18, జూన్ 2013, మంగళవారం

పద్య రచన - 376 (శాపము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
"శాపము"

21 కామెంట్‌లు:

 1. శాపమే దశరథ భూపాలు పాలిట
  ....వరమయి పుత్రుల బడసె నకట
  పొంది శాపమహల్య భువి తపమ్ము నొనర్చి
  ....శ్రీరామ కరుణా విశేషమొందె
  శుకుడు విప్రుం డగస్త్యుని శాపమున నల్గి
  ....రామ దర్శనమొంది రహి జెలంగె
  దనువు కబంధు డయ్యెను శాపమును బొంది
  ....పిదప రాముని కృపా విభవమొందె
  కోపమున నిచ్చుచుందురు శాపమకట
  కాని తగ్గు దపశ్శక్తి దాని వలన
  శాప మిడు కొందర కతికష్టములు కాని
  వరములగు కొందరకు శాపఫలము లవని

  రిప్లయితొలగించండి
 2. పండిత నేమాని వారూ,
  శాపములే వరములుగా రూపాంతరం చెందిన విధానాన్ని మనోహరంగా వివరిస్తూ మంచి పద్యం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 3. అయ్యా, మీ పద్యము బాగున్నది.
  శుకుడు విప్రుం డగస్త్యుని శాపమున నల్గి....
  ఈ విషయము గురించి తెలియదు. వీలున్నచో క్లుప్తముగానైన తెలియజేయగలరు.

  శాపముఁ దీర్చగ నొకపరి
  పాపడు కృష్ణుడు కనులకు పంటగ లీలన్
  జూపుచు దామోదరుడను
  రూపమున నేడ్చుచు వలవల రోటిని లాగెన్.

  రిప్లయితొలగించండి
 4. శాపము లిత్తురు పడతులు
  శాపము లవి గ్రుచ్చు కొనును చాపముల వలెన్
  పాపములు సేయ కునికిని
  శాపములను బాయ వచ్చు శ్రవణ కుమారా !

  రిప్లయితొలగించండి
 5. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  నేను ప్రస్తావించిన శుకుని వృత్తాంతము శ్రీమదధ్యాత్మ రామాయణము లోనిది. శుకుడు అనెడి బ్రాహ్మణుడు అత్యంత నిష్ఠాపరుడు. అతడు దేవతలకు ప్రియము జేయుటచేత వజ్రదంష్ట్రుడను రాక్షసునకు వానిపై అసూయ కలిగెను. ఒకనాడు శుకుడు అగస్త్య మహర్షికి తన యింట ఆతిథ్యము నిచ్చెను. ఆ సమయమున వజ్రదంష్ట్రుడు మాయావిగా వచ్చి శుకుని భార్య రూపములో ఆ అగస్త్య మహర్షికి నరమాంసమును వడ్డించెను. అంతట అగస్త్యుడు శుకుని శపించెను. శుకుడు అమాయకుడు కావున అగస్త్య మహర్షిని ప్రార్థింపగా అగస్త్యుడు అంతయును దివ్య దృష్టితో జూచి అందులో శుకుని తప్పు లేదని గ్రహించి శాప విముక్తిని తెలిపెను. పిదప నొకనాడు రావణుడు శుకుని తన దూతగా సుగ్రీవుని కడకు పంపెను. ఆ సమయములో సుగ్రీవుడు శ్రీరాముని సన్నిధిలో నుండెను. శుకుడు శ్రీరాముని దర్శనమును పొంది ఆతని అనుగ్రహమును కూడ బడసి శాప విముక్తుడయ్యెను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. లక్ష్మీదేవి గారూ,
  నలకూబర, మణిగ్రీవులనే గంధర్వుల శాపవిమోచన వృత్తాంతాన్ని చెప్పారు. బాగుంది. అభినందనలు.
  నాల్గవ పాదంలో గణదోషం. నా సవరణ...
  ‘రూపమ్మున నేడ్చుచు నొక రోటిని లాగెన్.’
  *
  పండిత నేమాని వారూ,
  మీరు చెప్పిన ‘శుకుని’ వృత్తాంతం నాకూ తెలియనిదే. వివరించినందుకు ధన్యవాదాలు
  లక్ష్మీదేవి గారి సందేహాన్ని నివృత్తి చేయడానికి నేను ‘పూర్వగాథాలహరి’ చూసాను. అందులో ఇలా ఉంది.
  శుకసారణులు -
  రావణుని చారులు. సేనాసమేతుడై విడిసియున్న సుగ్రీవుని కడకు వీరు వచ్చి రాముని విడిచిరమ్మని చెప్పిరి. రావణునితో యుద్ధము చేయకుమని బోధించిరి. మరల రామ బల మెంతయున్నదో చూచుటకు వానరరూపమున వచ్చిరి. వీరిని విభీషణుడు గుర్తించి పట్టించెను. వానరులు వీరిని సంహరింపబోయిరి. కాని శ్రీరాముడు వీరిని చంపవలదని చెప్పి కాపాడెను.
  వృకుడనువాని తండ్రి యైన శుకుడను దైత్యుని గురించి భాగవతములో చెప్పబడినది.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. శుకుని గురించి ఈ రెండు అంశములు ఆధ్యాత్మరామాయణమునందే ఉన్నవి.ఇప్పుడే చూచినాను.
  అగస్త్యుడు దివ్యదృష్టితో చూసి శాపవిమోచనము చెప్పునపుడే రామదర్శనము అయిన పిదప రావణునకు తత్త్వమును ఉపదేశించగలవని చెప్పుట గలదు.
  శుకుడు రాముని దర్శనము చేసి మరలి లంకకు వచ్చి రావణునకు రామసేనను అద్భుతంగా వర్ణించి హితోపదేశము చేయును. సీతాదేవిని రామునకు అప్పగించుమని చెప్పెను.
  ఆ పిమ్మట శాపము తొలగి, వానప్రస్థ జీవనము గడుపుచుండును. అచ్చటనే వజ్రదంష్ట్రుడు చేసిన మోసము అంతా శుకుని పూర్వచరిత్రగా చెప్పబడినది. వానరులు సంహరింపబోగా రాముడు వారించి శుకుని కాపాడుటయు చెప్పబడినది.
  మీరలు శ్రద్ధతో వివరించినందుకు ధన్యురాలను.

  రిప్లయితొలగించండి
 8. నారదుడు శాప మిడగను
  నారాయణు డవతరించె నారాముని గా
  పోరాడి గెలిచి చంపగ
  నారావణు మరణ మొంద నవనికి మేలౌ !

  రిప్లయితొలగించండి
 9. వసువుల శాపము దొలగగ
  వసుధను తానవత రించి వాహిని గంగై !
  పసి వారిని దయ లేకను
  నసువులు బాయగను గంగ నాకము బంపెన్ !

  రిప్లయితొలగించండి
 10. శోకం నుండుదయించె శాపమది యే శ్లోకంబు గా మారె వా
  ల్మీకా రాముని గాధ నే యెదలు తల్లీనంబు గావించె నా
  నా కావ్యార్ధములందు నింపుచును తా నా రామ తత్వంబు నీ
  లోకం బందున ధర్మమర్మముల నాలోకించు మార్గంబు గా

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ షీనా గారూ! శుభాశీస్సులు.
  మీరు శార్దూల పద్యమును వ్రాసేరు. శోకం అనరాదు. శోకము అనాలి. నుండుదయించె అనరాదు. నుండి యుదయించె అనాలి. ఈ విధముగా పద్యమును పరిశీలించి సరిచేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

  కోపమున్ జూపి శాపంబు తాపసాది
  నిగ్రహానుగ్రహ సమర్థులగ్రసరులు
  భూసురులు వేదమూర్తులు పూజ్యులిడగ
  శాపమె వరముగన్ మారి శాంతి సౌఖ్య
  లోక కళ్యాణ మిచ్చె భూలోక మందు.

  రిప్లయితొలగించండి
 13. లక్ష్మీదేవి గారి సందేహంతో శ్రీ నేమాని పండితులవలన, శ్రీ శంకరార్యులవలన ముఖ్య విషయములు తెలిసినవి.పున:గ్రంథ పరిశ్రమద్వారా లక్ష్మీ దేవిగారి వివరణకు అందరికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ షీనా గారి భావముతో నాదొక చిన్న ప్రయత్నము:

  శోకవ్యాకుల చిత్త సంజనితమై శ్లోకంబు తొల్దొల్త వ
  ల్మీకోద్భూత మునీంద్రు శాపమగుచున్ పృథ్విన్ వెలుంగొందె శో
  భాకీర్ణాంచిత రామగాథ కదియే ప్రారంభమున్ గూర్చె సు
  శ్లోకంబై తనరారె నా సుకృతి ముల్లోకంబులన్ వేదమై

  రిప్లయితొలగించండి
 15. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  శ్రీనివాస్ గారూ,
  చక్కని శార్దూలాన్ని వ్రాసి అలరింప జేసారు. అభినందనలు.
  నేమాని వారి సవరణలను పాఠాలుగా స్వీకరించండి.

  రిప్లయితొలగించండి

 16. పండిత నేమాని వారికి నమస్కారములు మరియు కృతజ్ఞతలు తో సవరించిన పద్యమును పంపించు చున్నాను.
  శంకరయ్య గారికి మీకు సర్వదా ఆత్మీయ వందనాలు తెలియ చేసుకుంటూ నా పూరణ :

  శోకమ్మాయెను శాపమప్పుడదియే శ్లోకంబు గా మారె వా
  ల్మీకా రాముని గాధ నే యెదలు తల్లీనంబు గావించె నా
  నా కావ్యార్ధములందు నింపుచును తా నా రామ తత్వంబు నీ
  లోకం బందున ధర్మమర్మముల నాలోకించు మార్గంబు గా

  శోకమ్మాయెను శాపమప్పుడదియే అని సవరించిన శార్దూలము సరిపోతుందని నా అభిప్రాయము. భవదీయుడు శ్రీనివాస్ (శీనా ).
  రిప్లయితొలగించండి
 17. శ్రీ షీనా గారూ!
  శుభాశీస్సులు.
  మీరు సవరించిన మీ పద్యము చాల బాగుగ నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. షీనాగారి పద్యం:

  .............శ్లోకంబు గా మారె వా
  ల్మీకా రాముని గాధ నే.............
  ...........................
  ...........................

  ఇక్కడ యడగమవిధి అని నా అనుమానం.

  వాల్మీకి + ఆ రాముని => వాల్మీకి యా రాముని

  విజ్ఞులు పరిశీలించగలరు.

  శంకరయ్యగారూ, షీనాగారి వ్యాఖ్యలో పద్యం క్రింద అనేకానేక ఖాళీ లైన్లు ఉన్నాయి - దయచేసి వీటిని తొలగించండి. లేకపోతే టపా పేజీ‌చదవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది!

  రిప్లయితొలగించండి