27, జూన్ 2013, గురువారం

గంగా దండకము


గంగా! విజ్ఝృంభత్తరంగా!

శ్రీ దివ్య గంగా! ప్రపుణ్యాంతరంగా! మహావిష్ణు పాదోద్భవా! శ్రీమహాదేవ రాజజ్జటాజూట సంస్థా! మహాపాప ప్రక్షాళినీ! దివ్యరూపా! కృపాశాలినీ! శీతలక్ష్మాధరాగ్రంబునందుండి యానంబు సాగించి వేవేల తీర్థమ్ములన్ దాకుచున్ భక్తులన్ బ్రోచుచున్ పంటలన్ వృద్ధి నొందించుచున్ జీవనాధారమై యొప్పుచున్ మమ్ము బోషించునో మాత! దీవ్యద్గుణోపేత! భాస్వన్మునివ్రాత సంసేవితా! విశ్వమాతా!
మహాదుఃఖ సంసార తాపంబులన్ బొంది శుష్కించు వారెల్ల నీ సన్నిధిన్ జేరి నీ యర్చనల్ సేసి నీలోన స్నానంబు గావించి యా దుఃఖముల్ తీరగా మోదమున్ బొంది నీ దివ్య తీర్థంబులన్ గ్రోలి పాపంబులన్ బాసి జ్ఞానమ్మునున్ బొంది వెల్గొందరే!
ఉద్ధృతాకారమున్ దాల్చి యుప్పొంగు నీ క్రోధ మేమందు నమ్మా? మహాభీల కల్లోల జృంభత్తరంగా! మహోగ్రాకృతిన్ దాల్చి భీభత్సముల్ చాల కల్పించి శైలమ్ములన్ గూల్చి గ్రామమ్ములన్ ముంచి వేవేలుగా మర్త్యులన్ జంతులన్ ముంచి నీలోన లీనమ్ము గావించినావమ్మ! శాంతించుమమ్మా!
నినున్ శాంతరూపా యటంచున్ దలంతున్ కృపావర్షిణీ! వేగ నీ యుగ్రరూపంబు చాలించి మా విన్నపమ్మెల్ల నాలించి పాలింపుమా మమ్ము భాగీరథీ! జాహ్నవీ! జ్ఞానతేజోమయీ! ప్రాణదాత్రీ! నమస్తే నమస్తే నమః
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

12 కామెంట్‌లు:

  1. పండిత నేమాని గురువర్యుల
    గంగాదందకం బాగున్నది. అభిందనన పూర్వక ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని గురువర్యుల
    గంగాదందకం బాగున్నది. అభిందనన పూర్వక ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శశిధర్ గారికి నే
    నాశీర్వచనములు కూర్తు నానందముతో
    శ్రీశు గృపంగని సంపద్
    వైశిష్ట్యముతోడ జెలగ బహు వత్సరముల్

    రిప్లయితొలగించండి
  5. అన్నయ్య గారి దండకములు స్తోత్రములు భక్తిపూర్వకముగా మనోజ్ఞము గానుంటాయి. వారి గంగాదండకము కూడా అద్భుతము. ఆ గంగమ్మతల్లికి, ఆమెను ప్రస్తుతించిన అన్నయ్యగారికి, పూజావేదిక సమకూర్చిన గురువుగారికి వందనములు.

    రిప్లయితొలగించండి
  6. గంగా దండకమిది చదు
    వంగా నుప్పొంగు గంగపై భక్తియు క్షే
    మంగా నుందురు గా మును
    గంగా సరి వచ్చు పుణ్య గౌరవమబ్బున్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ కంది శంకరయ్య గారికి, తమ్ముడు డా. నరసింహమూర్తికి, శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి సంతోష భరిత శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ పండిత నేమాని వారికి ప్రణామములతో
    శీనా (శ్రీనివాస్) వ్రాయునది ,
    ఆర్యా! మీ గంగా దండకము పవిత్ర గంగా నదికి తప్పక శాంతిని కలిగించి సంక్షుభిత ప్రకృతి తిరిగి యధాపూర్వ స్థితికి చేర్చగలదని ఆశిస్తూ , ఇంత మంచి గంగా దండకమును మాకు యిచ్చినందుకు కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.
    వినయ పూర్వక నమస్కారాల తో
    శ్రీనివాస్ .

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శ్రీనివాస్ గారికి శుభాశీస్సులు. మీ ప్రశంసలకు సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. నమస్కారములు
    భక్తి రసభరిత మైన గంగా దండకమును మాకందించిన పూజ్య గురువులు శ్రీ నేమాని పండితుల వారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  11. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు మా సంతోషమును తెలుపు చున్నాము. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.

    రిప్లయితొలగించండి