను
    జనులఁ బాలించునట్టి సజ్జనులు, ఘనులు!! ౨

    రిప్లయితొలగించండి
  4. ద్వాపర మున ధర్మమడుగంట ధర్మము నిల
    బెట్ట నా వాసు దేవుడు పెద్ద నాట
    కమ్ము నాడించ సూత్ర ధారి గను నిలిచె
    పానకములోని పుడుకలు పాండుసుతులు.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    విరుపుతో ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా అలరిస్తున్నవి. అభినందనలు.
    అయితే "ఛత్ర + ఛాయ = ఛత్రచ్ఛాయ" (తుగాగమ సంధి) అవుతుంది కదా! లేక తుగాగమం వైకల్పికమా?

    రిప్లయితొలగించండి
  6. "శీనా" శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    1వ పాదంలో గణదోషం, 3వ పాదంలో యతిదోషం ఉన్నాయి.. సవరించండి.

    రిప్లయితొలగించండి

  7. శంకరయ్య గారికి నమస్కారములు.
    ఆర్యా! మీరు తెలియ చేసిన దోషములను సవరించి ,నా పూరణను పంపుచున్నాను.
    మన్నింప గలరు. భవదీయుడు, శ్రీనివాస్ (శీనా ).

    ద్వాపర మున ధర్మము గతి దప్ప గాను,
    ధర్మమును నిల్ప, కృష్ణుడు, తాను నాట
    కమ్ము, నాడించె సారధి గాను, యందు
    పానకములోని పుడుకలు పాండుసుతులు.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీనివాస్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 3వ పాదములో గాను + అందు అనునప్పుడు యడాగమము చేసి గానుయందు అనుట సరి కాదు. పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. నా రెండవ పూరణమున "ఛత్రచ్ఛాయ"యనియే రావలయును. తుగాగమము నిత్యము. "హ్రస్వస్య ఛేపరే తుగాగమ స్యాత్" అని సూత్రము. దోషము దొరలినది. దాని నీ క్రింది విధమున సవరించుచున్నాను. దోషమును దెలిపినందులకు ధన్యవాదములు.

    భారతమ్మునఁ గనఁగాను గౌరవ తతి
    పానకములోని పుడుకలు! పాండుసుతులు
    కృష్ణుఁ డీక్షించుచుండంగ క్షేమముగను
    జనులఁ బాలించునట్టి సజ్జనులు, ఘనులు!!

    రిప్లయితొలగించండి
  10. పానకము లోని పుడుకలు పాండు సుతులు
    అంత తేలిక యాయెరా ? యార్య ! మీ కు
    పాండు సుతులను దీ టు వా రొండు లేరు
    వారు వారికే సాటిల పచ్చి నిజము .

    రిప్లయితొలగించండి
  11. "పానకము లోని పుడుకలు పాండు సుతులు
    వారు లేకుండ చెబుతాను వారి కథనె"
    అనుచు మాయజేసె నతడు అద్భుతముగ
    కేవి రెడ్డి గా రౌర! మాయావి నిజము

    రిప్లయితొలగించండి
  12. శ్రీనివాస్ గారూ,
    దోష సవరణ చేసినందుకు ధన్యవాదాలు.
    నేమాని వారి వ్యాఖ్య ననుసరించి అక్కడ "సారథిగాను నిలిచి" అని సవరిద్దామా?
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు. సవరించిన పూరణ చక్కగా ఉంది.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    "చదువరి" గారూ,
    బహుకాలానికి మామీద దయ కలిగింది. సంతోషం.
    మీరు పూరణలో చెప్పింది అక్షరాలా నిజం. పాండవులు లేని పాండవుల కథ "మాయాబజారు". అందులో ఎక్కడైనా పాండవులు కనిపిస్తే నిజంగానే "పానకంలో పుడకలు" అయ్యేవారు.
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. నగ్న సత్యము కౌరవ నాథు డాది
    పానకములోని పుడకలు , పాండు సుతులు
    ధర్మ నిరతులు యుద్ధంబు తగదటంచు
    నెంత చెప్పిన వినక తా మంతమైరి

    రిప్లయితొలగించండి
  14. శ్రీపండిత గురువులకు నమస్సులతో

    భారతమ్మున పరికింప బయలు పడెను
    మూర్ఖ దుష్టచతుష్టయమ్ము తగుననగ
    పానకములోని పుడుకలు, పాండుసుతులు.
    ధర్మ నిరతులు, జనహితుల్ ధన్యులనరె

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారికి మరియు శంకరయ్య గారికి,
    కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.

