23, జూన్ 2013, ఆదివారం

పద్య రచన – 381 (ఏరువాక పున్నమ)

కవిమిత్రులారా,
  పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. పాడి పంటలు పచ్చని పైరు లవని
    కాభరణములుగా కడు నలరుచుండు
    మంచి పరిసరములలోన మనసు మనసు
    కలిసి సుఖజీవితము సాగు గ్రామములను

    రిప్లయితొలగించండి
  2. ఏరువాక రాక యేతెంచ గ్రామాన
    హర్ష మొదవు నెల్ల కర్షకులకు
    చేతినిండ పనులు చేతముల్ నిండుగా
    మెండు తలపులుండు మేలు మేలు

    రిప్లయితొలగించండి
  3. మనలకు తిండినిఁ బెట్టెడు
    ఘనుడగు రైతన్న మెచ్చగ కురిసె వానల్,
    మనసులు నిండగ నికపై
    పనులను మొదలిడు సమయము, పండుగ నేడౌ.

    రిప్లయితొలగించండి
  4. ఎండపోక వానలేరు పొంగుచు రాక
    అవని మురిసి పెట్టె హాయి కేక
    అరుగువదలి రైతు చురుకుగాను యరక
    కెడ్ల బూన్చిసాగె నేరువాక.

    రిప్లయితొలగించండి
  5. అయ్యా శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. చురుకుగాను + అరక అని మీరు సమాసము చేసినపుడు యడాగమము రాదు కదా. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    మీరు కేవలం చిత్రాన్ని చూచి మొదటి పద్యం వ్రాసినట్టున్నారు. తరువాత శీర్షికలోని ఏరువాక పున్నమను గమనించి రెండవ పద్యాన్ని వ్రాసారు. రెంటికి రెండూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! అక్కడ ‘చురుకుగా నరకకు/ నెడ్ల బూన్చి...’ అని సవరిద్దామా?

    రిప్లయితొలగించండి
  7. ఏరులు పొంగుచు పారెను
    దారులు మరి తడిసి నిండె దాళువ పండన్ !
    ఏరువాక సాగె రైతులు
    పోరుచు కృషి జేసి పంట పొందగ మేలౌ !

    రిప్లయితొలగించండి
  8. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

    ఋగ్వేద కాలాన కృషియజ్ఞ మై క్షేత్ర
    పాలుని పండుగై పరగె నాడు
    కర్షకాళికి సదా హర్షమొదవు “యేరు
    వాక పున్నమ” రోజు వాడ వాడ
    యెద్దుల కొమ్ముల ముద్దుగ రంగులు
    పూయుచు సవరించు పూల తోడ
    కాడిని నాగలిన్ గౌరవమ్ముగజూచి
    యాడుబిడ్డలతోడ నరుగు చుండి
    చేరి పొలముకు భూపూజ చేసి యపుడు
    మొదలిడ(న) అరక దున్నుట ముదము తోడ
    యేరువాక సాగారంచు నూరి వారు
    పాడు కొందురు పాటలు పరవశించి
    జనులు జ్యేష్ఠ పున్నమి రోజు జరపుకొనును.

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో పద్యం చెప్పారు. సంతోషం.
    ఏమిటో.. ఈరోజు మీ మూడు పద్యాల్లోనూ మూడవ పాదం గణాలకు ఏదో మూడింది..
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    చాలా వివరంగా ఏరునాక పున్నమ గురించి అందమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    "పొలముకు" అన్నారు. "పొలమునకు" అన్నది సరియైన రూపం. అక్కడ "చేరి పొలమును" అన్నా సరిపోతుంది. జరుపుకొనును... అన్నదానిని "జరుపుకొంద్రు" అనండి.

    రిప్లయితొలగించండి
  10. ప్చ్ ! అవును కదా! ఎందుకో ఎంత కిట్టించినా అస్సలు కుదర లేదు రాహు కేతువులు అడ్డు పడి నట్టున్నారు.ప్చ్ !

    రిప్లయితొలగించండి
  11. శ్రీ తోపెల్ల వారూ! శుభాశీస్సులు.
    మీ ఏరువాక సీసము బాగుగనున్నది. 3 చోటులలో యడాగమము వేసేరు - నుగాగమము వేయాలి.
    1. హర్షమొదవు + ఏరువాక
    2. యెద్దుల కొమ్ముల
    3. తేటగీతిలో 2వ పాదములో యేరువాక

    జ్యేష్ట పున్నమి అనే సమాసము సాధువు కాదు. జ్యేష్ట పూర్ణిమ అంటే బాగుంటుంది.
    రోజు అనే పదము తెలుగు కాదు - నాడు అంటే బాగుంటుంది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీపండిత నేమాని గురువర్యులకు శ్రీ శంకరార్య మాష్టారికు నమస్సులతో దోషములు తెల్పి సవరణగూడ చూపినందులకు మిక్కిలి ధన్యవాదములు. సవరణానంతరం

    ఋగ్వేద కాలాన కృషియజ్ఞ మై క్షేత్ర
    పాలుని పండుగై పరగె నాడు
    కర్షకాళికి సదా హర్షమొదవు “నేరు
    వాక పున్నమ” రోజు వాడ వాడ
    నెద్దుల కొమ్ముల ముద్దుగ రంగులు
    పూయుచు సవరించు పూల తోడ
    కాడిని నాగలిన్ గౌరవమ్ముగజూచి
    యాడుబిడ్డలతోడ నరుగు చుండి
    చేరి పొలమును భూపూజ చేసి యపుడు
    మొదలిడ(న) అరక దున్నుట ముదము తోడ
    నేరువాక సాగారంచు నూరి వారు
    పాడు కొందురు పాటలు పరవశించి
    జనులు జ్యేష్ఠ పూర్ణిమ నాడు జరపుకొంద్రు..

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ తోపెల్ల వారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమును మళ్ళీ వ్రాసేరు - బాగుగనున్నది. ఒకచోట రోజుకి బదులుగా నాడు అని మార్చేరు. ఇంకొక చోట కూడా ఒక రోజు మిగిలి పోయింది. స్వస్తి.

    రిప్లయితొలగించండి