11, జూన్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1079 (ధర్మసుతునకుఁ బాంచాలి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ధర్మసుతునకుఁ బాంచాలి తనయ గాదె.

17 కామెంట్‌లు:

 1. క్రమాలంకార పూరణ.......

  నిత్య ధర్మంబు శాతియు నేత్ర యుగము,
  పంచభర్తృకలుండిన ప్రథితురాలు,
  మనదు కోడలు వేరొక మాతృమూర్తి,
  ధర్మరాజుకు, పాంచాలి, తనయ గాదె.

  రిప్లయితొలగించండి
 2. అయ్యా! శుభాశీస్సులు.
  మీరిచ్చిన పాదములో వ్యాకరణ దోషము కలదు. ధర్మరాజునకు అని ఉండవలెను కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. ధర్మ మెఱిఁగిన రాజుకుఁ దనదు ప్రజలు
  స్వీయ సంతానమౌనట్లు, జాయ యయ్యుఁ,
  బ్రజలలోఁ దాను నొకతెయై వఱలు కతన,
  ధర్మరాజుకుఁ బాంచాలి తనయ గాదె?

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు. సవరిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమానివారికి ధన్యవాదములు. వ్యాకరణ దోషమును సవరించిన పిదప నా పూరణము...

  ధర్మ మెఱిఁగిన నృపతికిఁ దనదు ప్రజలు
  స్వీయ సంతానమౌనట్లు, జాయ యయ్యుఁ,
  బ్రజలలోఁ దాను నొకతెయై వఱలు కతన,
  ధర్మ సుతునకుఁ బాంచాలి తనయ గాదె?

  రిప్లయితొలగించండి
 6. మధ్యాక్కర:

  ధర్మసుతునకు బాంచాలి తనయగాదే యనుటెట్టి
  ధర్మమో యని యెంచ నేల? తనయ యనెడు పదమ్మునకె
  మర్మార్థ మిడిరి పాండవులు మహినుండి యజ్ఞాతముగను
  ధర్మమే యంత వారలకు త్రాతయై యలరారె బళిర!

  రిప్లయితొలగించండి
 7. ప్రియమగు పత్నియై దాను ప్రేమగురియు
  ధర్మసుతునకుఁ బాంచాలి; తనయ గాదె
  ద్రుపద రాజునకును, చెల్లి ధృష్టద్యుమ్ను
  నకును, కుంతి మెచ్చిన యట్టి నారి దానె.

  రిప్లయితొలగించండి
 8. ఆలి యగునార్య ! నిజముగ యమసుతుడగు
  ధర్మ సుతునకు బాంచాలి , తనయ గాదె
  కుంతి భోజున కీ యమ కుంతి దేవి
  ధర్మజాదులు మిగులను ధర్మ విదులు

  రిప్లయితొలగించండి
 9. ధర్మ మెరిగిన వ్యాసుని మాట గొనుచు
  ధర్మ రాజాదులు గనిన ధర్మ మార్గ
  మదియె తమ్ముని భార్యయై మసలు నపుడు
  ధర్మ సుతునకుఁ బాంచాలి తనయ గాదె?

  రిప్లయితొలగించండి
 10. శ్రీ షీనా గారూ!
  శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. 1వ పాదములో యతి నియమము పాటింపబడ లేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. మర్మ మెరిగిన వ్యాసుని మాట గొనుచు
  ధర్మ రాజాదులు గనిన ధర్మ మార్గ
  మదియె తమ్ముని భార్యయై మసలు నపుడు
  ధర్మ సుతునకుఁ బాంచాలి తనయ గాదె?

  ఆర్యా ! పండిత నేమాని వారికి అనేక నమస్కారములు. మర్మ అని రాసినపుడు యతి సరిపోతుంది మరియు ధర్మ రహస్యము మర్మమినదే కావున సందర్భోచితంగా ఉంటుంది అనే భావన తో మర్మ అని మార్చినాను. చిత్తగించగలరు.

  రిప్లయితొలగించండి
 12. తత్తర పడెడి బాలుఁడు నత్తి తోడ
  కంఠము వణక "తన జాయ గాదె" యనుచు
  పలుక నెంచి"జా"ను వదిలి పలుకె నిటుల
  ధర్మసుతునకుఁ బాంచాలి తనయ గాదె!!

  రిప్లయితొలగించండి
 13. ప్రియమగు పత్నియై దాను ప్రేమగురియు
  ధర్మసుతునకుఁ బాంచాలి; తనయ గాదె
  ద్రుపదునకు, ప్రాణదాయి యా ద్రోణ పుత్రు
  నకును, కుంతి మెచ్చిన యట్టి నారి దానె.

  రిప్లయితొలగించండి
 14. ధర్మ మెఱుగంగ నితరులు తనకు సాటె ?
  తమ్మునకు భార్య యరయగ తనయ యనగ
  గరము ప్రేమతో భీముని కదిసి యుండ
  ధర్మసుతునకుఁ బాంచాలి తనయ గాదె.

  రిప్లయితొలగించండి
 15. యజ్ఞ కుండము నందుండి యాజ్ఞ శీలి
  పంచ భర్తృక యైనట్టి పరమ సాధ్వి
  ద్రోవదను పేరు బడసిన ద్రుపదు డనెడి
  ధర్మ సుతునకు బాంచాలి తనయ గాదె !

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులకు నమస్కౄతులు.
  కొద్ది రోజులుగా అనారోగ్యం, ఆపై తప్పని సరిగా ఊళ్ళు తిరగడం కారణంగా పూరణలపై, పద్యాలపై, వ్యాఖ్యలపై వెంటవెంటనే స్పందించలేక పోతున్నాను. ఈరోజు మా మనుమడి నామకరణోత్సవము. అదికూడా మా కోడలి ఊళ్ళో.. రేపటి నుండి తప్పక అందుబాటులో ఉంటాను. మన్నించండి..
  నిన్నటి సమస్యకు చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు...
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  శీనా శ్రీనివాస్ గారికి,
  జిగురు సత్యనారాయణ గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి