25, జూన్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1093 (కమ్మలు మోకాళ్ళు దాఁకి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.
(తెలుఁగులో సమస్యాపూరణలు గ్రంథము నుండి)

29 కామెంట్‌లు:

 1. ఇమ్ముగ గుడిసెను వేయుచు,
  రమ్మని నా మిత్రుఁడనఁగ, రంజిలుచును నే
  నమ్మహిఁ జన, గోడ నిడిన
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!

  రిప్లయితొలగించండి
 2. madhyaakkara:

  మిత్రులారా! పార్వతీ దేవి అభ్యంజన స్నానము చేయునపుడు ఆమె ఆభరణములు నృత్యము చేసెనంట. ఆ సంఘటనలో:

  సొమ్ముల నన్నిట దీసి శుచిగ స్నానము చేయ బోయె (సొమ్ములు = ఆభరణములు)
  నమ్మ పార్వతి యంతలోన నాభరణములు నృత్యమ్ము
  నిమ్ముగా సేయుచునుండె నిదియేమి వింతని జూడ
  కమ్మలు మోకాళ్ళు దాకి ఘలు ఘలు మనియెన్ మృదువుగ

  రిప్లయితొలగించండి
 3. గుండు మధుసూదన్ గారూ,
  ‘తాటియాకులు’ అనే అర్థంలో చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ ‘మధ్యాక్కర’ పూరణము మనోహరంగా ఉన్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ఆర్యా ! ఈ సమస్యను ఇదివరలో ఇచ్చినారు...నా మరియొక పూరణ...

  అమ్మెత్తు కొనియె బిడ్డను
  ఇమ్ముగ తన మెడల మీద , నిటు నటు కాళ్ళన్
  కమ్మగ పలుకుచు కదపగ
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఇంతకు ముందు ఇచ్చినట్టు నాకైతే గుర్తు లేదు. సందేహం వచ్చి ‘గూగులమ్మ’ను అడిగితే ‘Your search - కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్. - did not match any documents.’ అన్నది.
  బిడ్డ మోకాళ్ళకు తల్లి కమ్మలు తాకినవన్న మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
  ‘అమ్మ + ఎత్తుకొనియె’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘బిడ్డను + ఇమ్ముగ’ అన్నప్పుడు సంధి జరగాలి. నా సవరణ.... ‘అమ్మ సుత నెత్తుకొనెనట/యిమ్ముగ...’
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణలో ‘వింత + అని’ అన్నప్పుడు సంధి రాదు కదా.. ‘ఇది యేమి వింత యనంగ..’ అంటే ఎలా ఉంటుందంటారు?

  రిప్లయితొలగించండి
 6. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  మీ సూచనకు సంతోషము. అలగే పాటించుదాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. మాస్టరుగారూ ! ధన్యవాదములు..మీరు చూపిన సవరణతో..

  అమ్మ సుత నెత్తుకొనెనట
  యిమ్ముగ తన మెడల మీద , నిటు నటు కాళ్ళన్
  కమ్మగ పలుకుచు కదపగ
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.

  అమ్మడికి పాలనిచ్చుచు
  నమ్మయె తా పొట్టమీద నటు నిటు ముద్దుల్
  కమ్మగనీయగ బిడ్డకు
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.

  రిప్లయితొలగించండి
 8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండవ పూరణ కూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  ‘తాన్ + పొట్టమీద’ అన్నప్పుడు ‘తాఁ బొట్టమీద’ అవుతుంది.

  రిప్లయితొలగించండి
 9. మాస్టరుగారూ ! ధన్యవాదములు..మీరు చూపిన సవరణతో..


  అమ్మడికి పాలనిచ్చుచు
  నమ్మయె తా బొట్టమీద నటు నిటు ముద్దుల్
  కమ్మగనీయగ బిడ్డకు
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.

  రిప్లయితొలగించండి
 10. గురువు గారు,
  నాకూ గుర్తుంది. వెతికితే దొరికింది.
  ఇదిగోండి లంకె.

  http://kandishankaraiah.blogspot.in/2011/06/85.html

  రిప్లయితొలగించండి
 11. అమ్మలు గ్రొత్తవి కొనగా
  కమ్మలు , నవి వదులు నయ్యి కదులుచు మిగులన్
  నిమ్ముగ పైకిని క్రిందకు
  కమ్మలు మోకాళ్ళు దాకి ఘులు ఘలు మనియెన్

  రిప్లయితొలగించండి
 12. లక్ష్మీదేవి గారూ,
  ధన్యవాదాలు.
  అది "చమత్కార పద్యాలు" శీర్షికలో ఉండడం వల్ల నా దృష్టికి రాలేదు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,

  అందాల పోటిలో అమ్మడు ( పేరు యమున ) ధరియించిన పెద్ద కమ్మలు జూచిన నిర్వాహకులు ప్రధమ బహుమతి నిచ్చిరి
  ======*=======
  అమ్మడు ధరియించి నడువ
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.
  రమ్మని బిలచి బహుమతిగ
  సొమ్మును, చిత్ర పటమిచ్చె సూర్య తనయకున్ ( యమునకు )

  రిప్లయితొలగించండి
 14. శృంగార రసాత్మకముగా నీ పూరణ:

  కమ్మని రతిలీలలలో
  నిమ్ముగ నొక జంట యొడలి నెరుగక దేలన్
  గ్రమ్మిన యా మైకములో
  కమ్మలు మోకాళ్ళు దాకి ఘలు ఘలు మనియెన్

  రిప్లయితొలగించండి
 15. అమ్మాయికి నప్పెను చెవి
  కమ్మలు ; మోకాళ్ళు దాకి ఘలుఘలు మనియెన్
  అమ్మడికి చేతి గాజులు
  " అమ్మా ! " యని పరుగు లిడుచు యక్కున జేరన్ !

  రిప్లయితొలగించండి
 16. బొమ్మకు ధగధగ మెరిసెడు
  సొమ్ములు దట్టించి పెట్ట సోకుకు, ముద్దుం
  గుమ్మలు ముట్టన్ పైబడి
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!

  రిప్లయితొలగించండి
 17. కుమ్మెను నిర్భయ పులిచం
  దమ్మున కామాంధునికడు ధైర్యముతోడన్
  గ్రమ్మిన మైకము తొలగన్
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!

  రిప్లయితొలగించండి
 18. రమ్మని పిలువగ తనయుని
  నెమ్మిని పరుగిడుచు వ్రాలె నేరుగ యొడిలో 1
  గ్రమ్మన ముద్దిడ కౌగిట
  కమ్మలు మోకాళ్ళు దాకి ఘలు ఘలు మనియెన్ !

  రిప్లయితొలగించండి
 19. వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ తాజా పూరణ సరసంగా ఉంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. ఇమ్మగు ప్రత్తి పొలంబున
  కొమ్మలు తగులుచు నడవగ కూరిమి మడిలో
  చిమ్ముచు రెడ్లును కాపులు
  కమ్మలు, మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్!!

  రిప్లయితొలగించండి
 21. జిగురు సత్యనారాయణ గారూ,
  "ప్రత్తి కొమ్మలు" ఘలుఘల్లు మన్నాయా? వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. తమ్ముడు ప్రేమగ దెచ్చిన
  కమ్మలు ధరియించ బోవ కరమున జారన్
  తమ్మెల నుండక వడిగా
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్

  రిప్లయితొలగించండి
 23. సహదేవుడు గారూ,
  జారి మోకాళ్ళమీద పడిన కమ్మలు... బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. అమ్మల కునమ్మ దయజూ
  పమ్మ యడుగిడగను గన్న పద్మ వదన తా
  నమ్మకు నమస్కరించన్
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!

  రిప్లయితొలగించండి
 25. శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. అమ్మడు టీవీ జూడగ,
  ధమ్మని పడ్డట్టి బల్లి తాకగ కాళ్ళన్
  ఝమ్మని ముడువంగ, చెవుల
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్

  రిప్లయితొలగించండి


 27. అమ్మాయి మదిజల్లనగన్
  చుమ్మా కోరగ పెనిమిటి కొంగెట్టుకున
  న్నమ్మీ !తారాడుచహో
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. అమ్మాయి నాట్య మాడగ
  గమ్మున నొక కాలు జారి గంతుల లోనన్
  ధమ్మని కూలం బడగా
  కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్

  రిప్లయితొలగించండి