30, జూన్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1098 (శివుఁడు దశరథునకు)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శివుఁడు దశరథునకు చిన్నకొడుకు.

19 కామెంట్‌లు:

 1. గంగ నెత్తిన గల ఘనుడెవ్వడోచెప్పు
  రాముడెవరి సుతుడు ప్రేమ మీర
  సరిగ నేమగు మరి శతృఘ్ను డతనికి
  శివుఁడు- దశరథునకు- చిన్నకొడుకు.

  రిప్లయితొలగించండి
 2. మధ్యాక్కర:

  తలపగ పొరుగింటి శివుడు దశరథునకు చిన్న కొడుకు
  లలిత యా శివునికి జెల్లి రాముని గృహిణియై యొప్పు
  కలరు వారికి మంచి పుత్రికలు వాణియును భార్గవియును
  నలరుచున్నది ముదంబెసగ నా కుటుంబము సంతతంబు

  రిప్లయితొలగించండి
 3. రామ నామ మంత్ర రాజ హృదయమును
  పూర్తిగా నెరిగిన ముక్తి దాత
  శివుఁడు;; దశరథునకు చిన్నకొడుకగు సౌ
  మిత్రి రామ బింబ మే సరి గన!

  రిప్లయితొలగించండి
 4. సద్గుణాంచితుండు శత్రుఘ్నుఁ, డెన్నఁగ
  మహిత యశుఁడు, సుజన మాన్యుఁ డతఁడు,
  హరికి ముద్దుఁ దమ్ముఁ, డతఁడెపో కరుణను
  శివుఁడు, దశరథునకుఁ జిన్న కొడుకు!

  రిప్లయితొలగించండి
 5. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి అభినందనలు. మీ క్రమాలంకార పూరణ బాగుగనున్నది. శత్రుఘ్నుడు అని వ్రాయాలి - శతృఘ్నుడు అని కాదు.

  2. శ్రీ చంద్రశేఖర్ గారికి అభినందనలు. మంచి విరుపును చూపించేరు. పూరణ ప్రశస్తముగా నున్నది.

  3. శ్రీ గుండు మధుసూదన్ గారు: అభినందనలు. శత్రుఘ్నుని కరుణ వైభవమును శివునితో సమానముగా వర్ణించేరు. చాల బాగుగనున్నది. ప్రశంసలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. గురుతుల్యులు పండిత నేమానివారికి నమస్కృతులు, ధన్యవాదములు. నా పూరణము తమరి ప్రశంసల నందినందుల కెంతయు నానందముగ నున్నది. ధన్యుఁడను.

  రిప్లయితొలగించండి
 7. శివుడు దశరథునకు చిన్నకొడుకుకాదు
  గాన కోడలమ్మ కాదుగిరిజ
  కరిముఖుండుజూడ కాదుగామనుమండు
  ఎవరికెవరుతండ్రి యెఱుగతరమె !!!

  రిప్లయితొలగించండి
 8. దివిజ గంగ మ్రోయు చిద్విలాసుడెవండు?
  శ్రవణుఁడెవరికిచ్చె శాపమపుడు?
  సరిగ దశరథునకు శత్రుఘ్నుఁడేమగు?
  శివుఁడు,దశరథునకు, చిన్న కొడుకు.

  రిప్లయితొలగించండి
 9. శివుడు దశరథునకు చిన్న కొడుకగు ల
  క్ష్మణుని పూజలంది జలధి తటిని
  రామచంద్రు సేవలను బొంది విజయోస్తు
  సుగుణులార! యనుచు బొగడె చాల

  రిప్లయితొలగించండి
 10. ఆశ్వమేధమందు నాతడే యాగాశ్వ
  రక్ష చేసె నపుడు రాము నాజ్ఞ
  తలను దాల్చి,రిపుల తలలను తెగగొట్టు
  శివుఁడు, దశరథునకుఁ జిన్న కొడుకు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ శంకరయ్య మాష్టారుగారికి వారి సతీమణి గారికి తగిలిన దెబ్బలు త్వరగా మానాలని ఆ భగవంతుని ప్రార్థచేస్తున్నాను.

