1, జూన్ 2013, శనివారం

పద్య రచన - 359 (తత్త్వమసి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“తత్త్వమసి”

11 కామెంట్‌లు:

  1. పదములున్నవి మూడు వర్ణముల్ నాలుగు
    ....భావ మత్యధికమై పరగుచుండు
    నదె మహావాక్యమై యాచార్యు నుపదేశ
    ....సారమై నీవె ప్రజ్ఞానమైన
    చైతన్య నిధివంచు సామవేదములోని
    ....తత్త్వమసి మహాద్భుత వచనమ్ము
    సంగదోషము చేత సహజతత్త్వమ్మును
    ....మరచిన జీవున కెరుక గూర్చు
    దేహధారివి నీవు నీ దేహభ్రాంతి
    వీడుమా ఆత్మ వీవంచు వేడ్కమీర
    తత్త్వ మెరిగి వివేక సాధనమునూని
    పొందుమా సద్గతుల నంచు బోధ సేయు

    రిప్లయితొలగించండి
  2. ఎన్నియున్నగాని యిలలోన మనుజుడా !
    నిన్ను నీవు తెలిసి నిజముగాను
    "తత్వమసి " తలచుచు తపనతో తగినట్లు
    బ్రతికి పొంద వలయు పరమ పదము

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
    శ్రీ నేమాని గురువర్యుల సీస పద్యము జదువగ "తత్త్వ మసి "కర్థము తెలిసినది. మంచి విషయము తెలిపి నందులకు ధన్యవాదములు
    =========*==========
    మాయ జగతి నందు దిరిగి హీయము గను
    దేహ భ్రాంతి తోడ జనులు ధీనులయ్యె
    "తత్త్వ మసి " కర్థము దెలియ ధనము వనము
    వీడి పరమ పదము నొందు వేడ్క తోడ.

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    ‘తత్త్వమసి’ యొక్క గూఢార్థాన్ని ఇంత వివరంగా ఛందోబద్ధం చేసి మాకు ప్రసాదించినందుకు మీకు నా పాదాభివందనాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. నా యందు నత్యాదరమును జూపించిన శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  7. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి అంశము "తత్త్వమసి" చాల నిగూఢమైన పరమార్థమును తెలియజేసే మహావాక్యము. ఈ విషయమును ప్రతిపాదించిన శ్రీ శంకరయ్య గారికి శుభాభినందనలు. ఈ మహావాక్యములో 3 పదములు ఉన్నవి. తత్ అనగా ఆ పరబ్రహ్మము; త్వం అనగా నీవు; అసి అనగా అయియున్నావు - అని గురువు శిష్యునికి ఉపదేశము చేయు సందర్భము లోనిది. మిత్రులందరు మంచి భావముతో పద్యములను వ్రాయగలరని నమ్ముచున్నాను.

    శ్రీ వరప్రసాద్ గారికి ఇతర మిత్రులకు శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. తత్త్వమసి కి పండిత నేమాని వారి వ్యాఖ్య గొప్పగా ఉంది.
    దేహభ్రాంతి అనుచోట హ గురువు అవుతుందేమోనని సందేహము. ఒకవేళ నేను పొరబాటు పడిన యెడల పెద్దలు మన్నింపగలరు.

    భారతావనిలోని పరమయోగిజనులు
    ....మానవాళి కొఱకు మర్మమెల్ల
    చిన్ని పదమునందు సిద్ధపఱచి నేను
    .......యెవరిననుచు ప్రశ్న నిటుల వేసి
    కొనుచు బ్రహ్మాండమ్ము నేను గానె
    ......యనెడు జ్ఞానపు లబ్ధి యరసి యపుడు

    మానవాళి ద్వంద్వ మార్గముఁ జేరక
    నుండు నటుల బోధ నొసగి చనిరి,
    వందనములు కోటి వారికి నొసగిన
    తప్పుకాదు మనదు ధర్మమదియె.

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీదేవి గారూ,
    ‘దేహభ్రాంతి’ అన్నప్పుడు ‘హ’ మన అవసరాన్ని బట్టు లఘువు కావచ్చు, గురువు కావచ్చు.
    మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
    ‘నేను + ఎవరిని’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు.
    సీసపద్యం ఐదవ పాదంలో గణదోషం..

    రిప్లయితొలగించండి
  10. అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీరు సీస పద్యమును 3 పాదములతోనే సరిపెట్టేసేరు. 4వ పాదము కూడా చేర్చితే నియమోల్లంఘన కాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. పెద్దలు మన్నించాలి.
    కొంచెము సమయము దొరికిన మానరాదను హడావుడి లో పొరబాటు జరిగినది.


    భారతావనిలోని పరమయోగిజనులు
    ....మానవాళి కొఱకు మర్మమెల్ల
    చిన్ని పదమునందు సిద్ధపఱచి తాన
    .......దెవరుననుచు ప్రశ్న నిటుల వేసి
    కొనుచు, బ్రహ్మాండమ్మనగ తానెయగుదునే
    ......యనెడు జ్ఞానపు లబ్ధి యరసి యపుడు
    స్వీయ సాక్షాత్కార సిద్ధిని పొందగ
    .........హితవునుఁ బలుకగ నెంచి విపుల

    మానవాళి ద్వంద్వ మార్గముఁ జేరక
    నుండు నటుల బోధ నొసగి చనిరి,
    వందనములు కోటి వారికి నొసగిన
    తప్పుకాదు మనదు ధర్మమదియె.

    రిప్లయితొలగించండి