22, జూన్ 2013, శనివారం

పద్య రచన – 380 (ఆకాశవాణి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
ఆకాశవాణి

15 కామెంట్‌లు:

  1. ఏ కాలమ్మున బల్కుచుండెనొ గదా హృద్యంబుగా సోదరా!
    ఆకాశాద్భుతవాణి సత్యమును శ్రేయమ్మున్ సదా గూర్చుచున్;
    లోకాలెల్లను మారె నేడు గద యాలోచింప నా వాణియున్
    నాకీ వ్యాజ్యములేలయంచు వదలెన్, మౌనమ్మునున్ బూనుచున్

    రిప్లయితొలగించండి
  2. ఆకాశమునుండి రూపమ్ము యగుపడకనె
    స్వరమును వినిపించెడు శక్తి యయిన
    నెట్టి యాకాశ వాణిని యెఱుగమిపుడు.
    దూర కేంద్రము నిట్లన తుష్టి కలుగు.

    రిప్లయితొలగించండి
  3. వందె మాతర గీతి వదలక మొదలిడు
    భక్తి రంజని తోడ ప్రజల లేపు
    ప్రాంతీయ వార్తల ప్రత్యేకముగ జెప్పు
    నాటిక వినిపించు పాట నేర్పు
    కర్షకులకు మరి కార్మికులకు స్త్రీలు
    పిల్లలు యువతకు వేరు వేరు
    కార్యక్రమములను కమనీయముగ వేయు
    చిత్ర రంజని దోచు చిత్తములను

    నాటి కాలమందు పూటయే గడవదు
    ఇదియె చేత లేక నెవరికైన
    ఆకసమ్ము జూచె నాకాశ వాణియె
    నేడు శ్రోత లేక నిజము నిజము.

    రిప్లయితొలగించండి
  4. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
    మీ పద్యము 1, 2 పాదములలో గణములు సరిగా లేవు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో "రూపమ్ము + అగుపడక" = అనుచోట యడాగమము రాదు - ఉకార సంధి అగును.
    అటులనే వాణిని + ఎరుగము = అనుచోట యడాగమము రాదు - నుగాగమము వచ్చును.

    రిప్లయితొలగించండి
  6. అయ్యా,
    మన్నింప ప్రార్థన.

    ఆకసమునుండి కనులకునగుపడకనె
    స్వరమునొక్కటి వినిపించు శక్తి యయిన
    నెట్టి యాకాశ వాణియు నెఱుగమిపుడు.
    దూర కేంద్రము నిట్లన తుష్టి కలుగు.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    నిజమే. గతకాలంలో వినిపించిన ‘అశరీరవాణి’ ఇప్పుడు మూగబోయింది. చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఆధునిక అశరీరవాణి ‘రేడియో’ను గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వందే’ శబ్దాన్ని హ్రస్వాంతంగా వ్రాసారు. ఆ పాదానికి నా సవరణ... ‘దినము మొదలగు వందే మాతరపు గీతి’

    రిప్లయితొలగించండి
  8. ఆకాశ వాణి పలుకుల
    నా కంసుడు వినిన తడవు నాగ్రహ మొందన్ !
    నీకిక మూడెను దినమని
    నేకతముగ భగిని జంప నెవ్విధి నైనన్ !

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కానీ మీరు ఉద్యోగం చేసిన ఆకాశవాణి (All India Radio) గురించి వ్రాస్తారనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  10. నిజమే నాకు 69 నుండి 2007 వరకు ఆకాశ వాణితో అనుబంధం ఉంది. ఉదయం లేచి చూసే సరికే పూరణలు నిండి పోయాయి.అందుకని వేరే ఎన్నుకున్నాను కాకపోతే ఎస్.బి.హెచ్ లో పనిచేస్తూ ,ఆకాశ వాణి ఏ.భీ.లకి కధలు , వ్యాసాలూ ఇచ్చాను.
    మిగిలిన అంతిమ దశలో కరిగిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ప్రోత్స హిస్తున్న మీ అందరి ఆదరాభి మానములకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  11. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

    రస హృదయముల నిల్చె “సరసవినోది
    ని” యట నాకాశ వాణికి నిక్కమైన
    నీల మణిగ చెలంగగ; నేడు జూడు
    “శంకరాభరణ”మ్మును శంకరార్య.

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    "సరసవినోదిని"ని ప్రస్తావించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మాస్టరు గారూ ! ధన్యవాదములు..చిన్న సవరణ జేయుచున్నాను.

    శుభోదయము జెప్పి సుప్రభాతంబున
    భక్తి రంజని తోడ ప్రజల లేపు
    ప్రాంతీయ వార్తల ప్రత్యేకముగ జెప్పు
    నాటిక వినిపించు పాట నేర్పు
    కర్షకులకు మరి కార్మికులకు స్త్రీలు
    పిల్లలు యువతకు వేరు వేరు
    కార్యక్రమములను కమనీయముగ వేయు
    చిత్ర రంజని దోచు చిత్తములను

    నాటి కాలమందు పూటయే గడవదు
    ఇదియె చేత లేక నెవరికైన
    ఆకసమ్ము జూచె నాకాశ వాణియె
    నేడు శ్రోత లేక నిజము నిజము.

    రిప్లయితొలగించండి
  14. హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరించిన తరువాత కూడా మొదటి పాదం, మొదటి గణం జగణ మయింది.

    రిప్లయితొలగించండి