  నేటి సమస్యకు నా ప్రయత్నము:

  హరునియంశఁబుట్టి హనుమ సేవించి రా
  మునియనుజుని రీతి ముదముగూర్చె |
  అతడు మసలెనటులెనవకున్ననేమి యా
  శివుడు దశరథునికి చిన్నకొడుకు ||

  రిప్లయితొలగించండి
 12. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు. దోష సవరణ తో నాపూరణ....

  గంగ నెత్తిన గల ఘనుడెవ్వడోచెప్పు
  రాముడెవరి సుతుడు ప్రేమ మీర
  సరిగ నేమగు మరి శత్రుఘ్ను డతనికి
  శివుఁడు- దశరథునకు- చిన్నకొడుకు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
  శ్రీ శంకరయ్య గురువర్యులకు గాయములు తగ్గి ఇంత త్వరగా మన అందరికీ సమస్యాపూరణలిచ్చుట మన అదృష్టము,వారు త్వరలో కోలుకోవాలి అని భగవానుని ప్రార్థిస్తూ .

  సమస్య వృత్తమును మార్చి హాస్యముగా నా ప్రయత్నము

  గురు శిష్యుల మధ్య సంభాషణ
  ======+=======
  పశుపతి ఎవ్వరు శిష్యా ?
  దశరథునకు నెవ్వరు మును దంతిని నిచ్చెన్?
  పశుపతి యన పరమ శివుడు,
  దశరథునకు చిన్న కొడుకు దంతిని నిచ్చెన్
  =====+=======
  సిగ్గు లేని జనులు శివశివ యని బల్క
  శిఖర మెక్కె నేడు శివుడు, దశర
  థునకు చిన్న కొడుకు దుత్తము నిచ్చెను
  దాహ మని యడిగిన దశరథునకు

  రిప్లయితొలగించండి
 14. హరియె నవత రించె నారాము గనిలను
  దైవ మనగ నొకటె ధాత్రి యందు
  వివిధ రూపు లందు వెలయంగ దైవమ్ము
  శివుడు దశ రధునకు చిన్న కొడుకు

  రిప్లయితొలగించండి
 15. మిత్రులారా! శుభాశీస్సులు.
  మరికొన్ని పూరణలను చూద్దాము: ముందుగా అందరికీ అభినందనలు.

  శ్రీ మంద పీతాంబర్ గారు:
  శివుడు దశరథుని కొడుకు కాడు, గిరిజ కోడలు కాదు అని తేల్చి చెప్పేరు. బాగుగనున్నది.

  శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు:
  క్రమాలంకారము నాశ్రయించేరు - బాగుగ నున్నది.

  శ్రీ శ్రీనివాస్ గారు:
  రిపుల తలలను తెగగొట్టు శివుడు అన్నారు - శివునికి ఇట్టి లక్షణము చూపుట ప్రశ్నార్థకమే.

  శ్రీ గూడా రఘురాం గారు:
  హనుమను లక్ష్మణునికి సాటిగా చెప్పేరు - బాగుగ నున్నది.

  శ్రీ వరప్రసాద్ గారు:
  మీ 2 పూరణలు చాల బాగుగ నున్నవి.

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  అందరు దైవము లొకటే అనే సమన్వయమును ఆశ్రయించేరు. బాగుగనున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులకు నమస్కృతులు...
  నా ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నది. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు.
  ముఖ్యంగా నా అశక్తతను గుర్తించి మిత్రుల పూరణల, పద్యాల గుణదోష విచారణ చేసి, సవరణలను సూచించిన పండిత నేమాని వారికి ఎంతగానో ఋణపడి ఉన్నాను. వారి సౌహార్దానికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి