15, జూన్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1083 (పాపములఁ ద్రోయు గంగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.

22 కామెంట్‌లు:

 1. పాపముల ద్రోయు గంగ పాపమ్ము జేసె
  ననగ రాదు గదయ్య! మహానుభావ!
  అష్ట వసువుల కోర్కెల నామె తీర్చె
  లీన మొనరించుకొనె తనలోన శిశుల

  రిప్లయితొలగించండి
 2. గగన మందుండి దిగివచ్చి గరళ కంఠు
  శిరముపై నుండి సుడులెన్నొ సురిగి తిరిగి
  పాపముల ద్రోయు గంగ పాపమ్ము జేసె
  ననెడి వింతగు మాటను వినగ నేల ?

  రిప్లయితొలగించండి
 3. నరుల శుద్ధులజేయగా నదిగ దిగెను
  మురికి కూపమ్ము జేసెను మూర్ఖ నరుడు
  బుద్ధి లేనట్టి నరునికై భువికి వచ్చి
  పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీరూ నేమాని వారి బాటనే పట్టారు. వారు "అనవద్దు" అంటే మీరు "వినవద్దు" అన్నారు. బాగుంది. మంచి పూరణ. అభినందనులు.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  భూమికి దిగి రావడమే గంగ చేసిన పాపం అంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ఘను భగీరథు యత్నాన గంగ భువికి
  నేగి, గర్వాన జహ్నుని యాగభూమి
  ముంచ, జహ్నువు గంగఁ గోపించి మ్రింగె!
  పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె!!

  రిప్లయితొలగించండి
 7. పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె
  బ్రహ్మ సభయందు, శాపమ్ము బడసెనంద్రు,
  శంతనునిఁ బెండ్లి యాడగ సంతతిగను
  వసువులనుఁ గన్నదని వింటి భారతమున.

  రిప్లయితొలగించండి
 8. పాపముల ద్రోయు గంగ పాపముల జేసె
  గంగ యిచ్చును బుణ్యము గాదు పాప
  మార్య ! యిత్తరి మీ రట్లనగ రాదు
  మిమ్ము గోరుదు నా మాట మిధ్య గాదు

  రిప్లయితొలగించండి
 9. అయ్యా శ్రీ చింతా రామకృష్ణా రావు గారూ! మీ పద్యము గురించి నా సూచనలను గమనించండి:

  1. మత్స్యగంధి గంగా దేవి కాదు.

  2. 2వ పాదములో యడాగమము చేసేరు; సుతులుగ + ఆమె = నుగాగమము చేసి సుతులుగనామె అనాలి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. వరద రూపంబుగను వచ్చి పాడు జేసె
  జనుల ప్రాణమ్ములను తీసి ఘనత చాటె
  కట్టలను దాటి పొట్టన బెట్టుకొనెను
  పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె!!

  రిప్లయితొలగించండి
 11. బహుబాగు గంగ తా నిలజారి బహుళ గతుల
  పారి జనులకు మేలు గలుగ పాప ములను
  పోకార్చ పాత పోకడలను పోవు జనుల
  పాపముల ద్రోయు గంగ పాపమ్ము జేసె

  రిప్లయితొలగించండి
 12. సురనది తా శంతను సతిగ సుతుల దెచ్చి
  తనలోన ముంచి జంపె నదియు తాను దైవ
  కార్యము చేయ ధర్మ మగును కాని,యెట్లు
  పాపముల ద్రోయు గంగ పాపమ్ము జేసె ?

  రిప్లయితొలగించండి
 13. చింతా రామకృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!
  ‘మత్స్యగంధిగ’ అన్నదాన్ని ‘మానుషత్వాన’ అంటే ఏలా ఉంటుందంటారు? అలాగే ‘సుతులుగ నామె’ అంటే సరి!
  *
  గుండు మధుసూదన్ గారూ,
  యాగభూమిని ముంచి పాపం చేసిన గంగను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  గంగా శాపవృత్తాంతంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం... ‘ఆర్య ! యిత్తరి మీ రట్టు లనగ రాదు’ అంటే సరి!
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  వరదగా ఉప్పొంగి జనులను కష్టపెట్టే పాపం చేస్తున్నదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శీనా శ్రీనివాస్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. మునిగిన తనలో పాపియె మ్రొక్కి తనకు
  పాపముల ద్రోయు గంగ , పాపమ్ము జేసె
  వీడనుచు దోస మెంచదు పెద్ద మనసు
  తోడ ; జయము తల్లీ ! నీవె తోడు నాకు !

  రిప్లయితొలగించండి
 15. నాగరాజు రవీందర్ గారూ,
  మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో,
  గురువు గారికి ధన్యవాదములు
  ========*=======
  పాలకుల పాప కర్మలు పదడు జేసి
  ఖలుల కష్ట కడలి నెల్ల కడగి వేసి
  కలుషములకు కృంగి దిరుగు,కలియుగమున
  పాపముల ద్రోయు గంగ పాపమ్ము జేసే
  (పదడు= భస్మము )

  రిప్లయితొలగించండి
 17. బాగు బాగది గంగ తా బహుళ గతుల
  పారి జనులకు మేలు గ పాప ములను
  బాప పాత పోకడలను బరగు జనుల
  పాపముల ద్రోయు గంగ పాపమ్ము జేసె

  సురనదిల తాను శంతను సుతుల దెచ్చి
  తమ్ము ముంచి జంపె నదియు తాను దైవ
  కార్యమును చేయ ధర్మమే కాని,యెట్లు
  పాపముల ద్రోయు గంగ పాపమ్ము జేసె ?

  శంకరయ్య గారికి నమస్కారములు. ఆర్యా! నేను మునుపు పంపిన పూరణల లో గణ దోషములున్నవని అనిపించుట చేత సరి చేసి మరల పంపించు చున్నాను.
  మన్నించ గలరు. శీనా (శ్రీనివాస్).

  రిప్లయితొలగించండి
 18. వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శ్రీనివాస్ గారూ,
  అవి ఏవో అక్కర భేదాలేమో తరువాత తీరిగ్గా చూద్దామనుకున్నాను.. సంతోషం...
  రెండవ పూరణలో ‘సురనది + ఇల’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘సురనదియె’ అందామా?

  రిప్లయితొలగించండి
 19. ఆర్యా! శంకరయ్య గారు,
  మీ సవరణ సబబు గా నున్నది. ధన్యవాదములు. శీనా (శ్రీనివాస్)

  రిప్లయితొలగించండి
 20. మహిని గంగమ్మ శంతను మాన్య సతిగ
  అష్ట వసువుల సుతులుగ నామె కనియు
  గంగలోవైచె నపుడామె కరుణ వీడి.
  పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.

  రిప్లయితొలగించండి