29, జూన్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1097 (కుందేలును కోడిపిల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్.
("తెలుఁగులో సమస్యాపూరణములు" గ్రంథమునుండి)

25 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్నటి ప్రమాదంలో మాకు గాయాలైనవి కాని అంత తీవ్రమైనవి కావు. కాకుంటే ఒంటినొప్పులు కాస్త ఎక్కువగా ఉన్నాయి. జ్వరం కూడా వచ్చింది.
    నా ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ సానుభూతి తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. నిన్న మీకు ప్రమాదము జరిగిన విషయము నాకుఁ జాల బాధకలిగించినది. మీరు, మీ శ్రీమతిగారు త్వరిత గతిన కోలుకోవలెనని యా భగవంతుని మనసార వేడుకొనుచున్నాను.

    నా పూరణము:

    విందారఁగించఁ జని, తన
    ముందునఁ గనిపించినట్టి ముద్దాయియునై,
    మంద గమనయౌ నా యా
    కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్.
    (ముత్+దాయి=సంతోషమును గలిగించునది.
    ఆకుందేలు=ఆకుఁదేలు>ఆకుతేలు)

    రిప్లయితొలగించండి
  3. హమ్మయ్య బ్లాగులో కను పించి మంచి మాట చెప్పారు. కొంచం విశ్రాంతి తీసు కుంటే త్వరగా కోలుకో వచ్చును

    రిప్లయితొలగించండి
  4. పందెము వేయుచు తెలివిగ
    అందముగా మత్తు గలిపి యాదర మొప్పన్ !
    విందుల పేరిట ఘనముగ
    కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్ !

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారు తమ పూరణలో "విందారఁగించ"లో పొరపాటున అరసున్నా టైపయిందని (ఫోన్‌లో) తెలియజేసారు.

    రిప్లయితొలగించండి
  6. అందరి వలెనే భయపడి
    మందును మ్రింగకనుబాల మరిమరి యేడ్వన్
    పందిరిలో కనిపించెను
    కుందేలును,కోడిపిల్ల ;గుటుకున మ్రింగెన్ !!!

    రిప్లయితొలగించండి
  7. పందెమున గెలిచె కూర్మము
    కుందేలును, కోడిపెట్ట గుటుకున మ్రింగెన్
    వందలకు మించి కీటక
    మందల వేటాడె శక్తి మైమరపించన్.

    రిప్లయితొలగించండి
  8. గురువుగారూ,

    జరిగినది తెలిసి చాలా బాధ కలిగింది. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  9. పందెం బు గెలిచె కూర్మము
    కుందేలును , కోడిపిల్ల గుటుకున మ్రిం గెన్
    అందందున నడయాడుచు
    విందుగ నొక వానపాము వీపున బొడిచీ .

    రిప్లయితొలగించండి
  10. పందేనికి తెగబడుచూ
    కందమ్మును చెప్పెదనని కసిగా రాగా
    కందీశుండనె పుటుకున
    కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  11. మాస్టారూ, ఓ సూచన.. మీ వయసు, మన రోడ్లు, మన ట్రాఫిక్కు, ఇద్దరి ప్రయాణం, స్కూటరు - మీరు స్కూటరు నడిపేందుకు ఇవేవీ అనుకూలంగా లేవు సార్. సాధ్యమైనంత వరకు స్కూటరు నడపకపోవడం మంచిది.

    గాయాలు చిన్నవే కావడం మన అదృష్టం. మీరిద్దరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  12. సందడి చేయుచు వచ్చిరి
    పందిరి లో పెండ్లి విందు పంక్తికి విప్రుల్
    పందిరి లో జూడగ బెరు
    కుం,దేలును, కోడిపిల్ల గుటుకున మ్రింగెన్.

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్య గురువర్యులకు ప్రణామములు. మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవతిని వేడుకుంటున్నాను .
    భవదీయుడు
    శ్రీనివాస్ (శీనా ).

    రిప్లయితొలగించండి
  14. గురువు గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

    వందల కొలదిగ పురుగులు
    చిందర బందర తిరుగుచు చెంతకు చేరన్
    విందై, కుక్కటమిక కును
    కుందేలును, కోడిపిల్ల గుటుకున మ్రింగెన్!!

    కునుకున్ + తేలును = కునుకుందేలును = నిద్ర లేస్తుంది

    రిప్లయితొలగించండి
  15. సుందరి ఘనతలు వినరే
    'పందెమునకు దెచ్చి పెంచి బలపోషణకై
    అందించిన, యేనుగుతో
    కుందేలును, కోడిపిల్ల గుటుకున మ్రింగెన్ .'

    రిప్లయితొలగించండి
  16. అందమగు హంస నడకల
    సుందరి యగు నాదు చెలియ సోద్దెము దెలుపన్ !
    చంద్రునిలో మెరిసెడియా
    కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్ !

    రిప్లయితొలగించండి
  17. క్షమించాలి
    మోడవ పాదం పొరబాటైనచో ఇలా అనుకుంటున్నాను
    " చందురుని యందు మెరిసెడి } " అని

    రిప్లయితొలగించండి
  18. ఈనాటి కుందేలు - కోడిపిల్ల సమస్యను పూరించిన వారందరికి శుభాశీస్సులు. అన్ని పూరణలు బాగుగ నున్నవి.

    1. శ్రీ గుండు మధుసూదన్ గారు: ఆకుతేలు ముద్దాయి - ప్రయోగములు ప్రశస్తముగా నున్నవి.

    2. శ్రీమతి రాజేశ్వరి గారి 2 పూరణలు :
    -- విందులు వినోదాల వరుస బాగుగనున్నది.
    -- సోద్దెము వాడుక చాల బాగుగ నున్నది. 3వ పాదములో ప్రాస కొరకు చంద్రునిలోకి బదులుగ చందురులో అందాము.

    3. శ్రీమంద పీతాంబర్ గారు:
    --మ్రింగకనుకి బదులుగా మ్రింగకయె అని మార్చుదాము.

    4. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు:
    కీటక మందల సమాసము సాధువు కాదు. మంద అనే ప్రయోగము ఆవులు, మేకలు మొదలైన జంతువులకే పరిమితము కదా.

    5. శ్రీ సుబ్బా రావు గారు:
    4వ పాదమును ఇలాగ మార్చుదాము: "విందున నొక వానపాము పిల్లను దినుచున్" - అని.

    6. ఒక చదువరి గారు: మీ పద్యమును ఇలాగ మార్చుదాము:
    పందెమునకు దెగబడుచును
    కందమ్మును జెప్పెదనని కసిగా రాగా
    కందీశుడనెను పుటుకున
    కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    7. శ్రీ శ్రీనివాస్ గారు:
    బెరుకు అంటే అర్థములు: 1. భేదము, 2.ప్రయోజనము
    మీరు బెరుకుందేలు అంటే నాకు అర్థము కాలేదు.

    8. శ్రీ జిగురు సత్యనారయణ గారు:
    మీ ప్రయోగము కునుకుందేలు చాల బాగుగనున్నది.

    7. తమ్ముడు చి. డా. గన్నవరపు నరసింహమూర్తి:
    కోడిపిల్ల కుందేలునే కాద్ ఏనుగునే తినుటె చాల బాగుగనున్నది.

    అందరికీ మరియొక మారు శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సందున కాలువ పైన ప
    సందుగనే తేలుచుండ సందే దొరకెన్
    విందే యాకుననని యా
    కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. కాలువ పైనె తేలుచున్న దెవరో తెలియుట లేదు. అన్వయము ఇంకా స్పష్టముగా ఉంటే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు..
    ప్రమాదంలో పెద్ద దెబ్బలేమీ తగల్లేదు కానీ, ఆ షాకు వల్లనో ఏమో తీవ్రమైన జ్వరం వచ్చింది. ప్రస్తుతానికి తగ్గింది కానీ నీరసంగా ఉన్నాను.నా ఆరోగ్యాన్ని గురించి పరామర్శించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    *
    నిన్నటి సమస్యకు చక్కని పూరణల నందించిన కవిమిత్రులు....
    గుండు మధుసూదన్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    మంద పీతాంబర్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    ‘చదువరి’ గారికి,
    ‘శీనా’ శ్రీనివాస్ గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    ...................... అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పూరణలను సునిశితంగా పరీశీలించి గుణదోషాలను విచారించి సవరణలను సూచిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.మీ సూచన ప్రకారము సవరణ చేయుచున్నాను.
    మాస్టరు గారూ...మీకు అరోగ్యము కుదుట బడినందులకు సంతోషము.

    సందున కాలువ లోన ప
    సందుగ నాయాకుపైన సరి తేలుండన్
    సందే విందుకుయని యా
    కుందేలును కోడి పిల్ల గుటుకున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  23. నందనవనమున మొక్కలు
    సుందరముగ వృద్ధిచెంద సోకెను చీడల్
    అందొక మొక్కకు గల ఆ
    కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్.

    రిప్లయితొలగించండి
  24. పొందుగ రణరంగమ్మున
    కుందుచు నస్త్రములు వీడి
    క్రుంగుచునుండన్
    చిందుచు శిరమును త్రుంచెను :
    "కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్"

    రిప్లయితొలగించండి
  25. పందెమ్మును కాసి చివర
    కందమ్మౌ స్మృతి ఇరాని గతికెను రాహు
    ల్నిందే యుపమానమ్మౌ: 👇
    "కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్"

    రిప్లయితొలగించండి