10, జూన్ 2013, సోమవారం

పద్య రచన - 368

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(కన్నడ బ్లాగు 'పద్యపాన' నుండి)

8 కామెంట్‌లు:

 1. పూవులతోడ చెల్మియును, పొందుగ పక్షులతోడనాటలున్,
  భావుకమైన మానసము, పల్లవ కోమలమైన మాటలున్,
  దేవునిపైన నమ్మకము, దేవుని సృష్టికి ప్రేమ పంచుటల్,
  జీవుల కిచ్చు శాంతమును, చెల్లవు నాడిక కోపతాపముల్.

  రిప్లయితొలగించండి
 2. చిన్నది, యందచందముల జిందెడు లేత వయస్సు మొగ్గ య
  ట్లున్నది, లౌకికంబులగు నూహ లెరుంగని ముద్దరాలి కా
  కన్నులలో నమాయకమె కాని మరేమియు లేదు నేస్తముల్
  చిన్న శకుంతముల్, లలన జీవితమొప్పుత సౌఖ్యవంతమై

  రిప్లయితొలగించండి
 3. పడుచు పిల్లదె జూడుడు పావనాంగి
  కోడి పెట్టలు నొక వైపు నడచు చుండ
  పాత్ర నొకదాని బట్టుకు పర వశించి
  చేయు చుండెను జింతన సీత గూ ర్చి .

  రిప్లయితొలగించండి
 4. కుక్కుట మంటప మందున
  మిక్కుటముగ మాలలల్లి మీరిన భక్తిన్ 1
  చక్కగ కన్నియ లందరు
  మక్కువగా కొలిచి నంత మాధవు మెచ్చన్ !

  రిప్లయితొలగించండి
 5. తెలుగు దనమ్ము ప్రోవు బడి తీరిచి దిద్దిన రీతి నున్నదీ
  కలువల బోలు కండ్లు గల కన్యక మల్లెల మాల నల్లుచున్,
  కులుకుచు నుండ చెంగటను గువ్వలు, చూచెడి తండ్రి రాకకై
  వెలుపలి వైపు, డెందమున విందొనరించు వివాహ వార్తకా?

  రిప్లయితొలగించండి
 6. పల్లియ కన్నియ చూడుడు
  మల్లెలనే కట్టుచుండె మాలగ, నెదుటే
  అల్లన మెల్లన తిరిగెడు
  తెల్లనిపక్షులనుజూచి తేటగ నవ్వెన్.


  రిప్లయితొలగించండి
 7. శ్రీపండిత నేమాని గురువులకు, శంకరార్యులకు, అన్న మిస్సన్నగార్కి బ్లాగు మిత్రులందరికీ నమస్సులతో

  ముగ్ధ మోహన రూపాన ముదము తోడ
  పావురమ్ములు తెల్పగ పాల బాల
  మనసు దోచిన చినవాని మాట తలచి
  మల్లె మాలల నల్లుచు మదిని మురిసె.

  రిప్లయితొలగించండి
 8. అందమైన చిత్రాన్ని చూచి స్పందించి మనోహరంగా పద్యరచన చేసిన కవిమిత్రులు...
  లక్ష్మీదేవి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  మిస్సన్న గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి