23, జూన్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1091 (కుల వాసన నెంచి చూడ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.

42 కామెంట్‌లు:

 1. కలవట మరువము ధమనము
  పలు ప్రోవులు పూలతోడ పడతులు వానిన్
  దలదాల్తురుగద యా యా
  కుల వాస నెంచిచూడ గుమగుమ లాడెన్

  రిప్లయితొలగించండి
 2. ఫలహార సేవనముకై
  చలికాలపు టుదయమందు సందడితోఁ బో
  పుల యటుకులు సేయఁగ, నటు
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్

  రిప్లయితొలగించండి
 3. మలమల మాడెను కడుపా
  కలితోడను వంట గదిని కలియగ జూడన్
  కలవెండిన కొబ్బరిపలు
  కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.

  రిప్లయితొలగించండి
 4. తులలేని విధముగా నటఁ
  జెలి చేసెను "బూఁతఱేకు" చిఱువంటకముల్
  దలఁపుల మెదిలెడి యా ఱే
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్.

  రిప్లయితొలగించండి
 5. పలు రకములుగా కట్టుచు
  పిలిచిన మేనత్త మురిసి బెట్టెను, కొత్తా
  కులు, సున్నము, వక్కల పలు
  కుల వాసనెంచిచూడ గుమగుమ లాడెన్

  రిప్లయితొలగించండి
 6. తొలి "బర్తుడే"కు మనుమని
  కల "కేకులు" రెండు తెచ్చి, "కట్" చేయంగన్
  గలిగిన "ఖుసి" కన్నను. కే
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్. ౩
  (అన్యదేశ్య పదములు వినోదార్థము వాడితిని)

  రిప్లయితొలగించండి
 7. ఫలకునుమా గల్లీలో
  మెలమెల్లగ నడచు చుండె మిర్జా సాహెబ్
  'అలి ' కేఫ్ లో వహ్వా ! కే
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్

  రిప్లయితొలగించండి
 8. మల్లవరపు జాన్ కవి పూరణ...

  కలికీ! నీ చేతులలో
  గల మాహాత్మ్యం బదేమొ? కమ్మని వంటల్
  వలపించెను, కరివేపా
  కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.

  రిప్లయితొలగించండి
 9. పండిత నేమాని వారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ‘అటుకుల, పూతరేకుల, కేకుల’ మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘ఫలహార’మన్న వ్యావహారికం మింగుడు పడడం లేదు. దానిని ‘చెలి యల్పాహారమునకు’ అని సవరిస్తే ఎలా ఉంటుందంటారు?
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ ‘కొబ్బరి పలుకుల’ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ఉదయాన్నే తాంబూల సేవనం చేయించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  ‘వహ్వా’ అనిపించే పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. చెలగి యొక తోట లోనికి
  తెలతెల వారగ వెడలితి తేవగ విరులన్
  అలరిన గులాబి పూ రే
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్.

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  మీ పూరణలో ‘దమనము’ టైపాటు వల్ల ‘ధమనము’ అయినట్టుంది. నిఘంటువులో ధమనమునకు అర్థాలు వేరుగా ఉన్నవి. దమనమునకు - దవనము అనే అర్థాన్నిచ్చారు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘తేవగ’ అనడానికి బదులు ‘తెచ్చుటకు విరుల్’ అందాం.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. నా మొదటి పూరణమునకు తాము సూచించిన సవరణమునకు ధన్యవాదములు.

  చెలి యల్పాహారమునకుఁ
  జలికాలపు టుదయమందు సందడితోఁ బో
  పుల యటుకులు సేయఁగ, నటు
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్.

  రిప్లయితొలగించండి
 14. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!శుభాశీస్సులు,
  ధమనము అని మా వాడుక ప్రకారము వ్రాసేను. నిఘంటువులో కిక్కస కసవు అని అర్థమును చూచేను. మీరు సరిజేసినందులకు సంతోషము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. వెలసిన యంగడి లోపల
  పలు వాసన ద్రవ్యములను పరచిరి వరుసన్
  వెల గల కుంకుమ పూ రే
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్

  రిప్లయితొలగించండి
 16. అలవాటుగ కిళ్ళీకై
  అలకాపురి వీథులందు యడుగులు వేయన్
  వెలకట్టుటకు తమలపా
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్

  రిప్లయితొలగించండి
 17. నాగరాజు రవీందర్ గారూ,
  ఈరోజేమిటి విజృంభిస్తున్నారు? చాలా సంతోషం!
  మీ కుంకుమ పూరేకుల, తమలపాకుల తాజా పూరణల వాసనలు గుబాళిస్తున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. నేమాని వారూ,
  మా ప్రాంతాల్లో దమనం, దవనం రెండు రూపాలూ వాడుకలో ఉన్నాయి. ధమనమని చూడగానే సందేహం వచ్చింది.
  ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 19. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

  అలుకన్ దీర్పగ సతికిని
  విలువగు నగదెచ్చియిచ్చి వెచ్చని పలుకుల్
  పలుక తలనిడిన పూరే
  కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.

  రిప్లయితొలగించండి
 20. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  ‘తల నిడిన పూరేకుల వాసనతో మీ పూరణ గుబాళిస్తున్నది. చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. అయ్యా! శ్రీ తోపెల్ల వారూ!
  మా యింట్లో అయితే అలుకలు ఉండవు. నేను మాత్రము "అలరారింపగ భార్యను" అంటాను తొలి పాదమును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 22. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

  చెలికాడైన కుచేలుని
  పిలచి దరికి కృష్ణుడంత ప్రేమగ తడుమన్
  చిలిపిగ, చేలము గలయటు
  కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.

  రిప్లయితొలగించండి
 23. శ్రీనేమాని గురువులకు పాదాభివందనములు.మీరు నుడివిన ప్రథమ పాదమే ప్రశస్తము. కుర్రవాళ్ళం (మీకంటే)కదా! అప్పుడప్పుడు ప్రణయకోపాలు తప్పటంలేదు.

  రిప్లయితొలగించండి

 24. వలపులు గురియఁగ నా పై
  దలి పరమాన్నమ్ముఁ జేసెఁ దడయకఁ దిన నం
  దలరించెడి యేలకి పలు
  కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.

  రిప్లయితొలగించండి
 25. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ రెండవ పూరణ కూడా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. వలపుల వన్నెలు చిన్నెలు
  నలరెడు లేలేత వయసు నందమొలుకు నె
  చ్చెలి ప్రేమ సుధల బల్ చిను
  కుల వాసన నెంచి చూడ గుమ గుమ లాడెన్

  రిప్లయితొలగించండి
 27. పండిత నేమాని వారూ,
  ప్రేమ సుధా శీకర వాసనల గురించిన మీ తాజా పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. అలనాటి బాల్య మిత్రుడు
  చెలికాడగుహరికినిడె కుచేలుడు భక్తిన్
  పలుచటిమూటను,మరియటు
  కుల వాసన నెంచిచూడ గుమగుమ లాడెన్!!!

  రిప్లయితొలగించండి
 29. మంద పీతాంబర్ గారూ,
  మీ అటుకుల పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. మలమల మాడ్చెడి ఎండలు
  తొలగు పిదప, కురియబోవు తొలకరి ముందున్
  చెలగిన మట్టి, తొలి చిను
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్!

  రిప్లయితొలగించండి
 31. పైన నా పద్యంలో
  మూడవ పాదంలో దోషం దొర్లింది.
  సరి చేసిన పద్యం మళ్ళీ ప్రచురిస్తున్నాను.
  భావం కూడా మరింత మెరుగయ్యింది.

  మలమల మాడ్చెడి ఎండలు
  తొలగు పిదప, కురియబోవు తొలకరి ముందున్
  కలగలియు మట్టి, తొలి చిను
  కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్!

  రిప్లయితొలగించండి
 32. కలహంస కలికి యందము
  తెలి వెన్నెల తేరు లందు తేలుచు రాగా !
  ఉలికి బడి మొగలిరే
  కుల వాసన నెంచి చూడ గుమ గుమ లాడెన్ !

  రిప్లయితొలగించండి
 33. నిలకడగల హృదయముతో
  జలజాక్షుని పూజ సలిపి స్వామి పదాబ్జ
  మ్ముల కడ నున్న తులసి యా
  కుల వాసన నెంచి చూడ గుమ గుమ లాడెన్

  రిప్లయితొలగించండి
 34. అలిగిన చెలి కరుణించగ
  మలచెను దీపమ్ము తాను మది మురియంగా
  చిలిపిగ గ్రుచ్చగ మొగలి రే
  కుల వాసన నెంచి చూడ గుమ గుమ లాడెన్ !

  రిప్లయితొలగించండి
 35. తలపై బాలుని నిడుకొని
  మెల మెల్లగ నడుగులిడుచు మృదు భావమ్ముల్
  దలకొన, వసుదేవుడు గో
  కుల వాసన నెంచి చూడ గుమ గుమ లాడెన్ !

  రిప్లయితొలగించండి
 36. అక్కయ్యగారి భావుకత అద్భుతము .రెండు పద్యములు చాలా చాలా బాగున్నాయి.
  మొదటి పద్యము మూడవ పాదములో రెండు లఘువులు తమ్ముడికి కష్టం గాదు.

  కలహంస కలికి యందము
  తెలివెన్నెల తేరు లందు తేలుచు రాగా !
  ఉలికిబడి, విరి(తల)మొగలి రే
  కుల వాసన నెంచి చూడ గుమ గుమ లాడెన్ !

  రెండవ పద్యములో మూడవ పాదములో ఒక లఘువు తీసేసుకొంటాను.

  అలిగిన చెలి కరుణించగ
  మలచెను దీపమ్ము తాను మది మురియంగా
  చిలిపిగ గ్రుచ్చి మొగలి రే
  కుల వాసన నెంచి చూడ గుమ గుమ లాడెన్ !

  రిప్లయితొలగించండి
 37. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  తొలి చినుకులతో తడిసిన మట్టివాసన ఇచ్చినంత ఆనందాన్ని మీ పూరణ కలిగించింది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనులు.
  రెండింటా మూడవ పాదంలో గణదోషం ఉంది.
  గన్నవరపు వారు చేసిన సనరణలు గమనించండి. (మీ పక్షాన నేను ధన్యవాదాలు తెలుపుతాను లెండి!)
  *
  పండిత నేమాని వారూ,
  మీ మూడవ పూరణలో భక్తి భావం ఉదాత్తంగా ఉన్నది. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  అక్కయ్య గారి పద్యాలను సవరించి (నాకు శ్రమ తప్పించి)నందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 38. పలురకముల పుష్పములకు
  నెలవాయెను భూతలమ్ము నెత్తావులతో
  తలమానికమౌ విరి రే
  కుల వాసన నెంచి చూడ ఘుమఘుమ లాడున్!

  రిప్లయితొలగించండి
 39. జలజాక్షుల ధన కీర్తుల
  వలపుల వాసనల జిక్కి వ్యామోహమునన్
  కలతలను దీర్చు సద్గురు
  కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్

  రిప్లయితొలగించండి


 40. ఇలలో ముదముగ పదుగురు
  బిలువన మరిమరి జిలేబి బిగువులు గూడన్
  పలుమార్ల యత్న ముగ పలు
  కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 41. అల బీహారున కవిరో!
  వలపున లాలూ రబిడిలు పండుగ జేయన్
  కలవర పడకయె యాదవ
  కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్

  రిప్లయితొలగించండి