28, జూన్ 2013, శుక్రవారం

పద్య రచన – 386 (పడక కుర్చీ)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“పడకకుర్చీ”
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. కురిచీలో బండుకొనుట
    కరము సుఖకరమ్ము మంచి కవితలు మదిలో
    నురకలు వేయుచు నలరును
    సరసమతీ! శంకరయ్య! సత్కవివర్యా!

    (శబ్దరత్నాకరములో "కురిచీ" అనే పదము కలదు - కుర్చీ అని లేదు).

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులో 'కురిచీ, కుర్చీ' రూపాంతరాలుగా ఉన్నాయి. అలాగే రవ్వా శ్రీహరి నిఘంటువులో కుర్చీ, కుర్చీపీట శబ్దాలున్నవి.

    రిప్లయితొలగించండి
  3. పడక కుర్చీకీ మా తాతగారికీ అవినాభావ సంబంధం. ఆయన తరువాత చాలాకాలం నేను దాంట్లోనే కూర్చొనే వాడిని. ఇప్పటికీ అది తెచ్చుకొని కూర్చోవాలని...ఆ తీపిగురుతులతో,
    ఆహా! యేమి సుఖంబది
    ఊహలలో తేలియాడ నూరించు గదా
    స్నేహంపు కరము లూన్చుచు
    గ్రాహించితి తాతగారి గారపు కురిచీ!

    రిప్లయితొలగించండి
  4. పండుకొనగ వలయు పట్టెమంచము సరి
    కూరుచుండ వలయు కుర్చి యొకటి
    కూరుచుంట పడక కుదరకను పడక
    భయము పడక - కలదు పడక కుర్చి

    రిప్లయితొలగించండి
  5. ' ఆహా! యేమి సుఖంబది !'

    మిత్రులు చంద్రశేఖర్ గారు మా పల్లె కేతెంచి నపుడు మా యింట్లో పడక కుర్చీ చూడగానే అత్యుత్సాహంగా అందులో ఆసీను లవడము నాకు గుర్తే !
    ఆ కుర్చీ కొంటున్నప్పుడు ' మీకు పిచ్చి, మీకు వెఱ్ఱి, మీకు తిక్క ' వంటి నిందలు భరించ వలసి వచ్చింది. కొన్ని సందర్భాలలో మొండికెత్తక తప్పదు !

    రిప్లయితొలగించండి
  6. భోజ నంబును దృ ప్తిగ బూ ర్తి జేసి
    పడక కుర్చిలో కూర్చుని పట్టి నమలి
    వార పత్రిక జదువుచు వరుస నూగి
    నిద్ర పొమ్మిక మఱి కమ్మ ని కల గనుచు

    రిప్లయితొలగించండి
  7. పెద్దవారలిందు విశ్రాంతి గైకొందు
    రనుట నిజము, పరగ హాయి నొసగు,
    కూరుచుండ నెట్టి కోరిక లెన్నక
    సంధ్య వేళలందు చల్ల గుండు.

    రిప్లయితొలగించండి
  8. ఒక్క సారి మా ఊరినీ మా తాతగారినీ, వారి వద్ద మా బాల్యమును గుర్తు చేసిన శంకరయ్య మాష్టారు గారైకీ, వారి "పడక కుర్చీ" కి ధన్యవాదములతో:

    గ్రామమంతయు వినగ భగవద్గీతను
    ..........పఠియించు వేదియా పడకకుర్చి !
    ఆశుపద్యములఁదానల్లంగనాధార
    ..........ప్రవహించు తీర్థమా పడకకుర్చి !
    బాలురందరఁజేర్చి పలుపాఠములనేర్పఁ
    ..........బాఠశాలయినదా పడకకుర్చి !
    తత్వచర్చలఁజేసి ధర్మముల్ విశదించి
    ..........ప్రవచించు పీఠమా పడకకుర్చి !

    అలుపుఁదీర్చి మాతాతయ్యకండనిలిచె
    బ్రతికియున్నంత కాలమా పడకకుర్చి |
    మూగబోయెను ఖంగునమ్రోగు గొంతు
    పగిలి మూలఁబడెనిపుడా పడకకుర్చి ||

    రిప్లయితొలగించండి
  9. తరతరముల తీపి గురుతు
    కెరటము వలె తరలి వచ్చి కేరింత లిడన్ !
    వరమిది పడుకొను కురిచీ
    కరుగుచు కలలందు మిగుల కావ్యము లల్లన్ !

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గూడారఘురాం గారి శైలి ధార చాలా బాగున్నాయి. ప్రశంసలు. అవును నిజమే ఈరోజుల్లో పడకకుర్చీలు మూల పడేస్తున్నారు. ఇంకొకరు అడిగితే ఇవ్వరు, వారు వాడుకోరు. ఏం చెప్పమంటారూ!

    రిప్లయితొలగించండి
  11. మడత మంచ మిముడు మాపటి నిద్రకు
    పొద్దు పొడుచు వఱకు సద్దు లేక !
    పగటి వేళ లందు పడక కుర్చీ మేలు
    కూడు పిదప కొంత కునుకు కొఱకు!!

    రిప్లయితొలగించండి
  12. ‘పడక కుర్చీ’పై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    చంద్రశేఖర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గూడ రఘురామ్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. ఏమిటో కునుకుతో తృప్తి కలుగుట లేదు ,

    మడత మంచ మిముడు మాపటి నిద్రకు
    పొద్దు పొడుచు వఱకు , సద్దు లేక !
    పగటి వేళ లందు పడక కుర్చీ మేలు
    కూడు పిదప కొన్ని గుఱక లిడగ !!!

    రిప్లయితొలగించండి