16, జూన్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1084 (మునిఁ గని దనుజాంగన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్.

30 కామెంట్‌లు:

 1. ఘన భూధర సన్నిభ గా
  త్రుని శృంగార రసమయుని స్తుత్య చరిత్రున్
  మనమలర హిడింబయె భీ
  ముని గని దనుజాంగన వలపుల వల విసిరెన్

  రిప్లయితొలగించండి
 2. దనుజాంతకు, సుగుణు, దయా
  త్ముని, మునిజన హృద్విరాము, మోక్షప్రదునిన్,
  జనకాత్మజేశు, శ్రీ రా
  మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్.

  రిప్లయితొలగించండి
 3. వనవాస విహితుఁడయి స
  న్ముని దీక్షా వ్రతవిహార మూర్ధన్యుండై
  జను మహితాత్ముండగు రా
  మునిఁగని దనుజాంగన వలపుల వల విసిరెన్.

  రిప్లయితొలగించండి
 4. తన మది దోచిన యువకుడు
  మనుమడు శ్రీకృష్ణునకును, మరులన్ గొల్పన్
  ననవిల్తు బోలు ప్రద్యు
  మ్నుని గని దనుజాంగన వలపుల వల విసిరెన్

  రిప్లయితొలగించండి
 5. వనవాసమందు నన్ననుఁ,
  దన దమ్ములఁ జాగరూకతపరుండగుచున్
  కనిపెట్టుకునుండగ భీ
  మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్

  రిప్లయితొలగించండి
 6. చనుచు న్న డవుల వెంబడి
  తనులత యా చుప్పనాతి దరహాసమునన్
  వినయము గలిగిన యారా
  ముని గని దనుజాం గన వలపుల వల విసిరెన్ .

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  హిడింబ ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  శూర్పణఖను ఉద్దేశించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  రాముని వలచిన దనుజకాంత వృత్తాంతంతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారు,
  మంచి ప్రయత్నం చేసారు.
  కాని మీరు పూరించిన విధానం సంప్రదాయం కాదు. సమస్య ప్రథమాక్షరమైన హల్లుకు ముందు వేరొక హల్లు చేర్చడం ఉంది (కర్ముని, ధర్ముని, సన్ముని...), కానీ దాని తరువాత హల్లు చేర్చి సమ్యుక్తాక్షరంగా మార్చరాదు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ హిడింబ ప్రస్తావనతో బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  చిన్న సవరణ....
  చనుచు వనంబుల వెంబడి
  తనరగ నా చుప్పనాతి....

  రిప్లయితొలగించండి
 8. చను మొనల విషమును గలిగి
  మునుముందుగ కృష్ణు జంప పూతన వచ్చెన్
  మనమున క్రూరంబై శ్యా
  మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్!!

  రిప్లయితొలగించండి
 9. గన మనమున నది చోద్యం
  బనిపించిన గాని దనుజ భామలు వలచే
  రు, నరులను,సురుల నట్లే
  మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్.

  రిప్లయితొలగించండి
 10. ముని వందితు డగు యా రా
  ముని గని తా శూర్పణఖ తమో వాంఛను పొం
  దను, పరిణయ మాడగ రా
  ముని గని దనుజ కాంత వలపుల వల విసిరెన్

  రిప్లయితొలగించండి
 11. మనువాడ శూర్పణఖయును
  జనకాత్మజ రూపుఁ దాల్చి సనె, రావణుఁడున్
  జనె రామాకృతి; సట రా
  మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్.
  (సట = కపటము)

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో,
  గురువు గారికి ధన్యవాదములు
  =====*=====
  అనవరతము దైత్యతతిన్
  దన బలమును జూపి జంపు దందనకానిన్
  వనమున మనమలరగ భీ(రా )
  ముని గని దనుజాంగన వలపుల వల విసిరెన్
  =======*======
  అనవరతము సోదరులకు హాని జేయు వారిపై
  దన బలమును జూపి జంపు,తౌల్యమును గణించి నా
  వనమున దన మనమలరగ పాండవ సుతుడైన భీ
  ముని గని దనుజాంగన వలపుల వల విసిరె నిలలో
  (తౌల్యము= సామ్యము )

  రిప్లయితొలగించండి
 13. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  కాకుంటే మొదటి పూరణలో ‘వలచేరు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. రెండవ పూరణలో ‘అగు నా రాముని’ అనకుండా యడాగమం చేసారు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండవ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
  కాకుంటే ఆ సంఘటన సినిమావాళ్ళ సృష్టి. హీరో హీరోయిన్లకు ఒక్కటన్నా డ్యూయెట్ లేకుంటే ఏం బాగుంటుంది? కానీ పెళ్ళికాకుండానే సీతారాములతో యుగళగీతం పాడిస్తే జనం మెచ్చరు కదా! అందుకే కపట సీతారాముల సృష్టి జరిగి ఉంటుంది... ‘శ్రీ సీతారామ కళ్యాణం’ చిత్రంలో.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. ముఖ్యంగా మొదటి పూరణలో రామునకు, భీమునకు అన్వయించే విధంగా చేసిన పూరణ భేష్... అభినందనలు.

  రిప్లయితొలగించండి

 14. అనుజుఁడు భార్యయుఁ దోడుగ
  వనవాసముఁ జేయుచున్నవానిని రామున్
  దినమణి వంశార్ణవ సో
  మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్.

  రిప్లయితొలగించండి
 15. విచిత్ర రామాయణ మని ఒక కావ్యం ఉందనీ, ఆ కావ్యంలో శ్రీ మధుసూదన్ గారు పేర్కొన్న సంఘటన ఉన్నదనీ విన్నాను.

  రిప్లయితొలగించండి
 16. గురువుగారు, ధన్యవాదాలు.
  రామచంద్రుని - రామునిగా, ఇనవంశాబ్ధి చంద్రునిగా వర్ణించిన పద్యము ఎంతో బాగున్నది.

  రిప్లయితొలగించండి
 17. మనుమధుని దలచి నంతనె
  విను వీధుల సంచరించు వేసవి కొలిమై
  కనుమిను గానని తలపున
  మునిగని దనుజాంగన వలపుల వల విసిరెన్ !

  రిప్లయితొలగించండి
 18. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో, అన్న మిస్సన్నగారి పున:ప్రేరణతో

  ఘన బాహుబలాఢ్యుండై
  అనివారిత భీషణరణ హంవీరుండై
  తనరారు యుధిష్టిరు త
  మ్ము నిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్.

  రిప్లయితొలగించండి
 19. ఆ ఎన్నికలు ఎప్పుడవుతాయి తమ్ముడూ?
  నీకు విముక్తెప్పుడు తమ్ముడూ?

  రిప్లయితొలగించండి
 20. అనయము ధర్మాచరణకు
  తన ప్రాణము బెట్టు వాని, ధరణీ సుత భ-
  ర్తను, రాముని, నతసుత్రా
  మునిగని దనుజాంగన వలపుల వల విసిరెన్ !

  రిప్లయితొలగించండి
 21. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  కానీ.. ఈ 'మనుమధుడు' ప్రయోగం ఏమిటి?
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  'ధర్మజుని తమ్ముని' ఉద్దేశించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  రాముణ్ణి ఇంద్రవందితుణ్ణి చేసిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  అన్నట్టు.. ఎన్నికలేమిటి..? విముక్తి ఏమిటి..? ఈ తమ్ముడెవరు?

  రిప్లయితొలగించండి

 22. దనుజాధిపుని వలచెను మ
  యుని సుత మందోదరి; విరహోత్కంఠను నె
  మ్మన మలరఁగ రావణ నా
  ముని గని దనుజాంగన వలపుల వల విసిరెన్.

  రిప్లయితొలగించండి
 23. అన్నా!మిస్సన్నా! ఎప్పుడౌతాయో తెలియదుగాని బంతి ఆకోర్టునుండి ఈకోర్టుకు ఈకోర్టునుండి ఆకోర్టుకు పరిగెడుతోంది. తత్పూర్వ ప్రక్రియలు నెరవేర్చె పని తప్పటంలేదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి సెప్టెంబరు దాకా నాకు విముక్తి ఉండకపోవచ్చు.

  రిప్లయితొలగించండి
 24. శంకరార్యా! చాల బాగున్నది మీపూరణ. మునికి నా చేర్చి నామధేయుని చేసారు.అద్భుతం.

  రిప్లయితొలగించండి
 25. గురువుగారూ! ధన్యవాదాలు . మీ రెండవ పూరణ చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 26. కనుమా సీతా దేవిని!
  తనువున మనమున మనువున తన వాడిని నే
  నని పలికిన రాముని త
  మ్మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్

  రిప్లయితొలగించండి