    మరియొక పూరణ :
    మధుర పానక మందురు మాన్యులు విని
    కృష్ణ లీలలు, కధ లును కృష్ణ మాయ
    గాదె పాండవుల విజయ గాధ, గారె
    పానకములోని పుడుకలు పాండుసుతులు.

    రిప్లయితొలగించండి
  16. వ్యాస విరచిత మైనట్టి భారత మున
    ధర్మ నిరతిని బోధించి ధన్యు లైరి
    పానకము లోని పుడుకలు పాండు సుతులు
    అనెడి నిందలు పలుకుట వినయ మనదు

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
    గురువు గారికి ధన్యవాదములు
    =====*======
    తిరిప మెత్తి గ్రామము లెల్ల దిరుగు చున్న
    పానకము లోని పుడకలు పాండు సుతులు
    వీరులని బల్కు చుంటిరి, వెక్కిరించ
    వలదు కురు వీరులను నేడు వాసు దేవ ।
    ======*========
    రాయభారమనుచు గాయము జేయక
    రాజ్యభాగ మిచ్చు రాజు లేడు
    కటువు గాదు పానకము లోని పుడకలు
    పాండు సుతుల కింత పట్టు వలదు

    రిప్లయితొలగించండి
  18. పానకములోని పుడుకలు పాండుసుతులు
    కౌరవులకు సైంధవునకు కర్ణునకును ;
    పాండవుల ప్రతాపము గని పగలు రేయి
    కలుగుచుండెను వారికి కనుల మంట

    రిప్లయితొలగించండి
  19. కొందరు కవి మిత్రులు పాండవులను భారత పానకంలో పుడకలుగా వర్ణిస్తున్నారు. అది సమంజసమేనా అనిపిస్తోంది. మధురమైన పానకం త్రాగుతూంటే అడ్డు వచ్చే పుల్లలుగా వారిని భావించ వచ్చునా? అది నీచోపమానం కాదా?

    రిప్లయితొలగించండి
  20. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారూ,
    బాగుంది మీ పూరణ అభినందనలు.
    *
    శ్రీనివాస్ గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చివర `వినయ మగునె" అందాం.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. ముఖ్యంగా తేటగీతి సమస్యను ఆటవెలదిగా జేసిన మీ రెండవ పూరణ ప్రశంసనీయం. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ! అటువంటి సందర్భంలో మీరు గానీ, నేమాని పండితుల వంటి పెద్దలు గానీ సరిదిద్దడంలో అనౌచిత్యం ఏమీ ఉండదని నా అభిప్రాయం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. పెద్దలకు నమస్సులు. మిస్సన్న గారి భావంతో ఏకీభవించుచున్నాను. ఈ జాతీయాన్ని ఒక మంచి పనిచేసేటప్పుడు అడ్డుతగిలే వారిని గూర్చి వాడుట జరుగును.

    రిప్లయితొలగించండి
  23. వాసు దేవుడు సభలోన పలికె రాజ!
    రాజ్య మెల్లను దోచు తంత్రమున నీకు
    నేరి వైచెడు వారలే వారు? కారు
    పానకములోని పుడుకలు పాండుసుతులు!

    రిప్లయితొలగించండి
  24. “ఇక్కడ పానకంలో పుడక " అనే దానిని ఒకరి ఆనందానికి అడ్డు తగిలేది అనే అర్థంలో తీసుకున్నట్లయితే ( సమస్యాపూరణ పరంగా ) సరిపోతుందని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  25. మాన్య రవీందర్ గారి భావం కూడ కొంత సమంజసమే. కాని వ్యక్తి తాను ప్రవర్తించకూడని పద్ధతిలో ప్రవర్తించుచూ అందులో ఆనందం పొందుచున్నాను కావున అడ్డు తగులుట సరిగాదనుట సమంజసము కాబోదు గదా! ఉదా: త్రాగుబోతు/తిరుగుబోతు. కావున ఇది విచక్షణపై ఆధారపడి ఉన్నదని నా వ్యక్తిగ అభిప్రాయము మాత్రమే. ఎవ్వరినీ నొప్పించుటకు కాదని నామనవి.

    రిప్లయితొలగించండి
  26. ఎవరైనా ఒక పనిని చేస్తున్నప్పుడు ( మంచిదైనా చెడుదైనా ) మరొక డెవడైనా అడ్డు తగిలితే “అబ్బా ! వీడు పానకంలో పుడకలా వచ్చిపడ్డాడు ! " అని విసుక్కోవడం పరిపాటి. కాని నిజానికి మిస్సన్న గారు మరియు శర్మ గారు అభిప్రాయ పడినట్లు ఇది ఒక జాతీయం. దాని అర్థం ఉదాత్తం.

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి